ప్రముఖ నిర్మాత నట్టికుమార్ కుమార్తె నట్టి కరుణ ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం దెయ్యంతో సహజీవనం. ఈ చిత్రానికి నట్టికుమార్ దర్శకత్వం వహించారు. నట్టీస్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై శ్రీమతి నట్టి లక్ష్మి సమర్పణలో నట్టి క్రాంతి ఐదు భాషల్లో నిర్మించిన ఈ చిత్రం విడుదలకు సన్నద్ధమవుతోంది. తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళం వంటి ఐదు బాషలలో ఈ చిత్రాన్ని జనవరి 28న థియేటర్లలో భారీగా విడుదల చేయనున్నట్లు దర్శకుడు నట్టి కుమార్, నిర్మాత నట్టి క్రాంతి తెలిపారు.
ఈ చిత్ర కధాంశం గురించి దర్శకుడు నట్టి కుమార్ మాట్లాడుతూ, “ఒక యథార్థ కథ ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందించాం. తనకు జరిగిన అన్యాయానికి ఒక ఆత్మ ఏ విధంగా ప్రతీకారం తీర్చుకుందనే దాన్ని హారర్ నేపథ్యంలో చాలా వినూత్నంగా చూపిస్తున్నాం. వైవిధ్యమైన స్క్రీన్ ప్లేతో అత్యద్భుతమైన గ్రాఫిక్స్ తో ఈ చిత్రాన్ని మలిచాం. అలానే సుపర్ణ మలాకర్ అనే బెంగాల్ అమ్మాయి ఇందులో సెకెండ్ హీరోయిన్ గా ఓ పవర్ ఫుల్ కాల్ గర్ల్ పాత్రలో నటించింది” అని అన్నారు.
హీరోయిన్ నట్టి కరుణ మాట్లాడుతూ, “లేడీ ఓరియెంటెడ్ చిత్రమిది. హీరోయిన్ గా పరిచయమవుతున్న నాకు తొలి చిత్రంలోనే విభిన్న కోణాలలో నటించే పాత్ర లభించింది. నటిగా నాకు పేరుతెచ్చే పాత్ర ఇది. అలాగే మా నాన్న డైరెక్షన్ లో హీరోయిన్ గా పరిచయం కావడం కూడా మరింత ఆనందంగా వుంది. అంచనాలకు తగ్గట్టు చిత్రం చాలా బాగా వచ్చింది” అని అన్నారు.
నట్టి కరుణ హీరోయిన్ గా ప్రధాన పాత్ర పోషించిన ఈ చిత్రంలో సుపర్ణ మలాకర్, బాబూమోహన్, హేమంత్, స్నిగ్ధ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రానికి సంగీతం రవిశంకర్, సినిమాటోగ్రాఫర్ వెంకట హనుమ నరిసెటి, ఎడిటర్ గౌతంరాజు, ఆర్ట్ కె.వి. రమణ, నిర్మాత నట్టి క్రాంతి, కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం నట్టికుమార్ లుగా వ్యవహరిస్తున్నారు.