నాని హీరోగా శ్రీకాంత్ ఓదెల తెరకెక్కిస్తున్న లేటెస్ట్ భారీ పాన్ ఇండియన్ మాస్ యాక్షన్ మూవీ దసరా. కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీని శ్రీలక్షి వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి నిర్మించగా సంతోష్ నారాయణన్ దీనికి సంగీతం అందించారు. ఫస్ట్ లుక్ పోస్టర్స్, సాంగ్స్, టీజర్ తో అందరినీ ఆకట్టుకున్న దసరా థియేటరికల్ ట్రైలర్ మార్చి 14న అలానే మూవీ మార్చి 30న విడుదల కానున్నాయి. ఇక ఈ మూవీలో కీలమైన పాత్ర చేసిన యువ నటుడు దీక్షిత్ శెట్టి నేడు మీడియాతో ఆ మూవీ గురించిన పలు అనుభవాలు పంచుకున్నారు.
మీట్ క్యూట్ వెబ్ సిరీస్ కోడైరెక్టర్ వినయ్ ఇటీవల దసరా మూవీలో క్యారెక్టర్ కోసం తనని రిఫర్ చేశారని దీక్షిత్ శెట్టి తెలిపారు. మీట్ క్యూట్‌లో నాని తన నటనను ఎంతో ఇష్టపడ్డాడని, అందుకే దసరాలో తీసుకునేందుకు ఆయన ఆసక్తి చూపారని అన్నారు. దసరాలో నాని సన్నిహితుడిగా సూరి పాత్రలో నేను నటిస్తున్నాను, అలానే ఈ సినిమాలో నాది పూర్తి స్థాయి పాత్ర అని దీక్షిత్ చెప్పారు. దసరా తనకు మరో మూడు సినిమాల్లో అవకాశాలు తెచ్చిపెట్టిందని అన్నారు.
తాను తెలంగాణ స్లాంగ్ నేర్చుకున్నానని, సినిమా కోసం తన బాడీ లాంగ్వేజ్‌పై పట్టుకోసం చాలా హోమ్ వర్క్ చేసానని అన్నారు. షూటింగ్ సమయంలో నాని నుంచి చాలా నేర్చుకున్నానని, శ్రీకాంత్ ఓదెల సినిమాలోని సీన్స్ విషయమై తాను కోరుకున్నది సాధించే వరకు రాజీపడరని అన్నారు. తనని నమ్మి దసరా లో కీలకమైన పాత్రను అందించినందుకు నిర్మాత సుధాకర్ గారికి రుణపడి ఉంటానని దీక్షిత్ అన్నారు. కన్నడ ప్రేక్షకులు కూడా దసరా కోసం ఎదురు చూస్తున్నారని, ఈ రోజుల్లో సినిమాలకు భాషాపరమైన అడ్డంకులు లేవని, తప్పకుండా ఈ మూవీ అన్ని భాషల్లో పెద్ద సక్సెస్ అందుకుంటుందని ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేసారు.