సీఎం రేవంత్ రెడ్డితో టాలీవుడ్ సినీ పరిశ్రమ పెద్దలు భేటీ అయిన సంగతి తెలిసిందే. ఈ భేటీ తర్వాత పలు మాధ్యమాల్లో ఫేక్ వార్తలు ప్రసారం అవుతున్నాయని FDC చైర్మన్ దిల్ రాజు అన్నారు. సీఎం మీటింగ్‌లో అసలు జరగనివి కూడా జరిగినట్టు వార్తలు వేస్తున్నారని ఆయన మండిపడ్డారు.
సీఎం మీటింగ్ తర్వాత దిల్ రాజు ప్రెస్ మీట్ నిర్వహించి మాట్లాడారు. సీఎం రేవంత్ రెడ్డి గారితో మీటింగ్ చాలా బాగా జరిగిందని.. 0.5 పర్సెంట్ కూడా ఈ మీటింగ్‌లో నెగిటివ్ లేదని.. సినీ ఇండస్ట్రీ పట్ల ఆయన చాలా సానుకూలంగా ఉన్నారని దిల్ రాజు తెలిపారు.
ఇక బెనిఫిట్ షోలు, టిక్కెట్ రేట్స్ గురించి అసలు టాపిక్ రాలేదని.. పోలీసులు సంధ్య థియేటర్ దగ్గర జరిగిన వీడియోలు తమకు ప్రదర్శించలేదని.. బౌన్సర్స్ విషయాన్ని తమకు డీజీపీ చెప్పారని.. ప్రతిదీ అకౌంట్బిలిటీగా ఉండాలని డీజీపీ సూచించినట్లు దిల్ రాజు పేర్కొన్నారు. హాలీవుడ్ సినిమాలు కూడా హైదరాబాద్‌లో షూటింగ్ జరిపేలా అభివృద్ధి చేద్దామని.. హైదరాబాద్‌కు ఐటీ ఫార్మా రంగాలు ఎంత కీలకమో సినీ పరిశ్రమకూడా అంతే కీలకంగా భావిస్తున్నట్టు సీఎం చెప్పారు.
సామాజిక సేవా కార్యక్రమాల్లో సెలబ్రటీలు పాల్గొనాలని.. అలాగే గద్దర్ అవార్డ్స్‌ను FDCతో అనుసంధానంగా జరగాలని సీఎం తమతో చెప్పినట్లుగా దిల్ రాజు తెలిపారు. పలు మీడియా ఛానల్స్‌లో వస్తున్న ఫేక్ వార్తలను నమ్మకండి అంటూ దిల్ రాజు కోరారు.