కళాతపస్వి కె.విశ్వనాథ్ ఆరోగ్యం విషయంలో సోషల్ మీడియాలో అనేక రూమర్స్ వస్తున్నాయి. అయితే తాజాగా విశ్వనాథ్ తన ఆరోగ్యం పై వస్తున్న రూమర్స్ పై స్పందించారు. విశ్వనాథ్ మాట్లాడుతూ.. ‘ కేసీఆర్ గారు నన్ను చూడటానికి రావడంతో నా ఆరోగ్యం బాగాలేదని రూమర్స్ వచ్చాయి. నేను ఎలాంటి అనారోగ్యంతో బాధపడటం లేదు. కేసీఆర్ నా వద్దకు మర్యాద పూర్వకంగానే వచ్చారు. సినిమాలో పాట నచ్చి నన్ను కలుస్తా అని రాత్రి కేసీఆర్ ఫోన్ చేసి మాట్లాడారు. నా అభిమానిగానే ఆయన మా ఇంటికి వచ్చారని’ తెలిపారు.
ఎన్నో కళాత్మకమైన అద్భుత చిత్రాలను విశ్వనాథ్ గారు తీశారు. ముఖ్యంగా శంకరాభరణం, సిరిసిరి మువ్వ, స్వాతిముత్యం లాంటి క్లాసిక్ చిత్రాలు విశ్వనాథ్ గారి దర్శకత్వంలో వచ్చాయి. అయితే విశ్వనాథ్ గారు చివరిసారిగా దర్శకత్వం వహించిన చిత్రం ‘శుభప్రదం’. 2010లో వచ్చిన ఈ సినిమా తరువాత మళ్లీ విశ్వనాథ్ గారు దర్శకత్వం చేయలేదు. ఇక తానూ దర్శకత్వం చేయనని ఆయన స్పష్టం చేశారు. అయితే గత కొన్నేళ్లుగా ఆయన తన నటనతో తెలుగు ప్రేక్షకులను అలరిస్తున్నారు.