విడుదల తేదీ : డిసెంబర్ 29, 2023
123తెలుగు.కామ్ రేటింగ్ : 3/5
నటీనటులు: నందమూరి కల్యాణ్‌రామ్. సంయుక్త మీనన్, శ్రీకాంత్ అయ్యంగార్, మాళవిక నాయర్, సత్య, అజయ్ తదితరులు
దర్శకుడు : అభిషేక్ నామా
నిర్మాత: అభిషేక్ నామా
సంగీతం: హర్షవర్ధన్ రామేశ్వర్
సినిమాటోగ్రఫీ: సౌందర్ రాజన్.ఎస్
ఎడిటర్: తమ్మిరాజు
సంబంధిత లింక్స్: ట్రైలర్
నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటించిన చిత్రం “డెవిల్”. కాగా ఈ చిత్రం ఈ రోజు విడుదలైంది. మరి ఈ సినిమా ప్రేక్షకులను ఏ స్థాయిలో ఆకట్టుకుందో చూద్దాం..
కథ :
భారతదేశంలో బ్రిటిష్ పాలనా నేపథ్యంలో జరిగిన కథ ఇది. ఓ జమీందారు కుటుంబంలో జరిగిన హత్య ఎవరు చేశారో విచారణ చేయడానికి డెవిల్ (నందమూరి కళ్యాణ్ రామ్ ) వస్తాడు. అసలు సీక్రెట్ ఏజెంట్ అయిన డెవిల్, ఆ దివాణంలో జరిగిన హత్య విచారణ కోసం ఎందుకు రావాల్సి వచ్చింది ?, ఆ హత్య జరిగిన బంగ్లాలో ఉంటున్న నైషధ (సంయుక్త మీనన్) ఎవరు ?, ఆమెను డెవిల్ ఎందుకు టార్గెట్ చేశాడు ?, ఇంతకీ.. నైషధ కి నేతాజీకి ఉన్న సంబంధం ఏమిటి ?, అదే విధంగా ఆ హత్య ఎందుకు జరిగింది ?, ఈ మొత్తం వ్యవహారంలో మాళవిక నాయర్ పాత్ర ఏమిటి ?, చివరికి డెవిల్ (కళ్యాణ్ రామ్) లోని అసలు పాత్ర ఏమిటి ? అనేది మిగిలిన కథ.
ప్లస్ పాయింట్స్ :
కళ్యాణ్ రామ్ తన గత చిత్రాల కంటే భిన్నంగా బ్రిటిష్ నేపథ్యంలో ఈసారి మైండ్ గేమ్ యాక్షన్ డ్రామాతో సీక్రెట్ ఏజెంట్ గా వచ్చాడు. అలాగే, ఈ సినిమాలో తన లుక్స్ లో అండ్ యాక్షన్ లో ఫ్రెష్ నెస్ చూపించడానికి కళ్యాణ్ రామ్ చేసిన ప్రయత్నం బాగుంది. ముఖ్యంగా సీక్రెట్ ఏజెంట్ గా కళ్యాణ్ రామ్ నటన సినిమాకే హైలెట్ గా నిలుస్తోంది. మెయిన్ గా సెకండ్ హాఫ్ లో త్రివర్ణ పాత్రకు సంబంధించి రివీల్ అయ్యే ట్విస్ట్, అండ్ ప్రధాన యాక్షన్ సన్నివేశాలు చాలా బాగున్నాయి. సంయుక్త మీనన్ తో నడిచే ప్రేమ సన్నివేశాలు మరియు హీరో – హీరోయిన్ల మధ్య కెమిస్ట్రీ కూడా బాగానే ఆకట్టుకుంటుంది.
ఇటు హీరోయిన్ సంయుక్త మీనన్ కూడా చాలా సెటిల్డ్ గా చక్కగా నటించింది. మరో కీలక పాత్రలో నటించిన మాళవిక నాయర్ కూడా తన నటనతో ఆకట్టుకుంది. సందర్భానుసారంగా ఆమె పలికించిన హావభావాలు బాగున్నాయి. ఈ చిత్రానికి మరో ప్రధానాకర్షణ నేతాజీ పాత్ర చుట్టూ స్క్రీన్ ప్లేను నడపడం. ఇక విలన్ గా నటించిన బ్రిటిష్ నటులు కూడా బాగానే నటించారు.
కమెడియన్ సత్యతో పాటు శ్రీకాంత్ అయ్యంగార్, అజయ్ మరియు మిగిలిన నటీనటులు కూడా తమ పాత్ర పరిధి మేరకు బాగానే నటించారు. రచయిత శ్రీకాంత్ విస్సా రాసుకున్న మెయిన్ పాయింట్ అండ్ ట్రీట్మెంట్ బాగున్నాయి. మొత్తమ్మీద ఈ చిత్రంలో యాక్షన్ సీన్స్ తో పాటు కొన్ని థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ కూడా బాగానే ఉన్నాయి.
మైనస్ పాయింట్స్ :
డెవిల్ లో మెయిన్ కంటెంట్ అండ్ పాయింట్ బాగున్నా.. స్క్రీన్ ప్లే విషయంలో కొన్ని చోట్ల స్లో అనిపించింది. ఫస్ట్ హాఫ్ కథనం విషయంలో రాజీ పడకుండా ఉండి ఉంటే బాగుండేది. ముఖ్యంగా సెకండాఫ్ లో సినిమా జరుగుతున్నంతసేపు తర్వాత ఏం జరుగుతుందనే ఉత్కంఠను ఇంకా పెంచగలిగే స్కోప్ ఉన్నపటికీ మేకర్స్ ఆ అవకాశాన్ని పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోలేదు. అలాగే సెకండ్ హాఫ్ ను కాస్త ఎమోషనల్ గా నడుపుదామని మంచి ప్రయత్నం చేశారు గాని, కొన్ని చోట్ల అది స్క్రీన్ మీద ఎఫెక్టివ్ గా వర్కౌట్ కాలేదు.
సాంకేతిక విభాగం :
ఇక సాంకేతిక నిపుణుల గురించి మాట్లాడుకుంటే.. దర్శకుడు అభిషేక్ నామా తెరకెక్కించిన యాక్షన్ సీక్వెన్సెస్ బాగున్నాయి. సినిమాలో చాలా చోట్ల లాజిక్స్ మిస్ కాకుండా ఉండి ఉంటే.. సినిమా ఇంకా బాగుండేది. ఇక సంగీతం విషయానికి వస్తే.. పాటలు ఫర్వాలేదనిపిస్తే, నేపథ్య సంగీతం కొన్ని చోట్ల మాత్రమే బాగుంది. సినిమాటోగ్రఫర్ పనితనం ఈ సినిమాకి ప్రధాన బలం. ప్రతి ఫ్రేమ్ చాలా ఎఫెక్టివ్ గా తీశారు. సినిమాలోని నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి.
తీర్పు :
‘డెవిల్’ అంటూ వచ్చిన ఈ యాక్షన్ స్పై థ్రిల్లర్ లో.. యాక్షన్ సీక్వెన్సెస్ అండ్ కొన్ని థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఆకట్టుకున్నాయి. తన యాక్టింగ్ అండ్ యాక్షన్ తో కళ్యాణ్ రామ్ మెప్పించాడు. ఐతే, రొటీన్ స్క్రీన్ ప్లే, కీలక సన్నివేశాలు స్లోగా సాగడం వంటి అంశాలు సినిమాకి మైనస్ అయ్యాయి. మొత్తమ్మీద ఈ చిత్రంలో మెయిన్ పాయింట్ తో పాటు యాక్షన్ ఎలిమెంట్స్ అండ్ ట్విస్ట్ లు బాగున్నాయి. ఓ వర్గం ప్రేక్షకులకు ఈ చిత్రం బాగా కనెక్ట్ అవుతుంది.
123telugu.com Rating: 3/5
Reviewed by 123telugu Team