విడుదల తేదీ : మార్చి 14, 2025
123తెలుగు.కామ్ రేటింగ్ : 2.5/5
నటీనటులు : కంగనా రనౌత్, అనుపమ్ ఖేర్, శ్రేయాస్ తల్పడే, విషాక్ నైర్, మిలింద్ సోమన్ తదితరులు
దర్శకుడు : కంగనా రనౌత్
నిర్మాణం : మణికర్ణికా ఫిల్మ్స్, జీ స్టూడియోస్
సంగీతం : జివి ప్రకాష్, సంచిత్ బళ్హరా, అంకిత్ బళ్హరా
ఛాయాగ్రహణం : టెట్సువో నాగతా
ఎడిటింగ్ : రామేశ్వర్ ఎస్ భగత్
సంబంధిత లింక్స్ : ట్రైలర్
బాలీవుడ్ స్టార్ అండ్ వివాదాల నటి కంగనా రనౌత్ ప్రధాన పాత్రలో అది కూడా తానే దర్శకత్వం వహించిన రీసెంట్ చిత్రమే “ఎమర్జెన్సీ”. భారత మహిళా ప్రధాని ఇందిరా గాంధీ 1975లో అమలు పరచిన ఎమర్జెన్సీ పై తెరకెక్కించిన ఈ సినిమా థియేటర్స్ లో రావడానికి చాలానే అడ్డంకులు ఎదుర్కొంది. మరి రీసెంట్ గానే నెట్ ఫ్లిక్స్ లో వచ్చిన ఈ చిత్రం ఎలా ఉందో సమీక్షలో చూద్దాం రండి.
కథ:
తన చిన్నతనం నుంచే కొంచెం నెమ్మదస్తురాలు అయిన ఇందిరా గాంధీ (కంగనా రనౌత్), తనకి చిన్న వయసు నుంచే ఎదురైన పలు అవమానాలు, తన కుటుంబం నుంచి కూడా ఎదురైన పలు సంఘటనలు నుంచి దేశానికి 1966 నుంచి ప్రధానిగా ఎలా మారారు? అక్కడ నుంచి తన పరిపాలన ఎలా జరిగింది? ఈ మధ్యలో తన కొడుకు సంజయ్ గాంధీ (విషాక్ నైర్) చేసిన అరాచకాలు ఏంటి? అవి ఆమెకి ఎలా ఎఫెక్ట్ అయ్యాయి. ఈ క్రమంలో అలహాబాద్ లో జరిగిన ఎన్నికల్లో ఇందిరా గాంధీపై వచ్చిన ఆరోపణలు ఏంటి? ఆమెని ప్రధాని హోదా నుంచి తప్పించే యత్నంలో ఎందుకు ఇందిరా గాంధీ 1975 జూన్ 25 న దేశ వ్యాప్తంగా ఎమర్జెన్సీ పెట్టారు? ఇది ఎటు దారి తీసింది? చివరికి ఇందిరా గాంధీ మరణం ఎలా అయ్యింది అనేవి తెలియాలి అంటే ఈ చిత్రాన్ని చూడాల్సిందే.
ప్లస్ పాయింట్స్:
ఈ చిత్రంలో ప్రధాన బలం కంగనా రనౌత్ అని చెప్పవచ్చు. ఒక నటిగా మాత్రమే కాకుండా దర్శకురాలిగా కూడా తనలోని పటిమ చూపించారు. మెయిన్ గా ఇందిరాఅ గాంధీ పాత్రలో అయితే కంగనా అలా పరకాయ ప్రవేశం చేసినట్టు అనిపిస్తుంది. కంగనా కెరీర్లోనే ఈ సినిమాలో తన నటన ఒక బెస్ట్ పెర్ఫామెన్స్ అని కూడా చెప్పవచ్చు. ఇందిరా గాంధీ మాట తీరు, నడవడిక అలాగే కొన్ని హావభావాలని కంగనా పండించిన తీరు అద్భుతం అని చెప్పడంలో సందేహం లేదు.
అలాగే ఈ చిత్రంలో సాలిడ్ స్కోర్ తో పలు సన్నివేశాలు మంచి ఇంట్రెస్టింగ్ గా సాగుతాయి. అలాగే మన చరిత్రలో జరిగిన కొన్ని సంఘటలు అయితే కళ్ళకి కట్టినట్టుగా చాలా నాచురల్ గా చూపించడం ఎగ్జైట్ చేస్తుంది. మరికొన్ని సీన్స్ అయితే హార్డ్ హిట్టింగ్ గా కూడా అనిపించక మానవు. ఇక కంగనాతో పాటుగా నటుడు అనుపమ్ ఖేర్ మంచి పాత్రలో కనిపించారు.
అలాగే కంగనా కొడుకు పాత్రలో నటించిన విషాక్ నైర్ మంచి నెగిటివ్ పాత్రలో నాచురల్ గా చేసేసాడు. ఇంకా వీరితో పాటుగా నటి మహిమా చౌదరి, మిలింద్ సోమన్, ఇంకా సతీష్ కౌశిక్ తదితరులు బాగా చేశారు. ఇక వీరితో పాటుగా అటల్ బిహారి వాజ్ పాయి నటుడు శ్రేయాస్ తల్పడే మంచి నటన కనబరిచాడు. అలాగే సినిమాలో ఇందిరా గాంధీపై కొన్ని సన్నివేశాలు టచ్చింగ్ గా ఉంటాయి.
మైనస్ పాయింట్స్:
అసలు ఈ చిత్రానికి పెట్టిన టైటిల్ కి సినిమాలో కనిపించే మొత్తం కథనంకి సంబంధం ఉండదని చెప్పాలి. ఎందుకంటే భారతదేశ చరిత్రలో మొత్తం మూడు సార్లు ఎమర్జెన్సీలు వస్తే వీటిలో ఇందిరా గాంధీ సమయంలో అమలు చేసిన అత్యవసర పరిస్థితులు ఒక చారిత్రాత్మకంగా నిలిచింది.
అయితే ఈ సున్నిత అంశంపైనే అప్పుడు జరిగిన పలు కీలక ఘట్టాలపై ఫుల్ ఫ్లెడ్జ్ సినిమా తీసే స్కోప్ ఉంది కానీ కంగనా మాత్రం ఆ టైం పీరియడ్ లైన్ ని తీసుకొని ఇందిరా గాంధీ బయోపిక్ ని చూపించడం జరిగింది. దీనితో అసలు మెయిన్ గా ప్రమోట్ చేసింది ఏంటి సినిమాలో చూపించిన అంశాలు ఏంటి అనేవి కేవలం ఎమర్జెన్సీ కోసం చూద్దాం అనుకునేవారికి నచ్చకపోవచ్చు.
మొత్తం రెండు గంటల 20 నిమిషాల మేర సినిమాలో ఎమర్జెన్సీ ఎపిసోడ్ ని అరగంటలోనే తేల్చేసినట్టుగా అనిపిస్తుంది. ఇక వీటితో పాటుగా కథనం అక్కడక్కడా కొంచెం స్లోగా సాగుతున్నట్టుగా అనిపిస్తుంది. వీటితో కొంచెం బోర్ అనిపించవచ్చు. కొన్ని మూమెంట్స్ ఎంత ఇంట్రెస్టింగ్ గా సాగుతాయో అంతే రీతిలో కొన్ని సీన్స్ డల్ గా అనిపిస్తాయి. అలాగే ఎమర్జెన్సీ టైంలో చేసిన పలు అంశాలు ఇంకొంచెం డీటెయిల్డ్ గా చూపించాల్సింది.
ఇంకా అటల్ బిహారి వాజ్ పాయి పాత్రలో మరో నటుణ్ని కంగనా ఆలోచించాల్సింది. మిగతా నటీనటులు ఆయా పాత్రలకి సూట్ అయ్యారు కానీ అటల్ రోల్ లో మాత్రం శ్రేయాస్ తల్పడే అంతగా సెట్ అయ్యినట్టు అనిపించడు. అలాగే కంగనా మేకప్ పై కూడా జాగ్రత్తలు తీసుకోవాల్సింది. ఏజ్ అయ్యే కొద్దీ తన జుట్టు తెల్లబడుతుంది కానీ ముఖంలో మాత్రం అదే యంగ్ షేడ్స్ కనిపిస్తాయి.
సాంకేతిక వర్గం:
ఈ సినిమాలో నిర్మాణ విలువలు మాత్రం బావున్నాయి. మేకర్స్ సాలిడ్ బడ్జెట్ ని పెడితే టెక్నికల్ టీం కూడా మంచి విజువల్స్ ని అందించారు. అలాగే కంగనాని ఇందిరగా మార్చిన ప్రొస్థెటిక్ మేకప్ చాలా నాచురల్ గా అనిపిస్తుంది. ఇంకా సంగీతం కూడా చాల సీన్స్ లో సాలిడ్ గా వర్క్ అయ్యింది. సినిమాటోగ్రఫీ కూడా బాగుంది. ఇక వీటితో పాటుగా ఎడిటింగ్ ఇంకొంచెం బెటర్ గా చేయాల్సింది.
ఇక దర్శకురాలు కంగనా విషయానికి వస్తే.. ఆమె డైరెక్షన్ అండ్ విజన్ బాగానే ఉన్నాయి కానీ కథనం మాత్రం మరీ అంత ఆకట్టుకునే రేంజ్ లో ప్లాన్ చేసుకోలేదు. టైటిల్ కి మాత్రం సినిమాలో న్యాయం జరగలేదనే చెప్పవచ్చు. కనీసం ఇందిరా బయోపిక్ లా అయినా అనౌన్స్ చేసి ఉంటే దానికి జస్టిఫికేషన్ గా ఈ సినిమా అనిపించేది.
తీర్పు:
ఇక మొత్తంగా చూసినట్టు అయితే ఈ “ఎమర్జెన్సీ” చిత్రంలో కంగనా మాత్రం షైన్ అయ్యింది. ఇందిరా పాత్రలో ఆమె ఒదిగిపోయింది అని చెప్పవచ్చు. దర్శకత్వం పరంగా కొన్ని అంశాల్లో పర్వాలేదు కానీ కొన్ని లోపాలు కథనంలో ఉన్నాయి. సో వీటితో ఈ వీకెండ్ లో ఓసారి ట్రై చేయాలి అనుకునేవారు నెట్ ఫ్లిక్స్ లో 1.25 ఎక్స్ స్పీడ్ లో పెట్టుకొని ట్రై చేయవచ్చు.
123telugu.com Rating: 2.5/5
Reviewed by 123telugu Team