‘ఆర్ఆర్ఆర్’ వివాదంలో రాజమౌళికి వార్నింగ్ ఇచ్చిన ఎంపీ

Published on Oct 27, 2020 11:36 pm IST


దర్శక ధీరుడు ఎస్ఎస్. రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న భారీ మల్టీస్టారర్ ‘ఆర్ఆర్ఆర్’. రామ్ చరణ్, ఎన్టీఆర్ కలిసి నటిస్తుండటం, బాహుబలి తర్వాత జక్కన్న నుండి వస్తున్న సినిమా కావడంతో ప్రేక్షకుల్లో అంచనాలు భారీగా ఉన్నాయి. ఇటీవలే సినిమా నుండి కొమురం భీమ్ పాత్ర చేస్తున్న ఎన్టీఆర్ తాలూకు టీజర్ ఒకటి ఈమధ్యే విడుదలైంది. టీజర్ దేశవ్యాప్తంగా ప్రేక్షకులను అలరించింది. అందరూ ప్రశంసల వర్షం కురిపించారు. అయితే ఈ ప్రశంసలతో పాటే ఒక్క వివాదం కూడ మీద పడింది. టీజర్ చివర్లో ఎన్టీఆర్ ముస్లిం వేషధారణలో తలపై టోపీ పెట్టుకుని కనబడ్డారు.

కొమురం భీమ్ నిజాం రాజులకు, రజాకార్లకు వ్యతిరేకంగా పోరాడారు. అలాంటి వ్యక్తి తల మీద ముస్లిం టోపీ పెట్టుకోవడం ఏమిటని అనేక మంది ప్రశ్నించారు. దీనిపై ఆదివాసీలు వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు. చరిత్రను వక్రీకరిస్తే ఊరుకునేది లేదని, ఆ సన్నివేశాలను తొలగించాలని లేకుంటే విడుదలయ్యాక థియేటర్ల మీద దాడి చేస్తామని ఆదిలాబాద్ బీజేపీ ఎంపీ సోయం బాపూరావు హెచ్చరించారు. మరి ఈ హెచ్చరికలకు రాజమౌళి నుండి ఎలాంటి సమాధానం వస్తుందో చూడాలి. ఇకపోతే ఈ సినిమాలో మరొక ప్రధాన పాత్ర అయిన అల్లూరి సీతారామరాజుగా చరణ్ కనిపించనున్నారు. చరిత్రలోని పాత్రల స్పూర్తితో ఫిక్షనల్ కథను రాసుకున్నట్టు రాజమౌళి సినిమా ఓపెనింగ్ రోజే తెలిపారు.

సంబంధిత సమాచారం :

More