విషాదం : బాలీవుడ్ టాప్ కమెడియన్ మృతి

Published on Sep 21, 2022 3:49 pm IST

బాలీవుడ్ చిత్ర పరిశ్రమలో కమెడియన్ గా తనకంటూ ప్రత్యేక క్రేజ్ అందుకున్న రాజు శ్రీవాస్తవ నేడు మృతి చెందారు. ఇటీవల జిమ్ లో వర్కౌట్స్ చేస్తూ ఒక్కసారిగా కుప్పకూలిపోయిన శ్రీవాస్తవని ముంబై ఎయిమ్స్ ఆసుపత్రికి తరలించారు. అయితే కొద్దిరోజులుగా మృత్యువుతో పోరాడిన శ్రీవాస్తవ నేడు ఈలోకాన్ని వీడి వెళ్లిపోవడం బాధాకరం. ఇక ఆయన మృతికి పలువురు ప్రేక్షకులు, అభిమానులు, బాలీవుడ్ చిత్ర ప్రముఖులు నివాళులు అర్పిస్తూ ఆయన పవిత్రాత్మకు శాంతి చేకూరాలని కోరుతున్నారు.

కెరీర్ ఆరంభంలో ముంబై లో ఆటోరిక్షా నడిపిన శ్రీవాస్తవ, ఆ తరువాత సినిమాల మీద ప్రేమతో బాలీవుడ్ కి అనిల్ కపూర్ హీరోగా తెరకెక్కిన తేజాబ్ మూవీ ద్వారా ఫస్ట్ టైం నటుడిగా ఎంట్రీ ఇచ్చారు. ఆ తరువాత సల్మాన్ ఖాన్ నటించిన బ్లాక్ బస్టర్ మైనే ప్యార్ కియా, షారుక్ ఖాన్ సూపర్ హిట్ మూవీ బాజీగర్ వంటి మూవీస్ లో నటించి తన కామెడీ నటనతో ఆడియన్స్ ని అలరించారు శ్రీవాస్తవ.

ఇక ఆ తరువాత 2005 లో టివి రంగంలోకి కూడా ఎంట్రీ ఇచ్చిన శ్రీవాస్తవ, అప్పట్లో స్టార్ వన్‌ ఛానల్ లో ప్రసారమైన ‘ది గ్రేట్ ఇండియన్ లాఫ్టర్ ఛాలెంజ్ షో’లో పాల్గొన్నారు. ఒకరకంగా ఆ షో శ్రీవాస్తవ జీవితాన్నే మార్చి వేసింది. ఈ షో ద్వారా చాలా పాపులారిటీ సంపాదించారు రాజు శ్రీవాస్తవ. దానితో కామెడీ కింగ్‌ గా మారి గజోధర్ భయ్యాగా ఆయనకి పేరు తెచ్చిపెట్టిన షో ఇదే. బాలీవుడ్ లో అమితాబ్ ని ఎంతో అమితంగా ప్రేమించే శ్రీవాస్తవ పలు సందర్భాల్లో ఆయన గురించి ఎంతో గొప్పగా చెప్పేవారు. ఇక నేడు ఆయన అకాల మరణం యావత్ బాలీవుడ్ చిత్ర రంగంలో తీవ్ర విషాదాన్ని మిగిల్చింది అని చెప్పాలి.

సంబంధిత సమాచారం :