సమీక్ష : ఎవ్వరికీ చెప్పొద్దు – అక్కడక్కడా ఆకట్టుకునే క్యాస్ట్ లవ్ స్టోరీ

సమీక్ష : ఎవ్వరికీ చెప్పొద్దు – అక్కడక్కడా ఆకట్టుకునే క్యాస్ట్ లవ్ స్టోరీ

Published on Oct 9, 2019 2:55 AM IST
Evvarikee Cheppoddu movie review

విడుదల తేదీ : అక్టోబర్ 05, 2019

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.75/5

నటీనటులు : రాకేశ్‌ వర్రే, గార్గేయి యల్లాప్రగడ తదితరులు.

దర్శకత్వం : బ‌స‌వ శంక‌ర్‌

నిర్మాత‌లు : రాకేశ్ వ‌ర్రె

సంగీతం : శంక‌ర్ శ‌ర్మ‌

సినిమాటోగ్రఫర్ : బ‌స‌వ శంక‌ర్‌, తేజ యర్రంశెట్టి, స‌త్య‌జిత్ సుగ్గు

‘బాహుబలి 2’లో సేతుపతిగా నటించిన రాకేష్ వర్రే హీరోగా నటించిన తాజా చిత్రం ‘ఎవరికీ చెప్పొద్దు’. బసవ శంకర్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో రాకేశ్‌ వర్రే సరసన గార్గేయి యల్లాప్రగడ హీరోయిన్ గా నటించింది. కాగా ఈ చిత్రం ఈ రోజు విడుదల అయింది. మరి ఈ చిత్రం, ఆడియన్స్‌ను ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం.

 

కథ :

 

హరి (రాకేష్ వర్రే) హారతి (గార్గేయి యల్లాప్రగడ)తో ప్రేమలో పడతాడు. హారతి కూడా హరిని ప్రేమిస్తోంది. అయితే తన తండ్రికున్న క్యాస్ట్ పిచ్చి గుర్తు వచ్చి.. హరిది వేరే క్యాస్ట్ అని ఆ ప్రేమను హరి మీద ఎక్స్ ప్రెస్ చేయదు. ఈ క్రమంలో జరిగే కొన్ని నాటకీయ సంఘటనలు అనంతరం హరికి, హారతి ఇంకా బాగా నచ్చేస్తోంది, అలాగే హారతికి కూడా హరి అంతే నచ్చుతాడు. కానీ తన కుటుంబ పరిస్థితుల రీత్యా తాము ఇద్దరం కలవడం అసాధ్యం అని భావించిన హారతి, హరికి దూరంగా.. తన గురించి ఏ డిటైల్స్ తెలియకుండా హరిని వదిలి వెళ్ళిపోతుంది. దాంతో హరి హారతి కోసం ఏమి చేశాడు ? ఆమెను పెళ్లి చేసుకోవడానికి హరి ఆడిన నాటకాలు ఏమిటి ? ఈ క్రమంలో అతను ఎదుర్కొన్న పరిణామాలు ఏమిటి? అసలు హారతి తండ్రిని వాళ్ళ కుంటుంబ సభ్యులను హరి ఎలా మ్యానేజ్ చేశాడు ? చివరికీ హరి హారతిని పెళ్లి చేసుకున్నాడా ? లేదా ? లాంటి విషయాలు తెలుసుకోవాలంటే ఈ చిత్రాన్ని వెండితెర పై చూడాల్సిందే.

 

ప్లస్ పాయింట్స్ :

 

సినిమాలో స్టోరీ పాయింట్ చాలా బాగుంది. అలాగే ఆ పాయింట్ నే లవ్ స్టోరీకి మెయిన్ సమస్యగా పెట్టుకుని దర్శకుడు రాసుకున్న లవ్ సీన్స్ ఆకట్టుకుంటాయి. ముఖ్యంగా హీరోయిన్ క్యారెక్టరైజేషన్ సినిమాకే ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. ఇక హీరోగా నటించిన రాకేశ్‌ వర్రే పాత్రకు తగ్గట్లు లుక్స్ అండ్ నటన పరంగా కూడా ఆకట్టుకున్నాడు. ముఖ్యంగా హీరోయిన్ తో సాగే ప్రేమ సన్నివేశాల్లో, ఆలాగే ప్రీ క్లైమాక్స్ లో మరియు కొన్ని కీలక సీన్స్ లో రాకేశ్ ఎంతో అనుభవం ఉన్న నటుడిలా బాగా నటించాడు.

ఇక హీరోయిన్ గా నటించిన గార్గేయి యల్లాప్రగడ నటన సినిమాకే హైలెట్ గా నిలుస్తోంది. తన క్యూట్ ఎక్స్ ప్రెషన్స్ తో బాగా నటించడంతో పాటు అందంగా కనిపిస్తూ ఆకట్టుకుంది. హీరోయిన్ కి తండ్రిగా నటించిన నటుడు, హీరో ఫ్రెండ్స్ గా నటించిన నటులు… అదేవిధంగా మిగిలిన నటీనటులు కూడా తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు. సమాజంలో ఇంకా కొన్ని ప్రాంతాల్లో కొన్ని వర్గాల్లో క్యాస్ట్ అనే అంశం ఎంత బలంగా ప్రభావితం చేస్తోంది అనే విషయాన్ని దర్శకుడు చాల చక్కగా చూపించాడు. ముఖ్యంగా హీరోయిన్ ఫాదర్ కి సంబంధించిన సన్నివేశాలు మరియు ప్రీ క్లైమాక్స్ అలాగే క్లైమాక్స్ లో హీరోయిన్ డైలాగ్స్ బాగున్నాయి.

 

మైనస్ పాయింట్స్ :

 

సినిమాలో స్టోరీ పాయింట్ బాగా ఆకట్టుకున్నా.. స్క్రీన్ ప్లే పరంగా మాత్రం సినిమా పూర్తి స్థాయిలో ఆకట్టుకునే విధంగా సాగలేదు. ఫస్ట్ హాఫ్ సరదాగా సాగుతూ పర్వాలేదనిపించినప్పటికీ.. సినిమాలో బలమైన కాన్ ఫిల్ట్ మిస్ అయింది. పైగా ఫస్ట్ హాఫ్ మొత్తం హీరోహీరోయిన్లు మధ్య లవ్ సీన్స్ ను అనవసరంగా సాగతీశారు. హీరోయిన్ ప్రేమలో పడింది, కానీ తన కుంటుంబ పరిస్థుతుల రీత్యా ఆ ప్రేమను అంగీకరించలేని స్థితిలో ఆమె ఉందని చెప్పడానికి అన్ని సీన్స్ అవసరమా అనిపిస్తోంది.

సెకండ్ హాఫ్ లో కూడా కొన్ని సీన్స్ స్లోగా సాగుతాయి. దీనికి తోడు కొన్ని సన్నివేశాల్లో నాటకీయత ఎక్కువడంతో కథలో సహజత్వం లోపించింది. హీరో క్యాస్ట్ పేరుతో యాప్ తయారుచేయడం, దాన్ని నమ్మి ఆ క్యాస్ట్ వాళ్ళంతా అతనికి పెళ్లి సంబధాలను తేవడం, అయినా అంతగా క్యాస్ట్ పిచ్చి ఉన్న హీరోయిన్ ఫాదర్ హీరోని అంత ఈజీగా ఎలా నమ్మాడు. పైగా ఆ సన్నివేశాలు కూడా లాజిక్ లేకుండా సాగుతాయి. అయితే ఆ సన్నివేశాల్లో దర్శకుడు మంచి హ్యూమర్ ను పండించాడు.

మొత్తానికి దర్శకుడు తానూ అనుకున్న కంటెంట్ ను స్క్రీన్ మీద బాగానే ఎలివేట్ చేసినా.. కొన్ని చోట్ల నిరాశ పరుస్తాడు. కంటెంట్ పరంగా ఇంకా మంచి భావోద్వేగాన్ని పండించే సన్నివేశాలు రాసుకునే అవకాశం ఉన్నా, దర్శకుడు మాత్రం సినిమాను సింపుల్ గా ముగించడం అంతగా రుచించదు.

 

సాంకేతిక విభాగం :

 

ముందుగా చెప్పుకున్నట్లుగానే దర్శకుడు బసవ శంకర్ క్యాస్ట్ కి సంబంధించి మంచి కాన్సెప్ట్ ని తీసుకున్నారు. అయితే ఆ కాన్సెప్ట్ ని తెర మీద చూపెట్టడంలో కొంత తడబాటు పడ్డాడు. అయినప్పటికీ కొన్ని లవ్ సీక్వెన్స్ లో మరియు క్లైమాక్స్ అండ్ కొన్ని కీలక సన్నివేశాలతో పర్వాలేదనిపిస్తాడు. విజ‌య్ జె.ఆనంద్‌ కెమెరా పనితనం మాత్రం ఇంప్రెస్ అయ్యేలా ఉంది. ఆయన తీసిన విజువల్స్, కొన్ని షాట్స్ చాలా బాగున్నాయి. ఇక సంగీత దర్శకుడు శంకర్ శర్మ అందించిన సంగీతం బాగుంది. కొన్ని ఎమోషనల్ సన్నివేశాల్లో నేపధ్య సంగీతం బాగా ఆకట్టుకుంది. ఎడిటర్స్ గా పనిచేసిన బ‌స‌వ శంక‌ర్‌, తేజ యర్రంశెట్టి, స‌త్య‌జిత్ సుగ్గు పనితనం కూడా ఆకట్టుకుంది. రాకేశ్ వ‌ర్రె నిర్మాణ విలువులు కూడా బాగున్నాయి.
తీర్పు :

 

‘ఎవరికీ చెప్పొద్దు’అంటూ క్యూట్ లవ్ స్టోరీగా వచ్చిన ఈ చిత్రం కాన్సెప్ట్ పరంగా అలాగే కొన్ని కామెడీ సన్నివేశల పరంగా మరియు క్లైమాక్స్ అలాగే కొన్నిచోట్ల డైలాగ్స్ అండ్ ఎమోషనల్ సీన్స్ తో సినిమా అక్కడక్కడా బాగానే ఆకట్టుకుంటుంది. కాకపోతే సినిమా మాత్రం పూర్తి స్థాయిలో ఆసక్తికరంగా సాగదు. కథనం సింపుల్ గా ఉండటం, సినిమాలో కొన్ని కీలకమైన సీన్స్ కు సరైన లాజిక్స్ లేకపోవడం, అన్నిటికి మించి సినిమాలో బలమైన సంఘర్షణ మిస్ అవ్వడం, కీలక సన్నివేశాల్లో నాటకీయత ఎక్కువడం వంటి అంశాలు సినిమాకి బలహీనుతలుగా నిలుస్తాయి. అయితే హీరోహీరోయిన్స్ మధ్య వచ్చే లవ్ సీన్స్, అలాగే రాకేశ్‌ వర్రే, గార్గేయి యల్లాప్రగడ నటన సినిమాకే హైలెట్ గా నిలుస్తాయి. మరి ఈ చిత్రం దసరా పోటీలో ఎంతవరకు నిలుస్తోందో చూడాలి.

123telugu.com Rating : 2.75/5

Reviewed by 123telugu Team

Click Here For English Review

సంబంధిత సమాచారం

తాజా వార్తలు