ఓటిటి సమీక్ష : “బటర్ ఫ్లై” – తెలుగు చిత్రం డిస్నీ+ హాట్ స్టార్ లో

Butterfly Movie-Review-In-Telugu

విడుదల తేదీ : డిసెంబర్ 29, 2022

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.5/5

నటీనటులు: అనుపమ పరమేశ్వరన్, నిహాల్ కోదాటి, భూమిక చావ్లా, రావు రమేష్, ప్రవీణ్

దర్శకుడు : గంటా సతీష్ బాబు

నిర్మాతలు: రవి ప్రకాష్ బోడపాటి, ప్రసాద్ తిరువళ్లూరి, ప్రదీప్ నల్లిమెల్లి

సంగీత దర్శకులు: అర్విజ్ & గిడియన్ కట్టా

సినిమాటోగ్రఫీ: సమీర్ రెడ్డి

ఎడిటర్: మధు

 

సంబంధిత లింక్స్: ట్రైలర్

 

లేటెస్ట్ గా ఓటిటిలో రిలీజ్ కి వచ్చిన చిత్రాల్లో యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ నటించిన ఫీమేల్ సెంట్రిక్ చిత్రం “బటర్ ఫ్లై” కూడా ఒకటి. డిస్నీ+ ప్లస్ హాట్ స్టార్ లో రిలీజ్ అయ్యిన ఈ చిత్రం ఎలా ఉందో సమీక్షలో తెలుసుకుందాం రండి.

 

కథ :

 

ఇక కథలోకి వస్తే.. గీత(అనుపమ) తన అక్కడ వైజయంతి(భూమిక) తో కలిసి ఉంటుంది. అయితే వైజయంతీ ఓ లాయర్ కాగా తన భర్తతో కొన్ని సమస్యలుతో ఆమె బాధపడుతూ ఉంటుంది. ఇదిలా ఉండగా వారి పిల్లలని గీత దగ్గర ఉంచి వారిని జాగ్రత్తగా చూసుకోమని చెప్పి ఆమె ముఖ్యమైన పని మీద ఢిల్లీకి వెళ్తుంది. కానీ అనూహ్యంగా గీత దగ్గర ఉన్న పిల్లలు కిడ్నాప్ కు గురవుతారు. మరి ఇక్కడ నుంచి గీత ఏం చేసింది? ఆ పిల్లలు ఏమయ్యారు? వారిని గీత ఎలా కనిపెడుతుంది. తన అక్కకి ఈ విషయం తెలుస్తుందా లేదా అనే ప్రశ్నలకి సమాధానం తెలియాలి అంటే ఈ సినిమాని చూడాల్సిందే.

 

ప్లస్ పాయింట్స్ :

 

హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చాక పెర్ఫామర్ గా అనుపమ సినిమాల్లో ఆకట్టుకుంది. అయితే ఇలాంటి ఫీమేల్ ఓరియెంటెడ్ చిత్రాల్లో కూడా అనుపమ ఇది వరకు నటించింది. మరి ఈసారి కూడా మంచి నటనను ఆమె కనబర్చింది అని చెప్పాలి. సినిమాలో తనపై ఎప్పుడైతే పరిస్థితులు కీలకంగా మారడం స్టార్ట్ అవుతాయో అక్కడ నుంచి ఆమె సినిమాని మరింత ముందుకు తీసుకెళ్లింది అని చెప్పాలి.

సెన్సిబుల్ భావోద్వేగాలు, తన స్టన్నింగ్ మేకోవర్ తో అనుపమ అయితే ఈ చిత్రంలో ఆశ్చర్యపరుస్తుంది. అలాగే సినిమాలో పలు సన్నివేశాలు మంచి ఆసక్తిగా కొనసాగుతాయి. దీనితో ఆడియెన్స్ లో థ్రిల్ అనుభూతి కలుగుతుంది. అలాగే సినిమాలో కొన్ని ట్విస్ట్ లు కూడా బాగున్నాయి. ఇక అలాగే అనుపమతో కనిపించిన భూమిక నటుడు నిహాల్ లు డీసెంట్ పెర్ఫామెన్స్ ని తమ పాత్రల పరిధి మేరకు అందించారు. వీటితో పాటుగా సినిమాలో ఉన్న చిన్నపాటి మెసేజ్ కూడా బాగుంది.

 

మైనస్ పాయింట్స్ :

 

ఈ చిత్రంలో పెద్ద డ్రా బ్యాక్ ఏదన్నా ఉంది అంటే సినిమాలో సరైన స్క్రీన్ ప్లే ఆడియెన్స్ కి కనిపించదు. రొటీన్ స్టోరీ లైన్ అయినప్పటికీ స్క్రీన్ ప్లే ని ఇంకా గ్రిప్పింగ్ గా రాసుకొని ప్రెజెంట్ చేసి ఉంటే బెటర్ గా అనిపించేది. అలాగే కొన్ని చోట్ల థ్రిల్ గా సాగుతుంది అనుకుంటే మరికొన్ని చోట్ల ఆ ఫ్లో మిస్ అయ్యింది అనేది బాగా తెలుస్తుంది.

దీనితో చూస్తున్నంతసేపు సో సో గానే సినిమా అనిపిస్తుంది. అలాగే చాలా సన్నివేశాలు కొంచెం రొటీన్ గా సాగదీతగా కూడా కనిపిస్తాయి దీనితో మరింత బోరింగ్ గా అనిపిస్తుంది. అలాగే సినిమాలో కనిపించే ముఖ్య పాత్రలని లిమిటెడ్ గానే ఉంచేశారు. దీనితో అలంటి నటుల్ని పెట్టుకొని అంత ఇంపార్టెన్స్ ఇచ్చినట్టుగా అనిపించదు.

 

సాంకేతిక వర్గం :

 

ఈ చిత్రంలో నిర్మాణ విలువలు బాగున్నాయి. ఇక టెక్నికల్ టీం లో మ్యూజిక్ బాగుంది అలాగే బ్యాక్గ్రౌండ్ స్కోర్ లు కూడా పలు సీన్స్ కి బాగా ప్లస్ అయ్యాయి. అలాగే సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటింగ్ ఇంకా బాగా చెయ్యాల్సి ఉంది. డైలాగ్స్ పర్వాలేదు.

ఇక దర్శకుడు గంటా సతీష్ బాబు విషయానికి వస్తే తన వర్క్ పూర్తి స్థాయిలో మెప్పించలేదు అని చెప్పాలి. కొన్ని కొన్ని అంశాలు వరకు పర్వాలేదు కానీ చాలా అంశాల్లో అయితే తన వర్క్ ఆకట్టుకోదు. సరైన స్క్రీన్ ప్లే లేదు, కొన్ని పాత్రలు పరిమితంగా ప్రెజెంట్ చెయ్యడం, కథనంలో ఫ్లో మిస్ చేయడం వంటివి చాలానే దెబ్బ కొట్టాయి. దీనితో అయితే తాను మరింత బెటర్ గా సినిమాని ప్రెజెంట్ చేసి ఉంటే బాగుండు.

 

తీర్పు :

 

ఇక మొత్తంగా చూసినట్టు అయితే ఈ “బటర్ ఫ్లై” చిత్రంలో అనుపమ మాత్రం తప్పక ప్రతి ఒక్కరిని ఇంప్రెస్ చేసి ఆశ్చర్యపరుస్తుంది. అక్కడక్కడా కొన్ని అంశాలు బాగున్నాయి తప్ప ఇక ఇతర అంశాలు అంతగా మెప్పించేలా ఈ సినిమాలో అయితే లేవు. అక్కడక్కడా కొన్ని థ్రిల్స్, అనుపమ నటన కోసం ఓసారి చూడాలి అనుకునే వారు ఈ వారాంతానికి ఒక్కసారి ఈ చిత్రాన్ని చూడొచ్చు లేదా స్కిప్ చేసేయొచ్చు.

123telugu.com Rating: 2.5/5

Reviewed by 123telugu Team

Click Here For English Review

Exit mobile version