ప్రపంచానికి మైఖేల్ జాక్సన్ ఎలాగో ఇండియాకి ప్రభుదేవా అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. అందుకే ఆయన్ని ఇండియన్ మైఖేల్ జాక్సన్ అంటారు. అలాంటి ప్రభుదేవా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ గ్రేట్ డాన్సర్ టాలీవుడ్ నుంచి దర్శకుడిగా మారాడు. గత 2 దశాబ్దాలుగా తన డాన్సులతో అలరిస్తున్న ప్రభుదేవా ప్రస్తుతం బాలీవుడ్లో డైరెక్టర్ గా మంచి పేరు తెచ్చుకున్నాడు. అలాగే ఆయన తీసిన 2 సినిమాలు 100 కోట్ల క్లబ్ లో కూడా చేరాయి. అలాంటి ప్రభుదేవా గారితో మేము కాసేపు ప్రత్యేకంగా ముచ్చటించాం. తన ఫ్యూచర్ ప్లాన్స్ గురించి ప్రభుదేవా ఏం చెప్పాడు, అతను బాలీవుడ్ లోనే ఎందుకు ఉన్నారు, తెలుగులోకి మళ్ళీ ఎప్పుడు వస్తారు అనే విషయాల్ని మాకు తెలిపారు.. ఆ విశేషాలు మీ కోసం..
ప్రశ్న) ఇన్ని సంవత్సరాలు గడిచినా మీరు ఆంధ్ర ప్రదేశ్లో ఇంకా ఫేమస్. మీ డాన్సులకి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఈ విషయంపై మీరెలా ఫీలవుతున్నారు?
స) అన్నిటికీ కలిపి నేను నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నన్ను ఇంకా గుర్తుపెట్టుకున్నందుకు చాలా సంతోషం(నవ్వులు). ఇన్ని రోజులు గడిచినా ప్రేక్షకులు నాపై చూపిస్తున్న ప్రేమ నాకు చాలా ఆనందాన్ని ఇచ్చింది.
ప్రశ్న) తెలుగు బాక్స్ ఆఫీసు వద్ద పెద్ద హిట్స్ అందుకున్నారు. కానీ 2007 నుంచి మీరు సినిమాలు చేయడం లేదు. దానికి ఏదైనా ప్రత్యేక కారణం ఉందా?
స) అలా ఏమీ లేదండి. ప్రస్తుతం బాలీవుడ్లో కొన్ని కమిట్ మెంట్స్ ఉన్నాయి, అందుకే ఇక్కడ కనపడటం లేదు. నేను ఎక్కడికి వెళ్తానండి.. వచ్చేస్తాను(నవ్వులు). నాకున్న కమిట్ మెంట్స్ పూర్తికాగానే వచ్చేస్తాను.
ప్రశ్న) బాలీవుడ్ లో కంఫర్టబుల్ జోన్ ఏర్పాటు చేసుకుంటున్నట్టు ఉన్నారు?
స) అలా ఏమీ లేదండి.. నేను ఇది వరకు చెప్పినట్టు కమిట్ మెంట్స్ వల్లే అలా చేస్తున్నాను. నేను పనిచేసిన ఏ ఇండస్ట్రీ అయినా నాకు కంఫర్టబుల్. తెలుగు, తమిళ్, హిందీ ఫిల్మ్ ఇండస్ట్రీలలో బాగా కంఫర్టబుల్ గా ఉంటాను.
ప్రశ్న) డాన్సింగ్ లేదా డాన్స్ టీచింగ్ లలో మిమ్మల్ని ఎక్కువ హ్యాపీ గా ఉంచేది ఏది?
స) నాకు రెండు ఇష్టమే. రెండూ నాకు సమాన సంతృప్తిని ఇస్తాయి. కానీ నటన ఇష్టమా, డాన్సు ఇష్టమా , డైరెక్షన్ ఇష్టమా అంటే మాత్రం డాన్సింగ్ ఇష్టం అని చెప్తాను. ఎందుకంటే అందులోనే నేను ఎక్కువగా ఎంజాయ్ చేస్తాను.
ప్రశ్న) డాన్స్ మరియు కోరియోగ్రఫీ ఈ మధ్యకాలంలో బాగా డెవలప్ అయ్యింది మీరేమంటారు?
స) ఒక 10 – 15 ఏళ్ళ క్రితం 1000 మందిలో ఒకరు బాగా డాన్సు వేసేవారు.. 3 – 4 ఏళ్ళ క్రితం ఒక 100 మందిలో ఒకరు డాన్సు బాగా వేసేవారు.. ఇప్పుడు అందరూ డాన్సు బాగా వేస్తున్నారు. డాన్సింగ్ లో పోటి విపరీతంగా పెరిగిపోయింది. ఎప్పుడైతే పోటీ బాగా పెరిగిపోతుందో, అప్పుడు ఆటోమేటిక్ గా కొత్త కొత్త స్టెప్స్ మరియు ప్రయోగాలు ఎక్కువవుతాయి.ప రస్తుతం అదే జరుగుతోంది.
ప్రశ్న) దర్శకుడిగా మీరు ఎవరిని స్ఫూర్తిగా తీసుకుంటారు?
స) నాకు తమిళ్లో శంకర్, కె. బాల చందర్ గారంటే ఇష్టం, తెలుగులో దాసరి నారాయణరావు, రాఘవేంద్ర రావు గార్లంటే ఇష్టం.
ప్రశ్న) హీరోలలో మీకు బాగా ఇష్టమైన తెలుగు హీరో ఎవరు?
స) తెలుగులో దాదాపు అందరి హీరోలతోనూ పనిచేసాను. ఇండస్ట్రీలో ప్రతిఒక్కరూ నన్ను బాగా ట్రీట్ చేసారు. తెలుగులో చాలా మంది మంచి హీరోలున్నారు.
ప్రశ్న) ఇండియాలోని బిగ్గెస్ట్ స్టార్స్ తో కలిసి పనిచేసారు. ఇండియాలో బెస్ట్ డాన్సర్ ఎవరు?
స) డాన్స్ విషయానికి వచ్చే సరికి ఇండియాలో ఇతను బెస్ట్ డాన్సర్ అని ఈజీగా చెప్పలేం. ప్రతి ఇండస్ట్రీలోనూ సొంత టాలెంట్, వారి టేస్ట్ కనపడుతుంది. తెలుగులో అయితే నేను చిరంజీవి గారికి పెద్ద ఫ్యాన్. ప్రస్తుతం ఉన్న యువ హీరోల్లో జూ ఎన్.టి.ఆర్, అల్లు అర్జున్, చరణ్, రామ్ లు బెస్ట్ డాన్సర్స్. వారందరి డాన్స్ లు సూపర్బ్ గా ఉంటాయి. బాలీవుడ్ లో అయితే హృతిక్ రోషన్ బెస్ట్ డాన్సర్.
ప్రశ్న) ‘రామయ్య వస్తావయ్య’, ‘రాంబో రాజ్ కుమార్’ గురించి ఏమన్నా చెప్తారా?
స) ‘రామయ్య వస్తావయ్య’ సినిమా అవుట్ పుట్ బాగా రావడంతో నేను చాలా హ్యాపీగా ఉన్నాను. ఈ చిత్ర నిర్మాత, టెక్నీషియన్స్ అందరూ హ్యాపీగా ఉన్నారు. ప్రేక్షకులు కూడా సినిమా చూసిన తర్వాత హ్యాపీ ఫీలవుతారని ఆశిస్తున్నాను. ఇక ‘రాంబో రాజ్ కుమార్’ విషయానికొస్తే ఇప్పటికి 80% షూటింగ్ పూర్తి చేసుకుంది.
ప్రశ్న) సినిమాలు , డాన్స్ కాకుండా మీకు బాగా ఇష్టమైనవి ఏవి?
స) నాకు సినిమాలు, డాన్సింగ్ లు తప్ప ఇంకేమీ తెలియదు. ఖాళీ దొరికినప్పుడు కాసేపు టీవీ చూస్తుంటాను మరియు అప్పుడప్పుడు క్రికెట్ కూడా చూస్తుంటాను.
ప్రశ్న) మీ డ్రీం ప్రాజెక్ట్స్ ఏమిటి?
స) ఒక హార్రర్ సినిమా చెయ్యాలి. అలాగే హాలీవుడ్ ఫిల్మ్ ‘లార్డ్ అఫ్ ది రింగ్’ స్టైల్లో ‘రామాయణం’ తీయాలి.
ప్రశ్న) సూపర్.. మీరు ఈ సినిమాలు చేయడానికి ఏమన్నా కసరత్తులు చేస్తున్నారా?
స) ప్రస్తుతం ఏమీ లేదు. అలాంటి సినిమా చెయ్యాలంటే కనీసం 500 – 600 కోట్ల బడ్జెట్ కావాలి. ప్రస్తుతం ఇండియా బడ్జెట్ 100 కోట్ల వరకూ ఉంది. ప్రస్తుతం మన మార్కెట్ ఉన్న దాని ప్రకారం రానున్న 5 సంవత్సరాల్లో మనం 500 – 600 కోట్ల మార్క్ బడ్జెట్ స్థాయికి చేరుకుంటాం. అప్పుడు అలాంటి సినిమాలు చేయాడానికి ప్రయత్నిస్తాను.
ప్రశ్న) ‘డీ’ లాంటి రియాలిటీ డాన్స్ ప్రోగ్రామ్స్ ఇప్పుడిప్పుడే వస్తున్న కొరియోగ్రాఫర్స్ కి ఉపయోగపడతాయి అంటారా?
స) అవును. మీరు గమనించి నట్టైతే ‘డీ’ మొదటి ఎడిషన్ లో పాల్గొన్న కొరియోగ్రాఫర్స్ కి ప్రస్తుతం సినిమాల్లో మంచి అవకాశాలు వస్తున్నాయి. కావున ఆ షో ఇప్పుడు వస్తున్న కొరియోగ్రాఫర్స్ టాలెంట్ ని నిరూపించుకోవడానికి సరైన వేదిక.
అంతటితో డాన్సింగ్ కింగ్ ప్రభుదేవాతో మా ఇంటర్వ్యూని ముగించాం, అలాగే ఆయన ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ కి ఆల్ ది బెస్ట్ చెప్పాము. ఈ డాన్సింగ్ లెజెండ్ ఎలాంటి అట్టహాసం లేకుండా చాలా ఫెండ్లీ నేచర్ తో మాట్లాడిన విధానం ఆయనపై ఉన్న మంచి అభిప్రాయాన్ని మరింత పెంచింది. ఈ ఇంటర్వ్యూ మిమల్ని కూడా బాగా ఆకట్టుకుందని ఆశిస్తున్నాం.
ఇంటర్వ్యూ – మహేష్ ఎస్ కోనేరు
అనువాదం – రాఘవ