ఎక్స్ క్లూజివ్ ఇంటర్వ్యూ : దర్శకుడు త్రినాద్ – మేకసూరి 2 థ్రిల్లింగ్ ఎక్స్ పీరియెన్స్ ను ఇస్తుంది

ఎక్స్ క్లూజివ్ ఇంటర్వ్యూ : దర్శకుడు త్రినాద్ – మేకసూరి 2 థ్రిల్లింగ్ ఎక్స్ పీరియెన్స్ ను ఇస్తుంది

Published on Nov 27, 2020 4:00 PM IST

ఆ మధ్య వచ్చిన రియలిస్టిక్ అండ్ బోల్డ్ అటెంప్ట్ “మేకసూరి” చిత్రం మంచి రెస్పాన్స్ ను అందుకుంది. ఇపుడు దానికి సీక్వెల్ జీ 5 స్ట్రీమింగ్ యాప్ లో డిజిటల్ రిలీజ్ కు సన్నద్ధం అవుతున్న నేపథ్యంలో చిత్ర దర్శకుడు త్రినాద్ తో ఓ ఇంటర్వ్యూ తీసుకున్నాము. మరి తాను ఏం చెప్పారు ఇపుడు చూద్దాం.

 

మేకసూరి మొదటి పార్ట్ కు ఎలాంటి రెస్పాన్స్ వచ్చింది?

దానికి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. అంతే కాకుండా ఆ సినిమా థియేట్రికల్ రిలీజ్ ను ఇష్టపడ్డాను కానీ నాతో పాటు చాలా మందికి నచ్చింది. నారా రోహిత్, సాయి కొర్రపాటి, శ్రీ విష్ణు లాంటి వారు నాకు పర్సనల్ గా మెసేజ్ చేసి కంగ్రాట్స్ చెప్పారు. అంతే కాకుండా ఇప్పుడు పార్ట్ 2 కు కూడా వారి విషెష్ తెలిపారు.

 

ఇలాంటి ఒక సహజమైన సినిమాలను తియ్యాలని ఎప్పుడు అనుకొంటూ ఉంటారా?

అవును ఖచ్చితంగా, మన తెలుగులోనే చాలా మంది అనుకొంటూ ఉంటారు మన నుంచి ఎందుకు మళయాళ, తమిళ్ చిత్రాల్లా ఒక రియలిస్టిక్ సినిమాలు రావు అని. సో అలాంటి వారి అందరి కోసమే నా మేకసూరి ఒక సమాధానం అని చెప్తా. నిజ జీవితంలో జరిగిన సంఘటనల ఆధారంగానే మా సినిమాను చాలా సహజంగా తీసాం.

 

మేకసూరి 2 ఎంత వరకు స్పెషల్..?

ఇది ఫస్ట్ పార్ట్ కు సీక్వెల్ అని మీ అందరికీ తెలుసు. అలాగే ఈ సినిమాలో అంతకు మించిన థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఉన్నాయి. క్రేజీ ట్విస్టులు మేకసూరి రోల్ లో మరో యాంగిల్ ఆడియెన్స్ కు మంచి ఎక్స్ పీరియెన్స్ ఇస్తాయి. నా స్టోరీ ప్రకారం నేను మొదటి నుంచి ఈ చిత్రాన్ని రెండు పార్ట్స్ గానే తియ్యాలి అనుకున్నాను, తీసాను. ఇది మాత్రం ఖచ్చితంగా టాలీవుడ్ లో ఒక రియలిస్టిక్ అప్రోచ్ అవుతుందని గ్యారంటీ ఇవ్వగలను.

 

జీ 5 లో రిలీజ్ అంటే ఎలా అనిపిస్తుంది.?

నిజంగా నా జీవితాంతం జీ 5 వారికి రుణపడి ఉంటాను. వారు టైం తీస్కొని నా సినిమాను చూసి మంచి రిలీజ్ గా చేసారు. ఒకవేళ వారు కానీ నా సినిమాను తీసుకోకపోతే థియేట్రికల్ రిలీజ్ లో చాలా ఇబ్బందులు పడేవాడిని. కానీ జీ 5 తో నా సినిమాకు ఇంకా ఎక్కువ రీచ్ వచ్చింది. అనుకున్న దానికన్నా ఎక్కువ మందికి చేరువయ్యింది అందుకు చాలా హ్యాపీ.

 

మీ బ్యాక్గ్రౌండ్ కోసం ఏమన్నా చెప్తారా?

మాది విజయవాడ, నేను ఇంటర్ ఉన్నప్పుడే మా నాన్న గారు చనిపోయారు. ఇంకా ఆ తర్వాతే నేను సినిమాల్లోకి రావాలని అనుకున్నాను. నా లైఫ్ రిస్క్ లో ఉందనే తెలిసి హైదరాబాద్ లోకి వచ్చేసాను. ఇప్పటికి పదేళ్లు అయ్యింది. ఇన్నేళ్లల్లో నేను పడని కష్టం లేదు. నా మొదటి సినిమా చేసే క్రమంలో ఇంటికి, తిండికి ఇబ్బందులు పడ్డాను, అవమానాలు కూడా పడ్డాను.

 

మరి ఈ ఆఫర్ ఎలా వచ్చింది?

రచయితగా అలాగే అసిస్టెంట్ డైరెక్టర్ గా చాలా సినిమాలకు పని చేసిన తర్వాత నేను ఒక సినిమా తియ్యగలను అని నమ్మకం కుదిరింది. అప్పుడు ఒక స్క్రిప్ట్ ను రెడీ చేసుకున్నాక కొంతమంది నిర్మాతలను కలిశా కానీ వర్కవుట్ అవ్వలేదు. అప్పుడు నా సినిమాను నేనే ప్రొడ్యూస్ చెయ్యాలని డిసైడ్ అయ్యి నా ఫ్రెండ్స్ తో కలిసి చేశాను. అలాగే ఇప్పుడు సీక్వెల్ కు ఇంకో నిర్మాణ సంస్థతో కలిసి చేసాం.

 

సినిమాల్లోకి రావడానికి మీకు ప్రేరణ ఏంటి?ఎవరు?

నేను ఫిల్మ్ మేకర్ క్రిస్టోఫర్ నోలన్ కు చాలా పెద్ద ఫ్యాన్ ని. ఆయన వర్క్ నాకు చాలా ఇష్టం అందుకే ఆయనే నా ప్రేరణ. మన తెలుగులో అయితే నాకు సుకుమార్ గారు కొరటాల శివ గారు ఇష్టం. వారి నుంచి కూడా చాలా నేర్చుకున్నాను.

 

భవిష్యత్తు ప్రాజెక్ట్ లు ఉన్నాయా?

మేకసూరి తర్వాత చాలా నిర్మాణ సంస్థలు నన్ను సంప్రదించాయి. అలాగే కొంత మంది హీరోలతో కూడా నేను టచ్ లో ఉన్నాను. ఇంకా నా నెక్స్ట్ సినిమా ఏంటి అన్నది ఫిక్స్ కాలేదు కానీ నేనైతే చాలా సినిమాలు చెయ్యడానికే వచ్చాను. ముందు ఒక జానర్ ను ఎంచుకొని అందులో కథలు రాసుకొని ప్రిపేర్ చేసి సినిమాలు చేస్తాను.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు