ఆ ఇద్దరి కుటుంబాల‌కు దిల్ రాజు ఆర్థిక సాయం

స్టార్ దర్శకుడు శంకర్ – గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కాంబినేషన్లో రాబోతున్న సెన్సేషనల్ ప్రాజెక్ట్ ‘గేమ్ ఛేంజర్’. జనవరి 10, 2025న ఈ సినిమా థియేటర్లలోకి రానుంది. ఐతే, శ‌నివారం రాజ‌మ‌హేంద్ర‌వ‌రంలో గేమ్ చేంజ‌ర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ జ‌రిగిన సంగ‌తి తెలిసిందే. ఆ వేడుక‌లో పాల్గొని తిరిగి ఇళ్ల‌కు వెళుతున్న క్ర‌మంలో కాకినాడ జిల్లా గైగోలుపాడుకు చెందిన ఆరవ మణికంఠ (23), తోకాడ చరణ్‌(22) ప్ర‌మాద‌వ‌శాత్తు మ‌ర‌ణించారు. ఈ ఘ‌ట‌న గురించి తెలిసిన వెంట‌నే నిర్మాత దిల్‌రాజు మీడియా స‌మ‌క్షంలో వెంట‌నే స్పందిస్తూ వారి కుటుంబాలకు ఆర్థిక సాయాన్ని ప్రకటించారు.

ఈ సందర్భంగా దిల్ రాజు మాట్లాడుతూ ‘గేమ్ చేంజర్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ చాలా ఘ‌నంగా జ‌రిగింది. ఆ విష‌యంపై మేం సంతోషంగా ఉన్న స‌మ‌యంలో ఇలా ఇద్ద‌రు అభిమానులు తిరుగు ప్ర‌యాణంలో జ‌రిగిన ప్ర‌మాదంలో చ‌నిపోవ‌టం ఎంతో బాధాక‌రం. వారి కుటుంబాల‌కు నేను అండ‌గా ఉంటాను. నా వంతుగా వారి కుటుంబాల‌కు చెరో రూ.5ల‌క్ష‌ల ఆర్థిక సాయాన్ని అందిస్తున్నాను. ఇలాంటి ఘ‌ట‌న జ‌రిగిన‌ప్పుడు కుటుంబాల్లో ఎంత బాధ ఉంటుందో అర్థం చేసుకోగ‌ల‌ను. వారికి నా ప్ర‌గాఢ సానుభూతిని వ్య‌క్తం చేస్తున్నాను’ అని దిల్ రాజు చెప్పుకొచ్చారు.

ఇక సంక్రాంతికి విడుదలవుతున్న భారీ చిత్రాల్లో ఈ సినిమా కూడా ఒకటి. ఈ సినిమాలో కియారా అద్వానీ కథానాయికగా నటిస్తోంది. మరో కీలక పాత్రలో అంజలి కనిపించనుంది. అన్నట్టు గేమ్ ఛేంజర్ నార్త్ ఇండియా థియేటర్స్ రైట్స్ ను అనిల్ తడాని యొక్క AA ఫిల్మ్స్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.

Exit mobile version