బేబీ డమరి సమర్పణలో శ్రీపద్మాయల ఎంటర్‌టైన్‌మెంట్స్ మరియు శ్రీ సుమన్ వెంకటాద్రి ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న “ఎర్రచీర – ది బిగినింగ్” చిత్రం ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతోంది. ఈ సినిమాలో ప్రముఖ నటుడు రాజేంద్రప్రసాద్ మనవరాలు బేబీ సాయి తేజస్విని నటిస్తుండగా, దర్శకుడు సుమన్ బాబు స్వీయ దర్శకత్వంలో ఒక కీలక పాత్రలో కనిపించనున్నారు. మదర్ సెంటిమెంట్, హారర్, యాక్షన్ అంశాలతో కూడిన ఈ చిత్రం మొదట శివరాత్రి కానుకగా విడుదల కావాల్సి ఉంది. అయితే, సాంకేతిక కారణాల వల్ల రిలీజ్ వాయిదా పడింది. ఇప్పుడు వేసవి సీజన్‌లో ఏప్రిల్ 25న ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి చిత్ర బృందం సన్నాహాలు చేస్తోంది.
ఈ సందర్భంగా నిర్మాతలలో ఒకరైన ఎన్‌వివి సుబ్బారెడ్డి మాట్లాడుతూ.. ‘ఈ చిత్రంలో క్లైమాక్స్ ఎపిసోడ్, అనేకమంది అఘోరాలతో శివుడిని అత్యద్భుతంగా చూపిస్తూ షూట్ చేసిన సీక్వెన్స్ అద్భుతంగా వచ్చిందని, కుటుంబం అంతా పిల్లలతో సహా చూసి ఆనందించదగ్గ సినిమా’ అని అన్నారు.
దర్శకుడు సుమన్ బాబు మాట్లాడుతూ.. ‘ఈ సినిమాలో 45 నిమిషాల పాటు ఉండే గ్రాఫిక్స్ చాలా హైలైట్ గా నిలుస్తాయి. సినిమా చూసిన వారందరూ అద్భుతంగా ఉందని కొనియాడారు. రిలీజ్ ఆలస్యం అయినా, కంటెంట్ మాత్రం ఖతర్నాక్‌గా ఉందని అందరూ అంటున్నారు. ప్రేక్షకులకు ఈ చిత్రం ఒక అద్భుతమైన అనుభవాన్ని అందిస్తుందని నమ్ముతున్నాం’ అని అన్నారు.