సమీక్ష : ‘దేవకీ నందన వాసుదేవ’ – బోరింగ్ ఎమోషనల్ అండ్‌ మైథాలాజికల్‌ డ్రామా !

Devaki Nandana Vasudeva Movie Review in Telugu

విడుదల తేదీ : నవంబర్ 22, 2024

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.25/5

నటీనటులు : అశోక్ గల్లా, మానస వారణాసి, దేవదత్తా నాగే, దేవయాని, ఝాన్సీ, సంజయ్ స్వరూప్, శత్రు, శ్రీధర్ రెడ్డి, గెటప్ శ్రీను తదితరులు

దర్శకుడు : అర్జున్ జంధ్యాల

కథ : ప్రశాంత్ వర్మ

నిర్మాతలు : సోమినేని బాలకృష్ణ

సంగీత దర్శకుడు : భీమ్స్ సిసిరోలియో

సినిమాటోగ్రఫీ : ప్రసాద్ మూరెళ్ల

ఎడిటర్ : తమ్మిరాజు

సంబంధిత లింక్స్: ట్రైలర్

గల్లా అశోక్ హీరోగా వచ్చిన సినిమా ‘దేవకీ నందన వాసుదేవ’. ఈ సినిమాకి ప్రశాంత్ వర్మ కథ అందించారు. అర్జున్ జంధ్యాల దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం ఈ రోజు విడుదల అయింది. మరి ప్రేక్షకులను ఈ చిత్రం ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం !

 

కథ :

కంసరాజు (దేవదత్తా నాగే) రాక్షసంగా ప్రవర్తిస్తూ ఉంటాడు. అతన్ని ఎదిరించే దమ్ము, ధైర్యం ఎవరికీ లేవు. ఐతే, కాశీ వెళ్లిన కంస రాజుకు అతని చెల్లెలి మూడో సంతానం వల్ల ప్రాణగండం ఉందని ఓ శివ సాధువు చెబుతాడు. ఈ క్రమంలో జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల మధ్య 21 ఏళ్ళు గడిచిపోతాయి. కంసరాజు చెల్లెలు (దేవయాని)కి అమ్మాయి సత్య (మానస వారణాసి) జన్మిస్తుంది. ఓ పెళ్లిలో సత్యను చూసి కృష్ణ (అశోక్ గల్లా) ఆమెతో ప్రేమలో పడతాడు. 21 ఏళ్ళు జైలు జీవితం గడిపి బయటకు వచ్చిన కంస రాజు తన చెల్లెలు కూతుర్ని ఏం చేశాడు ?, అసలు కంసరాజు దగ్గర అతని చెల్లెలు ఏ నిజం దాచింది ?, తాను ప్రేమించిన సత్య కోసం కృష్ణ ఏం సాధించాడు ?, చివరకు కంస రాజును కృష్ణ ఏం చేశాడు ? అనేది మిగిలిన కథ.

 

ప్లస్ పాయింట్స్ :

మైథాలజీ టచ్ చేస్తూ తీసిన ఈ సినిమాలో కొన్ని ఎమోషనల్ ఎలిమెంట్స్ జస్ట్ పర్వాలేదు. ఈ సినిమాలో హీరోగా నటించిన అశోక్ గల్లా తన నటనతో, తన బాడీ లాంగ్వేజ్ తో మరియు యాక్షన్ సీక్వెన్స్ స్ లో బాగానే నటించాడు. అలాగే క్లిష్టమైన కొన్ని కీలక సన్నివేశాల్లో కూడా అశోక్ గల్లా నటన బాగుంది. హీరోయిన్ మానస వారణాసి తన నటనతో అలరించింది. కొన్ని ప్రేమ సన్నివేశాల్లో కూడా ఆమె నటన బాగుంది.

సినిమాలో మరో కీలకమైన పాత్రలో నటించిన దేవదత్తా నాగే కూడా తన పాత్రకి పూర్తి న్యాయం చేశారు. మరో కీలక పాత్రలో దేవయాని కూడా ఆకట్టుకుంది. హీరోకి తల్లి పాత్రలో ఝాన్సీ ఒదిగిపోయింది. సంజయ్ స్వరూప్, శత్రు, శ్రీధర్ రెడ్డి, గెటప్ శ్రీను మరియు మిగిలిన నటీనటులు కూడా తమ పాత్ర పరిధి మేరకు బాగా నటించారు.

 

మైనస్ పాయింట్స్ :

ఈ ‘దేవకీ నందన వాసుదేవ’ సినిమా మెయిన్ పాయింట్ లో మ్యాటర్ ఉన్నప్పటికీ.. ఆ పాయింట్ కి తగ్గట్టు స్క్రీన్ ప్లే రాసుకోవడంలో దర్శకుడు తడబడ్డాడు. అసలు ఇలాంటి కాన్సెప్ట్ తీసుకున్నప్పుడు ఆ కాన్సెప్ట్ కి తగ్గట్టు సినిమాని ఆద్యంతం ఉత్కంఠ రేకెత్తిస్తూ స్క్రీన్ ప్లే ఫుల్ ఇంట్రెస్ట్ గా సాగితే బాగుండేది. కానీ, ఈ సినిమా అలా సాగలేదు. కథలో మైథాలజీ టచ్ ఇచ్చినా చాలా చోట్ల లాజిక్ లెస్ డ్రామాగా మిగిలిపోయింది.

హీరో అశోక్ పాత్ర రైజ్ కోసం మెలో డ్రామా సీన్స్ ను పెట్టడం బాగాలేదు. అసలు ఈ డిజిటల్ వరల్డ్ లో ఓ మూఢనమ్మకాన్ని మరీ ఇంత సినిమాటిక్ గా చూపించడం బాగాలేదు. దేవదత్తా నాగే పాత్రను ఇంకా బలంగా రాసుకోవాల్సింది. అలాగే, కథలో చాలా చోట్ల బలమైన కాన్ ఫ్లిక్ట్ ను ఎస్టాబ్లిష్ చేయాల్సింది. పురాణం ఆధారంగా కథ అల్లుకున్నా.. కథలో ఆసక్తి క్రియేట్ అవ్వలేదు అంటే.. ఆ కథ రాసిన కథకుడిదే తప్పు.

ఇక హీరోహీరోయిన్ల మధ్య వచ్చే లవ్ ట్రాక్ లోని ప్రేమ సన్నివేశాలు కూడా చాలా పేలవంగా సాగుతాయి. దీనికితోడు లాజిక్స్ కూడా ఎక్కడా కనిపించవు. అలాగే హీరోవిలన్ల మధ్య యాక్షన్ ట్రాక్ కు కూడా సరైన బలం లేదు. మొత్తానికి ఈ సినిమా చాలా చోట్ల బోర్ కొట్టిన ఫీలింగ్ కలుగుతుంది.

 

సాంకేతిక విభాగం :

టెక్నికల్ గా చూసుకుంటే.. సినిమాలో సాంకేతిక విభాగం వర్క్ బాగానే ఉంది. ముఖ్యంగా భీమ్స్ సిసిరోలియో సంగీతం సినిమాకు ప్లస్ అయింది. అదే విధంగా ప్రసాద్ మూరెళ్ల సినిమాటోగ్రఫీ వర్క్ కూడా సినిమాకి హైలైట్ గా నిలిచింది. ఎడిటర్ తమ్మిరాజు ఎడిటింగ్ సినిమాకి తగ్గట్టు ఉంది. ఐతే, ప్రశాంత్ వర్మ రాసిన కథలో మ్యాటర్ లేదు. అర్జున్ జంధ్యాల దర్శకత్వం పర్వాలేదు. ఇక ఈ సినిమాలో నిర్మాత సోమినేని బాలకృష్ణ పాటించిన ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగున్నాయి.

 

తీర్పు :

మైథాలజీ టచ్ తో ‘దేవకీ నందన వాసుదేవ’ అంటూ వచ్చిన ఈ ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామాలో.. మెయిన్ కాన్సెప్ట్, మరియు కొన్ని ఎమోషనల్ సీన్స్ పర్వాలేదు. అయితే, ఇంట్రెస్టింగ్ గా సాగని ట్రీట్మెంట్ తో పాటు మెయిన్ క్యారెక్టైజేషన్స్ బలహీనంగా ఉండటం, ముఖ్యంగా కథాకథనాలు ఆసక్తికరంగా లేకపోవడం వంటి అంశాలు సినిమా ఫలితాన్ని దెబ్బ తీశాయి. ఓవరాల్ గా కొన్ని విజువల్ ఎలిమెంట్స్ బాగున్నా.. ఈ చిత్రం మాత్రం ఆకట్టుకోలేకపోయింది.

123telugu.com Rating: 2.25/5

Reviewed by 123telugu Team

Exit mobile version