‘దొరకునా ఇటువంటి సేవ’ మూవీ పోస్టర్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. ఈ పోస్టర్ ఇంతలా అందరి దృష్టిని ఎందుకు ఆకర్షించిందంటే తెలుగు సినిమా ఖ్యాతిని పెంచిన ‘శంకరాభరణం’ సినిమాలోని ‘దొరకునా ఇటువంటి సేవ’ పాట ఎంత ప్రాచూర్యం పొందిందో అందరికి తెలిసిందే. అయితే ఆ పాటలోని మొదటి లైన్ తీసుకుని ఈ సినిమాకు టైటిల్ పెట్టారు. అయితే ఈ పోస్టర్ ఇంతలా వైరల్ అవ్వడానికి టైటిల్ ఒక్కటే కారణమా అంటే ఖచ్చితంగా కాదనే చెప్పాలి. ఎందుకంటే టైటిల్ మీద ‘ఇన్క్రెడిబుల్ రివేంజ్ ఇన్ దిస్’ అని క్యాప్షన్‌లో ‘DIS’ అక్షరాలను పెద్దగా డిజైన్ చేశారు. ముఖ్యంగా ‘I’లో అమ్మాయి షాడో, ముగ్గురు పురుషుల చూపుడు వేలును ఓ అమ్మాయి పట్టుకొని ఉండటం ప్రేక్షకుల దృష్టిని మరింత ఆకర్షించింది.
దేవి ఫిలిం ఫ్యాక్టరీ పతాకంపై రామచంద్ర రాగిపిండి దర్శకత్వంలో దేవ్ మహేశ్వరం ఈ సినిమాను నిర్మిస్తునారు. ఇటీవల నటుడు టి.ఎన్.ఆర్ ఈ సినిమా కాన్సెప్ట్ పోస్టర్ విడుదల చేశారు. ఈ సందర్భంగా చిత్రనిర్మాత దేవ్ మహేశ్వరం మాట్లాడుతూ ఈ సినిమా చిత్రీకరణ దాదాపు పూర్తయ్యిందని, పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా ఆల్మోస్ట్ పూర్తయ్యాయని చెప్పుకొచ్చారు. అయితే జనవరిలో ఈ సినిమాను విడుదల చేయాలని అనుకుంటున్నామని, టీజర్ విడుదలయ్యే వరకూ నటీనటులు ఎవరనేది సస్పెన్స్‌లో ఉంచామని తెలిపారు. అయితే ఈ సినిమాను కొత్త నటీనటులతో చేశామా లేక పాత వారితోనే చేశామా అనేది టీజర్ చూసి తెలుసుకోవాలని అన్నారు.
ఇక ఈ సినిమా రచయిత, దర్శకుడు రామచంద్ర రాగిపిండి మాట్లాడుతూ వివాహేతర సంబంధాలకు సంబంధించిన కథతో సస్పెన్స్ క్రైమ్ డ్రామాగా ఈ సినిమాను రూపొందించామని, ఇలాంటి నేపధ్యంలో కథను ఎంచుకోవడానికి కారణం ఏంటంటే ఇటీవల ఓ డేటింగ్ యాప్ చేసిన సర్వేలో ప్రతి పదిమందిలో ఏడుగురు వివాహేతర సంబంధాలపై ఆసక్తి చూపిస్తున్నారని తెలిసింది. ముఖ్యంగా ఆ ఏడుగురిలో పురుషుల కంటే మహిళలే ఎక్కువ శాతం ఉన్నారనే విషయం తెలిసి షాకయ్యానని అన్నారు. అయితే మరో సర్వేలో ప్రస్తుత సమాజంలో జరుగుతున్న నేరాల్లో అక్రమ సంబంధాల కారణంగా జరుగుతున్న నేరాలే మొదటి స్థానంలో ఉన్నాయని తేలిందని ‘ప్రియుడితో రెడ్ హ్యాండెడ్‌గా భర్తకు దొరికిన భార్య.. వాళ్ళిద్దరినీ చంపిన భర్త, ‘ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య’ వంటి ఘటనలు తరచూ వినిపిస్తూనే ఉన్నాయని, క్షణికానందం కోసం కట్టుకున్న వారిని హత మార్చడానికి సైతం కొందరు వెనుకాడటం లేదని అన్నారు. వివాహేతర సంబంధాలు పెట్టుకున్న మనుషుల వల్ల ఎటువంటి సంబంధం లేని వాళ్లు పడుతున్న సమస్యల అంశంతో మూడు కథల సంకలనం (యాంథాలజీ)గా నాన్ లీనియర్ స్క్రీన్‌ప్లేతో ఈ సినిమాను రూపొందించామని అన్నారు. ఇక ఈ సినిమాకి పీఆర్వోగా నాయుడు సురేంద్ర కుమార్, ఫణి కందుకూరి (బియాండ్ మీడియా), ఎడిటింగ్ ఛోటా కె. ప్రసాద్, కెమెరా రామ్ పండగల, మ్యూజిక్ సాయి కార్తీక్ అందిస్తున్నారు.