భీమ్ ముస్లిం వేషధారణ మీద విమర్శలు, అనుమానాలు

భీమ్ ముస్లిం వేషధారణ మీద విమర్శలు, అనుమానాలు

Published on Oct 24, 2020 2:07 AM IST


రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న ‘ఆర్ఆర్ఆర్’ సినిమా నుండి కొమురం భీమ్ పాత్ర యొక్క టీజర్ నిన్న కొమురం భీమ్ జయంతి సందర్భంగా విడుదలైంది. భీమ్ పాత్రలో తారక్ స్క్రీన్ ప్రెజెన్స్ చూసి అభిమానులు, ప్రేక్షకులు బాగా ఇంప్రెస్ అయ్యారు. టీజర్ మీద ప్రశంసల వర్షం కురుస్తోంది. అయితే పొగడ్తలతో పాటు విమర్శలు, అనుమానాలు కూడ పుట్టుకొచ్చాయి. ఎన్టీఆర్ చేస్తున్న భీమ్ పాత్ర తెలంగాణ పోరాట యోధుడు కొమురం భీమ్ పాత్ర ఆధారంగా డిజైన్ చేయబడిన పాత్ర. కొమురం భీమ్ కు తెలంగాణ చరిత్రలో ప్రముఖ స్థానం ఉంది. నిజాం పాలనకు, రజాకార్ల అకృత్యాలకు వ్యతిరేకంగా పోరాడిన గిరిజన వీరుడు కొమురం భీమ్.

అయితే నిన్న విడుదలైన టీజర్లో కొమురం భీమ్ పాత్ర ముస్లిం వేషధారణలో కనిపిస్తుంది. ఇదే విమర్శలకు కారణమైంది. భీమ్ నిజాం నిరంకుశ పాలనపై పోరాడితే ఆయన్ను ముస్లిం వేషధారణలో చూపడం ఏమిటని, కల్పిత గాథ అంటూ చరిత్రను వక్రీకరిస్తున్నారా ఏమిటి, భీమ్ ప్రతిష్టకు భంగం కలిగేలా సినిమా ఉంటే రాజమౌళి అండ్ టీమ్ తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కోవలసి ఉంటుంది అంటున్నారు కొందరు నెటిజన్లు. అయితే నిన్న విడుదలైంది కేవలం టీజరే. పూర్తి సినిమా చూస్తే తప్ప అందులో ఏముంది, భీమ్ పాత్ర ముస్లిం దుస్తుల్లో కనిపించడం వెనుక ఆంతర్యం ఏమిటి, దాని ద్వారా రాజమౌళి ఏం చెప్పాలనుకున్నారు వంటి విషయాల మీద స్పష్టత వస్తుంది. అయినా రాజమౌళి లాంటి దర్శకుడు చరిత్రను అందులోని వీరులను వక్రీకరించే ప్రయత్నం చేస్తారని అంత సులభంగా ఒక నిర్ణయానికి రాలేం కదా.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు