టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ తో గుంటూరు కారం మూవీ చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ భారీ ప్రాజక్ట్ పై అందరిలో ఎన్నో అంచనాలు ఉన్నాయి. ఇక దీని అనంతరం రాజమౌళి దర్శకత్వంలో భారీ పాన్ వరల్డ్ మూవీ SSMB 29 చేయనున్నారు మహేష్. ఇక హీరోగా రాజకుమారుడు మూవీతో అడుగుపెట్టిన మహేష్ బాబు, అంతకముందు బాలనటుడిగా తొలిసారిగా దర్శకరత్న దాసరి నారాయణరావు తెరకెక్కించిన నీడ మూవీ ద్వారా తెలుగు చిత్రసీమ లోకి అడుగుపెట్టారు.
దాసరి ప్రయోగాత్మకంగా తెరకెక్కించిన ఈ మూవీ 1979 నవంబర్ 29న విడుదలై మంచి విజయం అందుకుంది. మురళిమోహన్, ఆర్ నారాయణమూర్తి, రమేష్ బాబు ఈ మూవీలో ప్రధాన పాత్రల్లో కనిపించారు. కాగా ఆ మూవీ ద్వారా నటుడిగా నేటితో సక్సెసుల్ గా 44 ఏళ్ళ సినీ కెరీర్ ని పూర్తి చేసుకున్నారు మహేష్ బాబు. అనంతరం బాలనటుడిగా మరికొన్ని సినిమాల్లో నటించి మంచి పేరు సంపాదించిన మహేష్, హీరోగా ఫస్ట్ మూవీ రాజకుమారుడు తో అతి పెద్ద బ్లాక్ బస్టర్ సొంతం చేసుకుని ఫస్ట్ మూవీతోనే స్టార్ స్టేటస్ సొంతం చేసుకున్నారు.
ఇక అక్కడి నుండి అనేక హిట్స్, సూపర్ హిట్స్, బ్లాక్ బస్టర్స్ అండ్ ఇండస్ట్రీ హిట్స్ తో తిరుగులేని సూపర్ స్టార్ గా టాలీవుడ్ తో పాటు యావత్ భారతదేశం గర్వించదగ్గ నటుల్లో ఒకరిగా దూసుకుపోతున్నారు. ఈ సందర్భంగా పలువురు సినీ ప్రేక్షకులు, అభిమానులు సూపర్ స్టార్ మహేష్ బాబుకు తమ సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా ప్రత్యేకంగా శుభాభినందనలు తెలియచేస్తున్నారు.