ఓ బాపు.. వద్దనుకున్నా వచ్చేస్తున్నాయి ఈ కన్నీళ్లు.

bapu
వద్దనుకున్నా వచ్చేస్తున్నాయి ఈ కన్నీళ్లు…
ఆ సొగసుల గీతలను ఇక గీసెదెవరు అని..?

మౌనంగా రోదించేను వేల తెలుగు హృదయాలు..
తెలుగును వెలిగించే మరో మనిషి ఎప్పుడొస్తాడు అని..?

ఏమని వర్ణించాలి… ఎలా చెప్పాలి. బాపు గొప్పతనం గురించి చెప్పడానికి తెలుగు అక్షరమాలలో పదాలు సరిపోవు. కుంచెతో బొమ్మ గీయడానికి పేజిలు సరిపోవు. సినిమా ద్వారా చెప్పడానికి 3 గంటల సమయం సరిపోదు. కార్టూనిస్ట్ గా, దర్శకుడిగా తెలుగు జాతి ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పిన మహా మనిషి. మన కీర్తి ప్రతిష్టలను ఎల్లలు దాటించిన తెలుగు మనిషి.

సుధీర్గ తన సినిమా ప్రస్థానంలో అజాత శత్రువుగా పేరు గడించిన దిగ్గజ దర్శకుడు మరణిస్తే తెలుగు సినిమా పరిశ్రమ ప్రముఖులు ప్రవర్తించిన తీరు శోచనీయం. చిరంజీవి, బాలకృష్ణ, మోహన్ బాబు, ఎస్.పి.బాలు, శేఖర్ కమ్ముల, దేవి శ్రీ ప్రసాద్ వంటి వారు తప్పితే ఇతర ఇండస్ట్రీ పెద్దలు బాపు అంత్యక్రియల సమయంలో కనిపించలేదు. బాలీవుడ్ నుండి వచ్చిన అనిల్ కపూర్, బోనీ కపూర్ సోదరులు చివరి కట్టే కాలే వరకు స్మశానంలో ఉండి తమ గురువుకు నివాళి అర్పించారు.మరి తెలుగు తెలుగు భాష వెలిగిపోయేలా చేసిన మనిషి పట్ల మన పరిశ్రమ ప్రముఖులు చూపిన గౌరవం ఎంత..?

శతాధిక చిత్ర దర్శకులు, ఇండస్ట్రీలో మహా మహా దర్శకులు ఏమయ్యారు. టెక్నాలజీ పెరిగింది కదా..! టీవీలకు ఒక వీడియో బైట్, పత్రికలు, వెబ్ సైట్లకు ఒక ప్రెస్ నోట్ పంపించి ఊరుకున్నారు. ఇక అగ్ర నిర్మాతల సంగతి సరే సరి,ఏమయ్యారో తెలియదు. తన సినిమాలతో ఎందరో నటులకు నటనలో ఓనమాలు నేర్పారు బాపు. వారు మాత్రం ఏం చేశారు. పబ్లిసిటీ కోసం పత్రికలతో బాపుతో తమ అనుభందాన్ని పంచుకున్నారు. ఒక్క రోజు తమ షూటింగ్లకు సెలవు పెట్టి, తమ పనులను పక్కన పెట్టి చెన్నై వెళ్ళలేక పోయారు. చెన్నైలో స్థిరపడడమే బాపు చేసిన నేరమా..? వీళ్ళను చూసి ఏమనగలం… బాపును అనుసరిస్తూ మౌనంగా ఉండడం తప్ప.

రేపటి సినిమాను.. నిన్ననే ఆలోచించి.. ఇవాళే తీసేసిన.. దిగ్దర్శకుడు బాపుకు భారత ప్రభుత్వం ఉత్తి ‘పద్మశ్రీ’ ఇచ్చారు. ‘పద్మవిభూషణ్’కు అర్హులైన బాపు గారిపై ప్రభుత్వం వాళ్ళు చేసిన అతి పెద్ద కార్టూన్ అది అని దర్శకులు త్రివిక్రమ్ శ్రీనివాస్ అన్నారు. మీరు చెప్పింది నిజమే త్రివిక్రమ్ గారు. బాపు అంత్యక్రియలకు హాజరుకాకపోవడం అంత కన్నా పెద్ద కార్టూన్ కాదంటారా..? మన తెలుగు చిత్ర పరిశ్రమ ప్రముఖులు అర్పించిన నివాళి అటువంటిది. పరిశ్రమ ప్రముఖులకు గుర్తు లేకపోయినా సగటు సిని ప్రేమికుడి గుండెల్లో బాపు చిరకాలం జీవించి ఉంటారు.

తెలుగు అక్షరం బ్రతికున్నంత కాలం బాపు మన మనసులలో జీవించి ఉంటారు.
కార్టూన్ కాలగర్భంలో కలసిపోనంత వరకు బాపు మన హృదయాలలో శ్వాసిస్తూ ఉంటారు…

Exit mobile version