స్టార్ హీరో సూర్య నటిస్తున్న ప్రెస్టీజియస్ మూవీ ‘కంగువా’. ఈ చిత్రాన్ని భారీ పీరియాడిక్ యాక్షన్ ఫిల్మ్‌గా దర్శకుడు శివ రూపొందిస్తున్నారు. దిశా పటానీ, బాబీ డియోల్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ‘కంగువా’ సినిమాను హ్యూజ్ బడ్జెట్ తో ప్రముఖ నిర్మాణ సంస్థలు స్టూడియో గ్రీన్, యూవీ క్రియేషన్స్ బ్యానర్స్ పై కేఈ జ్ఞానవేల్ రాజా, వంశీ, ప్రమోద్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాను నైజాం ఏరియాలో మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్ రిలీజ్ చేయబోతున్నారు. ‘కంగువా’ సినిమా ఈ నెల 14న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తోంది. ఈ సందర్భంగా తాజా ఇంటర్వ్యూలో ‘కంగువా’ మూవీ హైలైట్స్ తెలిపారు దర్శకుడు శివ.
– తెలుగు చిత్ర పరిశ్రమలో నా ప్రయాణం మొదలైంది. ‘ప్రేమంటే ఇదేరా’ సినిమాకు అసిస్టెంట్ కెమెరామెన్ గా వర్క్ చేశాను. ఆ తర్వాత ఎడిటింగ్ నేర్చుకున్నాను. చిన్నప్పటి నుంచి సాహిత్యం చదవడం అలవాటు. అలా రైటింగ్ మీద ప్యాషన్ ఏర్పడింది. ఇప్పటిదాకా 9 చిత్రాలకు డైరెక్షన్ చేశాను. కంగువా దర్శకుడిగా నా పదో సినిమా.
– స్టూడియో గ్రీన్ సంస్థలో నేను గతంలో ‘సిరుతై’ అనే సినిమా రూపొందించాను. ఆ తర్వాత సుదీర్ఘ విరామం అనంతరం మళ్లీ ప్రొడ్యూసర్ జ్ఞానవేల్ గారితో కలిసి ‘కంగువా’కు వర్క్ చేశాను. కొన్ని స్క్రిప్ట్స్ జ్ఞానవేల్ గారికి చెప్పినప్పుడు కంగువా వారికి బాగా నచ్చింది. ఈ కథను సూర్య గారికి చెప్పమన్నారు. సూర్య గారిని కలిసి స్క్రిప్ట్ నెరేట్ చేశాను. ఆయన చాలా బాగుంది శివ అంటూ హగ్ చేసుకున్నారు. ఈ మూవీ చేసేందుకు అంగీకరించారు. అలా ‘కంగువా’ జర్నీ మొదలైంది.
– ‘కంగువా’ కోసం రెండున్నరేళ్లుగా వర్క్ చేస్తున్నాం. పర్పెక్ట్గా ప్రీ ప్రొడక్షన్ ప్లానింగ్ చేసుకున్నాం. త్రీడీలోనూ సినిమా రూపొందించాలని అందుకు తగిన టెక్నికల్ మెథడ్స్ యూజ్ చేశాం. త్రీడీ మూవీస్ లో ‘కంగువా’ ఒక బెస్ట్ మూవీ అవుతుంది.
– సూర్య గారు కంగువా, ఫ్రాన్సిస్ అనే రెండు పాత్రల్లో కనిపిస్తారు. కంగువా వెయ్యేళ్ల కిందట వీరుడి పాత్ర. ఈ పాత్రకు హద్దులు లేవు, ఎవరూ నియంత్రించలేరు. ఫ్రాన్సిస్ ను కొన్ని అంశాలతో కంట్రోల్ చేయవచ్చు. ఈ పీరియాడిక్ పాత్రతో పాటు మోడరన్ క్యారెక్టర్ లో సూర్య గారి పర్ఫార్మెన్స్ అద్భుతంగా ఉంటుంది.
– బాబీ డియోల్ గారి వీడియో ఒకటి చూసి ఆయన స్వాగ్ నచ్చి ఈ మూవీలో ఉధిరన్ క్యారెక్టర్ కు ఎంచుకున్నాను. ఉధిరన్ రూత్ లెస్ గా ఉంటాడు. అలాంటి వ్యక్తిత్వమున్న పాత్రకు బాబీ డియోల్ గారి స్వాగ్ ఉంటే కొత్తగా స్క్రీన్ మీద కనిపిస్తుంది అనిపించింది. బాబీ డియోల్ గారు తన స్క్రీన్ ప్రెజెన్స్ తో ‘కంగువా’కు ఎనర్జీ తీసుకొచ్చారు. ఇది తన కెరీర్ లో చేసిన డిఫరెంట్ అటెంప్ట్ అని బాబీ గారు నాతో చెప్పడం హ్యాపీగా అనిపించింది. దిశా పటానీ చేసిన ఏంజెలీనా క్యారెక్టర్ లో అనేక షేడ్స్ ఉంటాయి. తన క్యారెక్టర్ మూవీకి స్పెషల్ అట్రాక్షన్ అవుతుంది. తనదైన ఎనర్జీని సినిమాకు తీసుకొచ్చింది దిశా పటానీ.
– ‘కంగువా’లో ఒక కొత్త ప్రపంచాన్ని ప్రేక్షకులకు చూపించాలని ప్రయత్నించాం. ఎందుకంటే ఇవాళ్టి ట్రెండ్ లో ప్రేక్షకులు స్క్రీన్ మీద కొత్త ప్రపంచాన్ని, నేపథ్యాన్ని చూసేందుకు ఇష్టపడుతున్నారు. అలాంటి మూవీస్ కు ఆదరణ దక్కుతోంది. ఫిలింమేకర్స్ కు ఏదైనా న్యూ అటెంప్ట్ చేసేందుకు ఇదే రైట్ టైమ్. నేను ‘కంగువా’ రూపొందించడంలో ఈ అంశమే ప్రోత్సాహాన్నిచ్చింది.
– దేవిశ్రీ ప్రసాద్ ఒక పవర్ హౌస్. అతనితో గతంలో వీరం అనే మూవీ చేశాను. ‘కంగువా’కు గొప్ప సౌండింగ్ ఇచ్చారు దేవి. మూవీ కోసం ఎంతైనా శ్రమిద్దాం అని దేవి నాతో చెప్పేవారు. ఆయన ఇచ్చిన సాంగ్స్, బీజీఎం ఈ మూవీకి ఎంతో ఆకర్షణ తీసుకొచ్చాయి. సినిమాటోగ్రాఫర్ వెట్రి నాతో చాలా కాలంగా ట్రావెల్ చేస్తున్నారు. ఈ మూవీకి అద్బుతమైన విజువల్స్ ఇచ్చారు.
– ప్రొడ్యూసర్ జ్ఞానవేల్ గారు ముందు నుంచీ ‘కంగువా’ ప్రాజెక్ట్ మీద చాలా నమ్మకంతో ఉన్నారు. కొంత షూట్ అయ్యాక రషెస్ చూపించాం. అది చూసి మీకు నచ్చినట్లు మూవీ చేయండి, ఎక్కడా కాంప్రమైజ్ కావొద్దని అన్నారు. అందుకు జ్ఞానవేల్ గారికి థ్యాంక్స్ చెబుతున్నా. ప్రొడక్షన్ లో ప్రెస్టీజియస్ బ్యానర్ యూవీ క్రియేషన్స్ భాగమవడం సంతోషంగా ఉంది. జ్ఞానవేల్ గారికి యూవీ సంస్థతో మంచి అనుబంధం ఉంది.
– కంగువా సినిమాలో ఒక సర్ ప్రైజింగ్ అతిథి పాత్ర ఉంటుంది. అది కంగువా సీక్వెల్ కు లీడ్ ఇస్తుంది. ఆ క్యారెక్టర్ ఎవరు చేశారనేది మీరు స్క్రీన్ మీద చూడాలి. తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రతి స్టార్ హీరోతో సినిమా చేయాలని ఉంది. నా దగ్గర ఇంట్రెస్టింగ్ స్క్రిప్ట్స్ ఉన్నాయి. అవకాశం వస్తే తప్పకుండా తెలుగు స్టార్స్ తో సినిమాలు చేస్తాను.