‘బాణం’ సినిమాతో నటుడిగా గుర్తింపు తెచ్చుకొని ‘సోలో’ సినిమాతో కమర్షియల్ హిట్ అందుకున్న హీరో నారా రోహిత్. అందరూ కమర్షియల్ వైపు అడుగులేస్తున్న తరుణంలో ప్రజల్లో ఒక ఆలోచన కలిగించాలనే ఉద్దేశంతో తీసిన సినిమా ‘ప్రతినిధి’. ఈ శుక్రవారం ‘ప్రతినిధి’ తెలుగు ప్రేక్షకుల ముందుకు రానున్న సందర్భంగా మేము నారా రోహిత్ తో కాసేపు ప్రత్యేకంగా ముచ్చటించాము. చాలా కూల్ గా మాట్లాడిన నారా రోహిత్ ‘ప్రతినిధి’ సినిమా గురించి, తన రాబోయే సినిమాల గురించి, అలాగే రానున్న ఎలక్షన్స్ పై తనకున్న అభిప్రాయాన్ని మాతో పంచుకున్నాడు. ఆ విశేషాలు మీ కోసం..
ప్రశ్న) ‘ప్రతినిధి’ సినిమా అనేది ఎలా మొదలైంది? అలాగే ఈ ప్రతినిధి ఎలా ఉండబోతుంది?
స) ఒక సంవత్సరం క్రితం ఆనంద్ రవి ఈ కథని నాకు చెప్పాడు. నాకు బాగా నచ్చి ఈ సినిమా చేద్దాం అని అనుకున్నాక ఎవరు డైరెక్ట్ చేస్తే బాగుంటుంది అని అనుకుంటుంటే ఆనంద్ రవినే ప్రశాంత్ మండవని సజెస్ట్ చేసాడు. ఆతను అప్పటికే నా ‘శంకర’ సినిమాకి అసోసియేట్ గా పని చేయడంతో పరిచయం ఉంది. అతని వర్క్ చూసాను కాబట్టి ఈ సినిమాకి న్యాయం చేయగలడని డైరెక్టర్ గా అతన్ని ఎంచుకున్నాం. అలా ఈ సినిమా మొదలైంది. ఒక కామన్ మాన్ కోసం నిలబడేవాడే ఈ ప్రతినిధి. ఒక కామన్ మాన్ కి సిస్టం మీద కోపం వస్తే ఎలా ఉంటది అనేదే ఈ ప్రతినిధి.
ప్రశ్న) ఈ సినిమాలో మీ పాత్ర గురించి చెప్పండి?
స) ‘ప్రతినిధి’లో నా పాత్ర అందరికీ కనెక్ట్ అయ్యేలా, మనలో ఒక్కడు అనుకునేలా ఉంటుంది. ఈ సినిమాకి ప్రతినిధి అనేది ఎందుకు పెట్టామంటే నా పాత్ర ఒక కామన్ మాన్ కి రెప్రజెంటేటివ్ గా ఉంటుంది. అందుకే ‘ప్రతినిధి’ అనే టైటిల్ ని సెలక్ట్ చేసుకున్నాం..
ప్రశ్న) ప్రశాంత్ మండవకి డైరెక్టర్ గా ఇది మొదటి సినిమా.. ఇలాంటి సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉన్న సినిమాకి అతన్ని డైరెక్టర్ గా ఎంచుకోవడం రిస్క్ అనిపించలేదా?
స) రిస్క్ ఏమీ అనిపించలేదండి. ఎందుకంటే కథ విన్నప్పుడే నాకు కనెక్ట్ అవుతుంది అనిపించింది. ముఖ్యంగా ట్రైలర్ లో ‘నా 84 పైసలు నాకిస్తే నేను సిఎంని వదిలేస్తాను’ ఒక డైలాగ్ ఉంటది. నేను పెట్రోల్ బంకుకి వెళ్ళినప్పుడు నేనూ ఆ డబ్బులు అడగను, వాళ్ళు ఇవ్వరు. చూడటానికి చిన్న పాయింట్ కానీ మనిషిని ఆలోజింపజేస్తుంది. కానీ ఈ డైలాగ్ అందరికీ ఈజీగా కనెక్ట్ అవుతుంది. సో ఇలాంటి పాయింట్స్ చాలా ఉంటాయి. వాటన్నిటినీ ప్రశాంత్ బాగా డీల్ చేసాడు. ఓవరాల్ గా ఫైనల్ అవుట్ పుట్ చూసాక లోకేషన్స్, బడ్జెట్ లాంటి విషయాల వల్ల టేకింగ్ లో ఎక్కడన్నా చిన్న చిన్న లోపాలు కనపడచ్చేమో గానీ అనుకున్న కాన్సెప్ట్ ని అయితే మాత్రం ప్రశాంత్ పక్కాగా స్క్రీన్ పైకి ట్రాన్సఫర్ చేసాడు.
ప్రశ్న) హీరోయిన్ శుభ్ర అయ్యప్ప మరియు ఈ మూవీలో నటించిన యంగ్ హీరో విష్ణు పాత్ర గురించి చెప్పండి?
స) శుభ్ర అయ్యప్ప ఇందులో ఒక జరనలిస్ట్ పాత్రలో కనిపిస్తుంది. ఆ పాత్రకి సినిమాలో చాలా ప్రాధాన్యత ఉన్న పాత్ర. ఇక విష్ణు హీరోగా చేస్తూ కూడా ఇలాంటి పాత్ర చేసినందుకు థాంక్స్ చెప్పాలి అలాగే విష్ణు చేసింది చిన్న పాత్రే అయినా తనకి మంచి పేరు తెస్తుంది. ప్రస్తుతానికి తన పాత్ర గురించి ఇంతకన్నా ఏమీ చెప్పలేను.
ప్రశ్న) మీ పరంగా ఈ సినిమా సక్సెస్ కావడానికి ప్రధాన హైలైట్స్ ఏమవుతాయని అనుకుంటున్నారు?
స) ఈ సినిమాకి మెయిన్ హైలైట్ స్క్రిప్ట్ మరియు డైలాగ్స్. వీటితో పాటు సాయి కార్తీక్ రీ రికార్డింగ్ కూడా హైలైట్ అవుతుంది. మేము తీసిన సీన్స్ ని తన రీ రికార్డింగ్ తో మరో స్థాయికి తీసుకెళ్ళాడు. ఇవే ఈ సినిమా విజయంలో కీ రోల్ పోషిస్తాయని ఆశిస్తున్నాను.
ప్రశ్న) మీ కెరీర్లో చాలా తక్కువ రొజుల్లో చేసిన సినిమా ఇది. తక్కువ రోజుల్లో చేయడం వల్ల సినిమా అవుట్ పుట్ విషయంలో మీరేమన్నా నిరుత్సాహపడ్డారా?
స) అవును 40 రోజుల్లో ఈ సినిమా పూర్తి చేసాం. సినిమా పరంగా యితే అనుకున్న కాన్సెప్ట్ ని పక్కాగా తీసాం అని కాన్ఫిడెంట్ ఉన్నాం. కాబట్టి నిరుత్సాహం ఏమీ లేదు. ఒక నటుడిగా అయితే ప్రతి సినిమాలోనూ ఇంకా బెటర్ గా చెయ్యాలనే ఫీలవుతాను. ఉదాహరణకి బాణం ఇప్పుడు చూసిన ఈ సీన్ ఇంకా బెటర్ గా చేసుంటే బాగుండేది అని ఫీలవుతాను. ఒక నటుడికి అది ఎప్పుడూ ఉంటుంది.
ప్రశ్న) త్వరలో ఎలక్షన్స్ రానున్నాయి.. ఈ సినిమాలో పొలిటికల్ టచ్ ఉన్నట్టు తెలుస్తోంది. ప్రతినిధిలో పొలిటికల్ సెటైర్స్ ఏమన్నా ఉన్నాయా?
స) ప్రతినిధి సినిమా ఏ ఒక్క పార్టీని ఎంకరేజ్ చేసేలా ఉండదు, అలాగే ఏ ఒక్క పార్టీని తిట్టేలా ఉండదు. ఇందులో ఒక కామన్ మాన్ సిస్టం ని ప్రశ్నిస్తాడే తప్ప ఒక గవర్నమెంట్ ని కానీ, ఒక పార్టీని కానీ ప్రశ్నించడు. కావున పొలిటికల్ సెటైర్స్ అనేవి పెద్దగా ఉండవు.
ప్రశ్న) ఈ సినిమా కోసం బాగా లావు అయినట్టు ఉన్నారు?
స) ఈ సినిమా కోసం ఏమీ లావు కాలేదండి. ఈ సినిమా టైంలో నాకొక యాక్సిడెంట్ జరిగింది. కానీ నా డేట్స్ అన్నీ ఇచ్చేసి ఉండడం వల్ల మెడిసిన్స్ తీసుకుంటూనే సినిమాకి వర్క్ చేసాను అందుకే లావుగా కనిపిస్తాను. నా రైట్ హ్యాండ్ కి దెబ్బ తగలడం వల్ల ఈ సినిమాలో నేను ఎక్కువగా లెఫ్ట్ హ్యాండ్ వాడుతూ కనిపిస్తాను.
ప్రశ్న) అందరూ కమర్షియల్ ఎంటర్టైనర్స్ వైపు మొగ్గు చూపుతుంటే మీరు మాత్రం కెరీర్ మొదట్లోనే ఇలాంటి సినిమాల వైపు ఎందుకు మొగ్గు చూపుతున్నారు?
స) పైన చెప్పినట్టు కథ విన్నప్పుడు కొన్ని ఎలిమెంట్స్ నాకు బాగా నచ్చాయి, అవి ఆడియన్స్ కి కూడా కనెక్ట్ అవుతాయనే ఈ సినిమా చేసాను. ఇక కమర్షియల్ ఎంటర్టైనర్స్ అంటారా.. ఇక నా రాబోయే సినిమాలన్నీ కమర్షియల్ ఎంటర్టైనర్స్. ఎప్పుడూ కమర్షియల్ సినిమాలే కాకుండా ఇలాంటివి కూడా చెయ్యాలనేదే నా ఉద్దేశం.
ప్రశ్న) ఎప్పుడో రిలీజ్ కావాల్సిన ఈ సినిమా ఇంత ఆలస్యంగా రిలీజ్ కావడానికి కారణం ఏంటి?
స) ఎప్పుడో రిలీజ్ అనుకున్నాం కానీ నిర్మాతల సైడ్ నుంచి, ఫైనాన్షియల్ గా ఇబ్బందులు ఉండడం వల్ల ఆలస్యంగా రిలీజ్ అవుతోంది. కానీ నాకు మాత్రం సినిమా రావాల్సిన టైంలోనే వస్తుందని అనుకుంటాను. ఎందుకంటే ఇలాంటి సబ్జెక్ట్ ఈ టైంలోనే ఎక్కువగా ఆడియన్స్ చేరువవుతుందని నమ్ముతున్నాను.
ప్రశ్న) 25వ తీదీ నుంచి టిడిపి తరపున సీమాంధ్రలో ప్రచారం చేయబోతున్నారనే వార్తలపై మీ కామెంట్?
స) ఈ నెల 25, 26, 27 తేదీల్లో అన్ని చోట్లా ప్రతినిధి ప్రమోషన్స్ చేస్తున్నాను. అది పార్టీ ప్రచారం కాదు. ప్రతినిధి ప్రమోషన్స్ అయిపోయిన తర్వాత టిడిపి తరపున సీమాంధ్రలో ప్రచారం చేస్తాను. దాని వివరాలు త్వరలోనే చెప్తాను. టిడిపి తరపున ప్రచారం చేయడం అనేది మా బాధ్యతా కదండీ..
ప్రశ్న) రానున్న ఎన్నికల్లో టిడిపి భవిష్యత్తు ఎలా ఉండబోతుందని అనుకుంటున్నారు? ఓటు వేయబోయే ప్రజలకి మీరు చెప్పే మాటేమిటి?
స) ఈ సారి టిడిపికి బాగుంటుందని అనుకుంటున్నాను. నాకు తెలిసి ఇప్పుడున్న నాయకుల్లో కొత్త రాజధానిని నిర్మించగల కెపాసిటీ పెదనాన్న(నారా చంద్రబాబు నాయుడు)కే ఉందని అనుకుంటున్నాను. ఎందుకంటే ఆయన హైదరాబాద్ ని ఎంత డెవలప్ చేసారనేది ప్రజలు ప్రత్యక్షంగా చూసారు. సీమాంధ్ర ప్రజలు కూడా 10 సంవత్సరాలు ముందుకెళ్లాలి అంటే ఆయనే కావాలని అనుకుంటున్నారు. బెస్ట్ రావాలని మేము ప్రయత్నిస్తున్నాం, బెస్ట్ రిజల్ట్ వస్తుందని ఆశిస్తున్నాం. కచ్చితంగా అందరూ ఓటు వేయాలి. బెటర్ సొసైటీ కోసం ఆలోచించి ఓటు వేసి మంచి నాయకున్ని ఎన్నుకోండి.
ప్రశ్న) మీ పెదనాన్న చంద్రబాబు నాయుడు గారు మీకు ఫ్యామిలీ నుంచి ఎలా సపోర్ట్ ఇస్తారో, అదేవిధంగా మీకు ఒక హీరోగా నందమూరి ఫ్యామిలీ నుంచి సపోర్ట్ ఉంటుంది. ఆ నందమూరి హీరోలతో మీకున్న అనుబంధం గురించి చెప్పండి?
స) స్వర్గీయ నందమూరి తారక రామారావు నాకొక స్ఫూర్తి ప్రధాత. ఇక బాలకృష్ణ గారి నుంచి చాలా నేర్చుకున్నాను. ముఖ్యంగా క్రమ శిక్షణ, ఇక ఆయనతో కాస్త సమయం గడిపినప్పుడల్లా ఎన్నో విషయల్లు నేర్చుకుంటూ ఉంటాను. ఇక హరికృష్ణ, తారక్, కళ్యాణ్ రామ్ లతో నాకు రాపో కాస్త తక్కువ. ఏదన్నా ఫంక్షన్స్ లో కలవడమే తప్ప బయట పెద్దగా కలవలేదు.
ప్రశ్న) ఒక హీరోగా మీరు స్టొరీ వింటున్నప్పుడు ఏమి చూస్తారు? అలాగే ఒక ఆడియన్ గా మీకు నచ్చే సినిమాలు ఏమిటి, మీరు హీరోగా చేయాలనుకునే సినిమాలేమిటి?
స) ముందు నేను రెండున్నర గంటలు స్క్రిప్ట్ వింటాను. ఆ టైంలో నేను ఇంప్రెస్ అయితే సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇస్తాను లేదా లేదు. ఒక ఆడియన్ గా చూడటానికి నాకు ఫ్యామిలీ, కమర్షియల్ ఎంటర్టైనర్ సినిమాలు అంటే ఇష్టం. అదే హీరోగా అయితే ఒక జోనర్ కే ఫిక్స్ అయిపోకుండా అన్ని జోనర్స్ లో సినిమా చేయాలి. ప్రతి సినిమాలో ఏదో ఒక కొత్త దనం చూపించాలి అనుకుంటాను.
ప్రశ్న) మీకు నచ్చి ఆడియన్స్ కి నచ్చుతుందని చేసిన సినిమా ఫెయిల్ అయినప్పుడు మీరెలా ఫీలవుతారు?
స) అలా ఫెయిల్యూర్ వచ్చినప్పుడు మనం చేసిన తప్పు ఏంటనేది తెలుసుకొని అది నెక్స్ట్ సినిమాకి జరక్కుండా చూసుకుంటాను. ఉదాహరణకి ఒక్కడినే సినిమా జస్ట్ కథ విని చేసేసాను. అప్పుడు నేను చేసిన తప్పు ఏమిటంటే సెట్స్ పైకి వెళ్ళే ముందు ఫైనల్ డ్రాఫ్ట్ చూడకుండా, డైరెక్టర్ ని నమ్మి ఆ సినిమా చేసేసాను. అది ఫ్లాప్ అయ్యింది. అందుకే ఇప్పుడు నేను చేస్తున్న అన్ని సినిమాల ఫైనల్ డ్రాఫ్ట్ చదివాకే సెట్స్ పైకి వెళ్తున్నాను.
ప్రశ్న) మీరు చేయాలనుకునే డ్రీం రోల్స్ ఏమున్నాయి?
స) నేను ఒకటి రెండు సార్లు చెప్పాను, దుర్యోధనుడి పాత్ర చేయాలనేది నా డ్రీం రోల్.
ప్రశ్న) ప్రతినిధి మీకు అవసరమైన కమర్షియల్ హిట్ ఇస్తుందని అనుకుంటున్నారా?
స) ప్రతినిధి అనేది ఆలోజింపజేసే సినిమా. అందరూ ఆ పాయింట్ కి కనెక్ట్ అయితే బాగుంటుందని అనుకుంటున్నాను. ఇక హిట్ అనేది ఆడియన్స్ ఏ మూడ్ లో చూస్తారు అనేదాని మీద ఆధార పడుతుంది. నా వరకూ అయితే ఇది ఏ మూడ్ లో వెళ్ళినా కనెక్ట్ అవుతుందని అనుకుంటున్నాను. అలా అయ్యింది అంటే కమర్షియల్ గా సక్సెస్ అయినట్టే. హిట్ లేదా ఫ్లాప్ అనేది పక్కన పెడితే సినిమా చూసిన వాళ్ళెవ్వరూ నిరుత్సాహపడరు అనేది మాత్రం కచ్చితంగా చెప్పగలను.
ప్రశ్న) ఒక 10 సంవత్సరాల తర్వాత నారా రోహిత్ ఇండస్ట్రీలో ఏ పొజిషన్ లో చూసుకోవాలని అనుకుంటున్నారు?
స) ఈ ప్రశ్నకి నా దగ్గర సమాధానం లేదు. కానీ సినిమాలు చేసినన్ని రోజులు ప్రేక్షకులు మెచ్చే సినిమాలు ఇవ్వాలి మధ్య మధ్యలో ‘బాణం’, ‘ప్రతినిధి’ లాంటి డిఫరెంట్ సినిమాలు కూడా చేయాలనుకుంటున్నాను.
ప్రశ్న) సినిమాకి సినిమాకి మధ్య గ్యాప్ ఎందుకు తీసుకుంటున్నారు? మీ తదుపరి రానున్న సినిమాలు ఏమిటి?
స) ఇక నుంచి గ్యాప్ తీసుకోకూడదు అనుకుంటున్నాను, అందుకే ఈ సంవత్సరం వరుసగా నా సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. నేను చేసిన ‘శంకర’ రిలీజ్ కి రెడీగా ఉంది. ‘రౌడీ ఫెలో’ 80% షూటింగ్ అయ్యింది, ఇంకా టైటిల్ పెట్టని ఓ లవ్ ఎంటర్టైనర్ కూడా 80% షూటింగ్ అయ్యింది. ఇవి కాకుండా సతీష్ డైరెక్షన్ లో ఓ సినిమా చేస్తాను. ‘మద్రాసి’ సినిమా కొన్ని కారణాల వల్ల ఆగిపోయింది. ఆ సినిమాని త్వరలోనే రీ స్టార్ట్ చేసి అది ఫినిష్ చేసాక అదే డైరెక్టర్ తో మరో సినిమా ఉంటుంది.
ప్రశ్న) చివరిగా ప్రతినిధి గురించి మా పాఠకులకి ఏమి చెప్పాలనుకుంటున్నారు?
స) ప్రతినిధి ప్రతి ఒక్కరికి కనెక్ట్ అయ్యే సినిమా. మనం నిజ జీవితంలో చాలా విషయాలని చిన్న చిన్నవి అని వదిలేస్తుంటాం. ఆ చిన్న చిన్న వాటి ప్రభావం ఏ రేంజ్ లో ఉంటుంది అనేది ప్రతినిధిలో చూపించాం. అందరూ సినిమా చూడండి, మీకు బాగా నచ్చుతుందని నమ్ముతున్నాను.
అంతటితో నారా రోహిత్ కి ‘ప్రతినిధి’ సక్సెస్ అవ్వాలని ఆల్ ది బెస్ట్ చెప్పి మా ప్రత్యేక ఇంటర్వ్యూని ముగించాం. మేము చెఇన ఇంటర్వ్యూ మిమ్మల్ని కూడా మెప్పించిందని ఆశిస్తున్నాం..
రాఘవ