విడుదల తేదీ : ఫిబ్రవరి 14, 2025
123తెలుగు.కామ్ రేటింగ్ : 3/5
నటీనటులు : విక్కీ కౌశల్, రష్మిక మందన్న, అక్షయ్ ఖన్నా, అశుతోష్ రానా, దివ్య దత్తా, డయానా పెంటి తదితరులు
దర్శకుడు : లక్ష్మణ్ ఉటేకర్
నిర్మాత : దినేష్ విజన్
సంగీతం : ఏఆర్ రెహమన్
సినిమాటోగ్రఫీ : సౌరభ్ గోస్వామి
ఎడిటర్ : మనీష్ ప్రధన్
సంబంధిత లింక్స్ : ట్రైలర్
మరాఠా యోధుడు ఛత్రపతి శంభాజీ మహారాజ్ వీరగాథను మనకు ‘ఛావా’ చిత్రంలో చూపించే ప్రయత్నం చేశారు. విక్కీ కౌశల్ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం నేడు భారీ అంచనాల మధ్య థియేటర్లలో రిలీజ్ అయింది. మరి ఈ సినిమా ప్రేక్షకులను ఎంతమేర ఆకట్టుకుందో ఈ రివ్యూలో చూద్దాం.
కథ :
ఛత్రపతి శివాజీ మహారాజ్ మరణంతో మరాఠా సామ్రాజ్యం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఇదే అనువుగా భావించిన మొగల్ చక్రవర్తి ఔరంగజేబు(అక్షయ్ ఖన్నా) మరాఠా సామ్రాజ్యాన్ని దక్కించుకునేందుకు ప్రయత్నిస్తాడు. అయితే, అతడికి ఊహించని విధంగా ఛత్రపతి శంభాజీ మహారాజ్(విక్కీ కౌశల్) అడ్డుగా నిలుస్తాడు. తన యుద్ధవిద్యలు మొగల్ సైన్యాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తాడు శంభాజీ. ఈ పరిణామంతో ఔరంగజేబు స్వయంగా యుద్ధభూమిలో దిగుతాడు. అయితే, మరాఠా సామ్రాజ్యంలో శంభాజీకి కొందరు వెన్నుపోటు పొడిచి ద్రోహం తలపెడతారు. మరి ఈ క్రమంలో శంభాజీ మహారాజ్ తన సామ్రాజ్యాన్ని కాపాడుకుంటారా లేదా..? శత్రుసైన్యం తో కలిసి శంభాజీకి వెన్నుపోటు పొడిచింది ఎవరు..? అనే విషయాలు తెలియాలంటే ఈ సినిమాను వెండితెరపై చూడాల్సిందే.
ప్లస్ పాయింట్స్ :
ఛత్రపతి శంభాజీ మహారాజ్ పాత్రలో విక్కీ కౌశల్ అద్భుతమైన పర్ఫార్మెన్స్ ఇచ్చారు. ముఖ్యంగా క్లైమాక్స్‌లో అతడి నటన ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఆయన డైలాగ్ డెలివరీ, స్క్రీన్ ప్రెజెన్స్ సినిమాను మరింత ఎలివేట్ చేసే విధంగా ఉన్నాయి.
రష్మిక మందన్న తనకు ఇచ్చిన పాత్రను సమర్ధవంతంగా పోషించింది. ఆమె పాత్రకు ప్రాధాన్యత ఉన్నప్పటికీ, ఆమె స్క్రీన్ ప్రెజెన్స్ లిమిటెడ్‌గా ఉంటుంది.
ఔరంగజేబు పాత్రలో అక్షయ్ ఖన్నా డీసెంట్‌గా పర్ఫార్మ్ చేశాడు. అశుతోష్ రానా, దివ్య దత్తా, డయానా పెంటీ తదితరులు తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు.
మైనస్ పాయింట్స్ :
ఇలాంటి చారిత్రక చిత్రాలలో కథాబలం ఎంత బాగున్నా, దాని ఎగ్జిక్యూషన్ కూడా బాగుండాలి. దర్శకుడు లక్ష్మణ్ ఉటేకర్ డైరెక్షన్ ఆకట్టుకున్నా, స్క్రీన్ ప్లే విషయంలో ఇంకాస్త షార్ప్‌గా ఉండాల్సింది. ప్రేక్షకులను ఎంగేజింగ్‌గా పెట్టడంలో స్క్రీన్ ప్లే తడబడింది.
ఫస్ట్ హాఫ్ సాగదీతగా అనిపిస్తుంది. సెకండ్ హాఫ్‌లోని వార్ సీన్స్‌ను మరింత గ్రిప్పింగ్‌గా తీర్చిదిద్దాల్సింది. వెన్నుపోటు, ద్రోహం వంటి అంశాలను మరింత బలమైన ఎమోషన్‌తో ప్రెజెంట్ చేసి ఉండాల్సింది. అలా చేసి ఉంటే కథను మరింత ఆసక్తిగా ముందుకు తీసుకెళ్లేవారు.
కథలో బలమైన పాత్రలు చాలా ఉన్నప్పటికీ, కొన్నింటికి మాత్రమే ప్రాధాన్యత ఇచ్చిన్నట్లు అనిపిస్తుంది. శివాజీ మహారాజ్ వాయిస్ ఓవర్‌తో పాటు కొంచెం విజువల్ గ్లింప్స్ కూడా ఉండి ఉంటే సినిమాకు మరింత ఇంపాక్ట్ వచ్చేది.
ఔరంగజేబు పాత్రలో అక్షయ్ ఖన్నా బాగా సూట్ అయినా, తన పాత్రకు మరికొంత ప్రాధాన్యత ఇచ్చి ఉండాల్సింది.
సాంకేతిక వర్గం:
లక్ష్మణ్ ఉటేకర్ శంభాజీ మహారాజ్ వీరత్వాన్ని చాలా కన్విక్షన్‌తో ప్రెజెంట్ చేశారు. కానీ, స్క్రీన్‌ప్లే పై మరింత ఫోకస్ పెట్టి ఉంటే సినిమాకు బలం చేకూరేది. ఏఆర్ రెహమాన్ సంగీతం డీసెంట్‌గా ఉంది. రిషి విర్మాని, ఇర్షద్ కమిల్ డైలాగ్స్ ఆకట్టుకుంటాయి.
ఎడిటింగ్ వర్క్ ఇంకాస్త బెటర్‌గా ఉండాల్సింది. ముఖ్యంగా ఫస్ట్ హాఫ్‌లో కొన్ని సీన్స్‌లో మనకు ఎడిటింగ్ లోపం కనిపిస్తుంది. నిర్మాణ విలువలు ఆకట్టుకుంటాయి. సినిమాలోని విజువల్స్ చాలా గ్రాండియర్‌గా కనిపిస్తాయి. సౌరభ్ గోస్వామి సినిమాటోగ్రఫీ మరికొంత మెరుగ్గా ఉండాల్సింది.
తీర్పు :
మొత్తంగా చూస్తే, ‘ఛావా’ చిత్రం ఓ హిస్టారికల్ యాక్షన్ డ్రామాగా ఆకట్టుకుంటుంది. విక్కీ కౌశల్ అద్భుతమైన పర్ఫార్మెన్స్ ఈ సినిమాకు బలంగా నిలిచింది. కానీ, కొన్ని సాగదీత సీన్లు, లెంగ్తీగా అనిపించే నెరేషన్ సినిమాకు మైనస్‌గా నిలిచాయి. ఛత్రపతి శివాజీ మహారాజ్, శంభాజీ మహారాజ్‌ల వీరత్వాన్ని మరోసారి చూడాలని అనుకునేవారికి ఈ సినిమా కనెక్ట్ అవుతుంది. కామన్ ఆడియన్స్ కూడా ఈ సినిమాను ఈ వీకెండ్‌లో ట్రై చేయవచ్చు.
123telugu.com Rating: 3/5
Reviewed by 123telugu Team