‘జన్నత్ 2’, ‘రాజ్’ సినిమాలతో బాలీవుడ్ కి పరిచయమైన హాట్ మోడల్ ఈశ గుప్త. ఇప్పటి వరకూ బాలీవుడ్ లోనే సెటిల్ అయిన ఈ భామ త్వరలో ప్రారంభం కానున్న ఓ ద్విభాషా చిత్రం ద్వారా తెలుగు – తమిళ ప్రేక్షకులకు పరిచయం కానుంది. భీమిలి కబడ్డి జట్టు, ఎస్.ఎం.ఎస్ సినిమాలతో ఆకట్టుకున్న తాతినేని సత్య డైరెక్షన్ లో సచిన్ జోష్ హీరోగా ఓ సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా తెరకెక్కనుంది. ఈ సినిమాలో ఓ హీరోయిన్ చాలా గ్లామరస్ గా ఉండాలి. ఆ పాత్ర కోసం తాతినేని సత్య ఈశ గుప్త బాగా సరిపోతుందని, ముంబై వెళ్లి కథ చెప్పాడు. తనకి కథ నచ్చడంతో వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇప్పటివరకూ బాలీవుడ్ ప్రేక్షకులను తన అందచందాలతో ఆకట్టుకున్న ఈశ గుప్త ఇప్పుడు సౌత్ ఇండియన్ ఆడియన్స్ కూడా మెప్పించనుంది.
ప్రస్తుతం ఈశ గుప్తకి తెలుగు, తమిళ భాషలపై ట్రైనింగ్ ఇస్తున్నారు. మే 20 నుంచి ఒక వారం రోజుల పాటు తనకి ట్రైనింగ్ ఇస్తున్నారు. మే 27 నుంచి ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ పోలాండ్ లో ప్రారంభం కానుంది. ముందుగా పోలాండ్ లో ఓ పాటని షూట్ చేయనున్నారు. ఈ సినిమా కథ అంతా ఒక జైలు చుట్టూ తిరుగుతుంది. కబడ్డీ ప్లేయర్ అయిన హీరో తన గర్ల్ ఫ్రెండ్ ని మర్డర్ చేసిన కేసులో జైలుకి వెళ్తాడు. ఆ మర్డర్ మిస్టరీకి రొమాన్స్, యాక్షన్, థ్రిల్స్ కలిపి తీస్తున్నామని తాతినేని సత్య అంటున్నాడు. ఈ సినిమాకి సంబందించిన పూర్తి వివరాలు త్వరలో తెలియజేస్తారు. తాతినేని సత్య నారా రోహిత్ తో చేసిన ‘శంకర’ సినిమా విడుదల కావాల్సి ఉంది.


