టాలీవుడ్ ప్రముఖ పాటల రచయిత రామజోగయ్య శాస్త్రి పెద్ద కుమారుడు సాయి తేజ వివాహం తాజాగా జరిగింది. ఈ వివాహ వేడుకలో భాగంగా శనివారం రోజున రిసెప్షన్ హైదరాబాద్‌లో అట్టహాసంగా నిర్వహించారు. ఈ రిసెప్షన్ వేడుకకు టాలీవుడ్‌కి చెందిన పలువురు ప్రముఖులు హాజరయ్యారు.
ఈ రిసెప్షన్ వేడుకలో మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఇరువురు హీరోలు ఒకరినొకరు పలకరించుకున్న వీడియో నెట్టింట వైరల్ అయ్యింది. తమ అభిమాన హీరోలను ఇలా కలిసి చూడటంతో ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేశారు. ఇక ఈ వేడుకకి మంచు మోహన్ బాబు, హాస్యబ్రహ్మ బ్రహానందం కూడా హాజరయ్యారు.
వీరితో పాటు యంగ్ హీరో అడివి శేష్, విజయ్ భాస్కర్, ఎస్వీ కృష్ణారెడ్డి, బోయపాటి శ్రీను, శ్రీను వైట్ల, మెహర్ రమేశ్, మణిశర్మ, దేవిశ్రీప్రసాద్, దగ్గుబాటి సురేష్ బాబు, రామ్ మిర్యాల, శ్రీ కృష్ణ, అర్మాన్ మాలిక్, రేవంత్, అనంత్ శ్రీరామ్ , ధనుంజయ్ , రమ్య బెహ్రా, శ్రీరామ్ చంద్ర, తదితరులు హాజరై నూతన వదువరులను ఆశీర్వదించారు.