టాలీవుడ్ బాక్సాఫీస్ పరిస్థితి ప్రస్తుతం నిరాశగా కనిపిస్తుంది. మార్చి నెలలో పలు చిత్రాలు రిలీజ్ అయినా కూడా బాక్సాఫీస్ దగ్గర కేవలం ‘కోర్ట్’, ‘మ్యాడ్ స్క్వేర్’ రెండు సినిమాలే ప్రేక్షకులను అలరించి విజయాన్ని అందుకున్నాయి. మిగతా సినిమాలు పెద్దగా ప్రభావం చూపలేకపోయాయి.
ఏప్రిల్ నెలలో కూడా పెద్దగా చెప్పుకునే స్థాయి విజయాలు లేవు. ఏప్రిల్ తొలి వారం పెద్ద సినిమాలేమీ లేకపోవడంతో రెండో వారంలో నాలుగు సినిమాలు రిలీజ్ అయ్యాయి. జాక్, గుడ్ బ్యాడ్ అగ్లీ, జాట్, అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి చిత్రాలు ఏప్రిల్ రెండో వారం బాక్సాఫీస్ దగ్గర సందడి చేశాయి. మరి ఈ సినిమాల పరిస్థితి ఎలా ఉందో ఓసారి చూద్దామా.
జాక్ :
సిద్ధు జొన్నలగడ్డ, వైష్ణవి చైతన్య నటించిన యాక్షన్ డ్రామా మూవీ ‘జాక్’ ఏప్రిల్ 10న రిలీజ్ అయింది. బొమ్మరిల్లు భాస్కర్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాతో సిద్ధు ‘డీజే టిల్లు’ తరహా సక్సెస్ అందుకుంటాడని అందరూ అనుకున్నారు. కానీ, ఈ సినిమా ఇప్పటివరకు కేవలం రూ.2 కోట్లు మాత్రమే వసూలు చేసి బాక్సాఫీస్ దగ్గర ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది.
గుడ్ బ్యాడ్ అగ్లీ :
తమిళ హీరో అజిత్ కుమార్ నటించిన ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ ప్రొడ్యూస్ చేశారు. తమిళంలో సాలిడ్ వసూళ్లతో దుమ్ములేపుతున్న ఈ మూవీకి తెలుగులో పెద్ద ప్రమోషన్స్ లేకపోవడంతో, టాలీవుడ్ ప్రేక్షకులు ఈ సినిమా రిలీజ్ అయిన సంగతి కూడా తెలియలేదు. తమిళంలో రూ.100 కోట్ల బొమ్మగా నిలిచిన ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ టాలీవుడ్‌లో మాత్రం కనీస రెస్పాన్స్ తెచ్చుకోలేకపోయింది.
జాట్ :
టాలీవుడ్ దర్శకుడు గోపీచంద్ మలినేని డైరెక్షన్‌లో తెరకెక్కిన ‘జాట్’ చిత్రంలో బాలీవుడ్ యాక్షన్ హీరో సన్నీ డియోల్ నటించారు. ఈ సినిమా మిక్సిడ్ రెస్పాన్స్‌ను దక్కించుకోగా, బాక్సాఫీస్ దగ్గర 5 రోజుల్లో రూ. 58 కోట్ల మేర వసూళ్లు సాధించింది. అయితే, ఈ సినిమా టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర ఏమాత్రం ప్రభావం చూపలేదు. తెలుగు డబ్బింగ్ గురించి ఎలాంటి అనౌన్స్‌మెంట్ లేకపోవడంతో ఈ మూవీని తెలుగు ఆడియన్స్ పట్టించుకోలేదు.
అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి :
ప్రదీప్ మాచిరాజు, దీపిక పిల్లి జంటగా నటించిన ఈ చిత్రం ఏప్రిల్ 11న రిలీజ్ అయ్యింది. ఈ సినిమాలో ఎంటర్‌టైనింగ్ అంశాలు ఉన్నప్పటికీ, పెద్ద స్టార్స్ ఎవరూ లేకపోవడంతో ప్రేక్షకులు ఈ చిత్రాన్ని పట్టించుకోలేదు. బాక్సాఫీస్ దగ్గర ఈ సినిమా పెద్దగా గుర్తింపు లేకుండా మిగిలిపోయింది.
రాబోయే సినిమాలు.. బాక్సాఫీస్ దగ్గర మ్యాజిక్ చేస్తాయా..?
టాలీవుడ్‌లో ఈ వారం రెండు పెద్ద చిత్రాలు రిలీజ్‌కు రెడీ అయ్యాయి.
ఓదెల 2 :
స్టార్ బ్యూటీ తమన్నా భాటియా నటిస్తున్న ఈ సూపర్ న్యాచురల్ థ్రిల్లర్ మూవీని దర్శకుడు సంపత్ నంది ప్రొడ్యూస్ చేశారు. ఈ చిత్ర ట్రైలర్ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలను క్రియేట్ చేసింది. సినిమాలోని కంటెంట్ ప్రేక్షకులను ఆకట్టుకుంటే, ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర మంచి వసూళ్లు రాబట్టగలదు.
అర్జున్ S/O వైజయంతి :
నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా లేడీ సూపర్ స్టార్ విజయశాంతి కీలక పాత్రలో నటిస్తున్న ‘అర్జున్ S/O వైజయంతి’ ఎమోషనల్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కింది. ప్రదీప్ చిలుకూరి డైరెక్ట్ చేసిన ఈ సినిమా ట్రైలర్‌తో ప్రేక్షకుల్లో మంచి బజ్ క్రియేట్ చేసింది. ఇందులోని ఎమోషన్ ప్రేక్షకులకు కనెక్ట్ అయితే, ఈ సినిమా సాలిడ్ ఓపెనింగ్స్ అందుకోవడం ఖాయం.
మొత్తంగా చూస్తే, టాలీవుడ్ బాక్సాఫీస్ ఏప్రిల్ నెలను చాలా నెమ్మదిగా స్టార్ట్ చేసింది. ఇప్పటివరకు కోర్ట్, మ్యాడ్ స్క్వేర్ చిత్రాలు మాత్రమే ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. మిగతా ఏ సినిమా కూడా ప్రేక్షకుల నుంచి ఆదరణ పొందలేదు.
మరి ఈ వారం రిలీజ్ అవుతున్న ‘ఓదెల 2’, ‘అర్జున్ S/O వైజయంతి’ చిత్రాలు ప్రేక్షకులను ఆకట్టుకుని జనాలను థియేటర్లకు రప్పిస్తాయా అనేది చూడాలి. టాలీవుడ్ బాక్సాఫీస్‌కు ఈ సినిమాలైనా ఊపునిస్తాయా అనేది వేచి చూడాలి.