నందిత శ్వేత.. ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’ అనే సినిమా విడుదలయ్యేంత వరకూ తెలుగు సినీ ప్రేక్షకులకు పెద్దగా పరిచయం కూడా లేని ఈ హీరోయిన్ ఒకే ఒక్కరోజులో టాక్ ఆఫ్ ది టౌన్ అయిపోయారు. నిఖిల్ హీరోగా తెరకెక్కిన ఈ సినిమా గత శుక్రవారం భారీ ఎత్తున ప్రేక్షకుల ముందుకు వచ్చేసి సూపర్ హిట్ టాక్‌తో దూసుకుపోతోంది. ఇందులో ఓ బలమైన పాత్రలో నటించిన నందిత నటనకు అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. కథకు కీలకమైన ఈ పాత్రలో ఆమె చూపిన ప్రతిభకు సాధారణ ప్రేక్షకుల నుంచే కాకుండా సినీ ప్రముఖుల నుంచి కూడా ప్రత్యేక ప్రశంసలు దక్కుతున్నాయి.
ముఖ్యంగా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నందితను ప్రత్యేకంగా అభినందించడం విశేషంగా చెప్పుకోవాలి. ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’లో తన నటన చాలా బాగుందని అల్లు అర్జున్ స్వయంగా ఫోన్ చేసి చెప్పడం మరిచిపోలేని అనుభూతి అని నందిత స్వయంగా తెలిపారు. ఆయనతో కలిసి నటించాలన్నది ఎప్పట్నుంచో తన కలని, ఆయన తన నటనను అభినందించండం ఆశ్చర్యం కలిగించిందని నందిత ఈ సందర్భంగా తెలిపారు. వీఐ ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ హర్రర్ థ్రిల్లర్ ఎంటర్‌టైనర్ బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్ళు రాబడుతూ దూసుకుపోతోంది. 500, 1000 రూపాయల నోట్ల రద్దు ప్రభావం ఈ సినిమాపై కనిపించకపోవడం మరో విశేషంగా చెప్పాలి. నిఖిల్ సరసన నందిత శ్వేతతో పాటు హెబ్బా పటేల్, అవికా గోర్ మరో ఇద్దరు హీరోయిన్లు నటించారు.