ప్రముఖ రాజకీయ నాయకుడు, ప్రముఖ నటుడు నందమూరి హరికృష్ణగారి మరణంతో సినీ రాజకీయ రంగాలు తీవ్ర దిగ్భ్రాంతి లోనయ్యాయి. కాగా హరికృష్ణగారి మృతి పై పలువురు సినీ ప్రముఖులు సోషల్ మీడియా ద్వారా తమ సంతాపన్ని తెలియజేస్తున్నారు. అక్కినేని నాగార్జున హరికృష్ణగారితో తన చివరి సంభాషణ గురించి ట్విటర్ లో తెలియజేస్తూ… ‘కొన్నివారాలకి క్రితమే హరికృష్ణగారు నాతో.. నిన్ను చూసి చాలా రోజులు అయింది తమ్ముడు. నిన్ను కలవాలి తమ్ముడు అని అన్నారని తెలుపుతూ…. మిస్ యూ అన్న’ అంటూ నాగార్జున తన సంతాపాన్ని తెలిపారు. అలాగే మిగిలిన సినీ ప్రముఖులు కూడా హరికృష్ణగారి మృతి పట్ల తమ సంతాపాన్ని తెలిపారు.
ఈ విషాద సంఘటన విన్నవెంటనే షాక్ కు గురయ్యాను. నాకు ఇప్పుడు మాటలు రావడం లేదు. దేవుడు నిజంగా చాలా కఠినమైనవాడు. నందమూరి హరికృష్ణగారి కుటుంబసభ్యులకు, అభిమానులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను – మంచు మనోజ్
ఈ ఉదయం నిద్రలేవగానే ఇంత ఘోరమైన విషాద వార్త వినాల్సి రావడం, నన్ను తీవ్రంగా కలచి వేస్తోంది. హరికృష్ణగారి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను. ఈ విషాదాన్ని అధిగమించడానికి తారక్, కళ్యాణ్ తో పాటు వారి కుటుంబసభ్యులందరికి ఆ భగవంతుడు శక్తిని ఇవ్వాలని ప్రార్ధిస్తున్నాను – సుధీర్ బాబు
నందమూరి హరికృష్ణ గారి మరణవార్త నన్ను షాక్ కు గురిచేసింది. ఆయన చాలా గొప్ప మనసున్న వ్యక్తి. కుటుంబసభ్యులకు, అభిమానులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను – అల్లరి నరేష్
నందమూరి హరికృష్ణగారి గురించి ఇలాంటి దురదృష్టకరమైన వార్త వినడం నమ్మలేకపోతున్నాను. చాలా గొప్ప వ్యక్తి. నాకు, నా తండ్రికి ఆయన చాలా ఆప్తుడు. ఆ భగవంతుడు కుటుంబసభ్యులకు శక్తిని ప్రసాదించాలని కోరుకుంటున్నాను .- దేవీశ్రీ ప్రసాద్
ఈ వార్త నన్ను చాలా షాక్‌కు గురిచేసింది. ఆయన కుటుంబసభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆ దేవుడ్ని కోరుకుంటున్నాను. – మంచు లక్ష్మీ
ఈ వార్త నన్న షాక్‌కు గురిచేసింది. ఆయన మృతి నందమూరి కుటుంబానికి తీరని లోటు. ఆయన మంచి వ్యక్తి, గొప్ప తండ్రి. నా బాధను వ్యక్తపరచడానికి మాటలు రావడం లేదు. ఇది విషాదకరమైన రోజు – కోన వెంకట్