హుధూద్ తుఫాన్ సృష్టించిన విలయం సామాన్యులతో పాటు కొందరు సినిమా ప్రముఖులకు తీవ్ర నష్టాన్ని కలిగించింది. విశాఖ తీరంలో గల రామానాయుడు స్టూడియో, నగరంలో వినాయక్ సొంత థియేటర్ వి మాక్స్ పూర్తిగా ధ్వంసమయ్యాయి. వీటి పునరుద్దరణ కోసం చాలా ఖర్చు కానుంది.
తమకు కలిగిన నష్టాన్ని పక్కన పెట్టి, తమను ఆదరించిన ప్రేక్షకులను ఆదుకోవడానికి తారాలోకంతో పాటు మేము సైతం అంటూ రామానాయుడు ఫ్యామిలీ & వినాయక్ ముందడుగు వేశారు. బాధితుల సహాయార్థం ప్రముఖ నిర్మాత రామానాయుడు ఫ్యామిలీ రూ.10లక్షలు, దర్శకుడు వివి వినాయక్ రూ.10లక్షల విరాళాన్ని ప్రకటించారు.
త్వరలో విశాఖ రామానాయుడు స్టూడియో పునరుద్దరణ పనులు ప్రారంభిస్తామని దగ్గుబాటి రానా చెప్పారు. గతంలో కంటే మెరుగైన వసతులు, అధునాతన టెక్నాలజీతో స్టూడియో కొత్త రూపుతో తీర్చిదిద్దుతామని తెలిపారు. వైజాగ్ పరిస్థితులు చక్కబడిన తర్వాత వి మాక్స్ థియేటర్ పనులు కూడా ప్రారంభిస్తారని సమాచారం.


