విడుదల తేదీ : ఫిబ్రవరి 28, 2025
123తెలుగు.కామ్ రేటింగ్ : 2.5/5
నటీనటులు : షబానా అజ్మీ, జ్యోతిక, నిమిషా సజయన్, శాలినీ పాండే, అంజలి ఆనంద్, జిషుసేన్ గుప్త తదితరులు
దర్శకుడు : హితేశ్ భాటియా
ఒరిజినల్ స్కోర్ : గౌరవ్ రైనా, తరానా మర్వాహ్
నిర్మాణం : ఎక్సెల్ మీడియా అండ్ ఎంటర్‌టైన్‌మెంట్
సినిమాటోగ్రఫీ : ఈషిత్ నరైన్
ఎడిటింగ్ : మానస్ మిట్టల్, పరీక్షిత్ ఝా
సంబంధిత లింక్స్ : ట్రైలర్
డ్రగ్స్ అండ్ క్రైమ్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కిన థ్రిల్లింగ్ వెబ్ సిరీస్ ‘డబ్బా కార్టెల్’ ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‌కు వచ్చింది. పలువురు లేడీ స్టార్స్ లీడ్ రోల్స్‌లో నటించిన ఈ వెబ్ సిరీస్‌ను దర్శకుడు హితేశ్ భాటియా డైరెక్ట్ చేశారు. మరి ఈ వెబ్ సిరీస్ ప్రేక్షకులను ఎంతమేర మెప్పించిందో ఈ రివ్యూలో చూద్దాం.
కథ :
ముంబై నేపథ్యంలో సాగే ఈ కథలో ఓ ఫార్మా కంపెనీ తయారు చేసిన డ్రగ్స్ వల్ల కొన్ని ప్రమాదాలు చోటుచేసుకుంటాయి. ఈ డ్రగ్స్‌కు అనుమతి లేని కారణంగా అసలు విషయాన్ని బయటపెట్టేందుకు ఫుడ్ అండ్ డ్రగ్స్ ఆఫీసర్ పాఠక్(గజరాజ్ రావు) ఇన్వెస్టిగేషన్ మొదులపెడతాడు. అయితే, ఈ ఊబిలోకి అనుకోకుండా డబ్బా బిజినెస్ చేస్తున్న రాజీ(షాలినీ పాండే), మాల(నిమిషా సజయన్), షాహిదా(అంజలి ఆనంద్) చిక్కుకుంటారు. వారికి తోడుగా షీలా(షబానా అజ్మీ), వరుణా(జ్యోతిక) కూడా ఈ డ్రగ్స్ మాఫియాలోకి ఎంటర్ అవుతారు. మరి ఈ మాఫియా వెనుక ఉన్నది ఎవరు..? అసలు ఫార్మా కంపెనీతో ఈ డబ్బా బిజినెస్ మహిళలకు ఎలాంటి సంబంధం ఉంది..? వీరంతా కలిసి చివరకు ఏం చేశారు..? అనేది ఈ వెబ్ సిరీస్ కథ.
ప్లస్ పాయింట్స్ :
డ్రగ్స్ అండ్ క్రైమ్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ వెబ్ సిరీస్ స్క్రీన్‌ప్లే, ట్విస్టులతో ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. అయితే, ఈ వెబ్ సిరీస్ మొదటి ఎపిసోడ్‌ను ఖచ్చితంగా వీక్షించాల్సి ఉంటుంది. లేదంటే కథలోని పాత్రల ఇంట్రో మిస్ అవుతారు. ఇక పాత్రల ఇంట్రొడక్షన్ మొదలుకొని, వారి నేపథ్యం.. ఒకరితో మరొకరికి ఎలాంటి సంబంధం ఉంటుందనే అంశాలను చక్కగా ఎస్టాబ్లిష్ చేశారు.
మొత్తం 7 ఎపిసోడ్స్‌గా ఉన్న ఈ వెబ్ సిరీస్‌లో ముఖ్య పాత్రలకు సంబంధించిన అంశాలను బాగా హ్యాండిల్ చేశారు. ముఖ్యంగా డబ్బా బిజినెస్‌లోని మహిళల నేపథ్యం, వారిలో సాగే ఎమోషన్స్ చక్కగా ప్రెజెంట్ చేశారు. ఎపిసోడ్స్ సాగుతున్న కొద్ది, ఇతర పాత్రలు, వారి తాలుకా షేడ్స్ ఎలా మారుతాయి అనేది కూడా బాగా చూపెట్టారు.
విభిన్న పాత్రల మధ్య సాగే రిలేషన్స్, బోల్డ్ ఎలిమెంట్స్ కూడా మనకు లోతుగా చూపెట్టారు. ఇక డ్రగ్స్ కథ ముందుకు సాగున్నకొద్దీ ప్యారలెల్‌గా వాటిని చేధించేందుకు పోలీసులతో కలిసి డ్రగ్స్ ఆఫీసర్ చేసే ప్రయత్నాలు ఆకట్టుకుంటాయి. కథలో అసలైన విలన్‌ను పర్ఫెక్ట్ టైమ్‌లో రివీల్ చేయడం ప్రేక్షకులను ఇంప్రెస్ చేస్తుంది. పాత్ర ప్రాధాన్యతకు సంబంధం లేకుండా నటీనటుల పర్ఫార్మెన్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.
మైనస్ పాయింట్స్ :
పక్కా క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్‌లో ట్విస్టులు, పర్ఫార్మెన్స్‌లు ఉన్నప్పటికీ కథనంలో వేగం లేకపోతే ప్రేక్షకులు దానికి త్వరగా కనెక్ట్ కాలేరు. ‘డబ్బా కార్టెల్’ వెబ్ సిరీస్ విషయంలోనూ ఇదే జరిగింది. సినిమాలో మంచి కంటెంట్ ఉంది. పర్ఫార్మెన్స్‌లకు మంచి స్కోప్ కూడా ఉంది. కానీ, ప్రేక్షకులను కనెక్ట్ చేసేందుకు కావాల్సిన గ్రిప్పింగ్ అంశాలు మాత్రం మిస్ అయ్యాయి.
పాత్రలు ఎక్కవ కావడం ఈ వెబ్ సిరీస్‌కు నష్టం వాటిల్లిందని చెప్పాలి. క్యాస్టింగ్, వారి నుంచి పర్ఫార్మెన్స్‌ను రాబట్టాలనే ఉద్దేశ్యంతో కథ ట్రాక్ తప్పుతున్నా దర్శకుడు హితేశ్ భాటియా జాగ్రత్త పడలేకపోయాడు. కథను సాగదీతగా చూపించడంతో చాలా సీన్స్ బోరింగ్‌గా అనిపిస్తాయి. కథలోకి ఒక్కో పాత్ర వస్తున్నకొద్ది, వారికి సంబంధించిన సీన్లు కొంతమేర విసిగిస్తాయి. చిన్న సీన్స్‌ను కూడా చాలాసేపు సాగదీయడం ప్రేక్షకుల సహనాన్ని పరీక్షిస్తాయి.
ఇలాంటి మంచి కంటెంట్ ఉన్న వెబ్ సిరీస్ విషయంలో మేకర్స్ చాలా జాగ్రత్తలు పడాల్సి ఉంటుంది. కానీ క్యాస్టింగ్‌కు మాత్రమే ప్రిఫరెన్స్ ఇవ్వడంతో ఓ మంచి క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ ఓ రొటీన్ క్రైమ్ సిరీస్‌గా మిగిలిపోయింది. స్క్రీన్‌ప్లే, సంగీతం, ఎడిటింగ్ విషయంలో మేకర్స్ జాగ్రత్త పడిఉంటే ఈ వెబ్ సిరీస్ ఫలితం వేరేగా ఉండేది.
నటీనటుల పర్ఫార్మెన్స్:
లంచ్ డబ్బా డెలివరీ బిజినెస్ చేసే మహిళలుగా షాలినీ పాండే, నిమిషా మాల, అంజలీ ఆనంద్ తమ పాత్రల్లో మంచి నటన కనబరిచారు. ముఖ్యంగా నిమిషా తన పర్ఫార్మెన్స్‌తో ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఇక ఈ వెబ్ సిరీస్‌కే హైలైట్‌గా షబానా అజ్మీ నిలిచిందని చెప్పాలి. ఆమె తన నటనతో ఆకట్టుకుంటుంది. అయితే, జ్యోతిక లాంటి సీనియర్ నటికి ప్రాధాన్యత తగ్గినట్టు అనిపిస్తుంది. మిగతా నటీనటులు తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు.
సాంకేతిక విభాగం:
దర్శకుడు హితేశ్ భాటియా ఎంచుకున్న కథ బాగున్నా, దాన్ని పర్ఫెక్ట్‌గా ఎగ్జిక్యూట్ చేయడంలో ఫెయిల్ అయ్యాడు. మంచి కథ, పర్ఫార్మర్లు ఉన్నా.. వాటిని ఉపయోగించుకోలేకపోయాడు. కథను మరింత గ్రిప్పింగ్‌గా మలిచి ఉండాల్సింది. ఇక సంగీత పరంగా ఈ వెబ్ సిరీస్‌లో బీజీం బాగుంది. సీన్స్‌కు అనుగుణంగా మంచి స్కోర్ ఉంటుంది. కానీ, మధ్యలో వచ్చే సాంగ్స్ విసిగిస్తాయి. సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటింగ్ వర్క్ ఇంకా మెరుగ్గా ఉండాల్సింది. చాలా సీన్స్‌ను ట్రిమ్ చేయాల్సి ఉన్నట్లుగా అనిపిస్తుంది. నిర్మాణ విలువలు బాగున్నాయి.
తీర్పు:
ఓ మంచి క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్‌కు కావాల్సిన కంటెంట్ ‘డబ్బా కార్టెల్’లో కనిపిస్తుంది. కానీ, దానిని పర్ఫెక్ట్‌గా ఎగ్జిక్యూట్ చేయలేకపోవడంతో ఇదొక రొటీన్ అండ్ బోరింగ్ వెబ్ సిరీస్‌గా మిగిలింది. నటీనటులు ఎక్కువగా ఉండటంతో కథ ట్రాక్ తప్పుతుంది. థ్రిల్లింగ్ క్రైమ్ సిరీస్ ఇష్టపడే ఆడియన్స్ వేరొక ఆప్షన్ చూసుకోవడం బెటర్.
123telugu.com Rating: 2.5/5
Reviewed by 123telugu Team