ఎస్.ఎస్ రాజమౌళి తో ప్రత్యేక ఇంటర్వ్యూ : రాజుల నేపధ్యంలో ప్రభాస్ తో చిత్రం చెయ్యాలని ఉంది


“ఈగ” చిత్రం విడుదలయిన రోజు నుండి తెలుగు చిత్ర పరిశ్రమకి గర్వకారణం అని చెబుతూ వచ్చారు. ఈ చిత్ర కెప్టెన్ ఎస్ ఎస్ రాజమౌళి టాలివుడ్లో సంచలనం అయ్యారు. ఒదిగి ఉండే స్వభావం కల ఈ దర్శకుడిని ఈరోజు ఇంటర్వ్యూ చేశాం. ఆయన ఈగ చిత్రం చేసినప్పుడు ఎదుర్కొన్న సమస్యలు తన రాబోయే చిత్రాలు మరియు “ది డార్క్ నైట్ రైజస్” గురించి కూడా చెప్పారు. ఆయన నడుచుకున్న విధానం మరియు ఆయన వ్యక్తిత్వం మమ్మల్ని మంత్రముగ్ధులని చేసింది. మీకోసం ఆయనతో మేము జరిపిన ఇంటర్వ్యూ

ప్ర) “ఈగ” చిత్ర విజయానికి శుభాకాంక్షలు. ఈ చిత్రం ఇంతటి విజయం సాదించినందుకు మీకు ఎలా అనిపిస్తుంది?
జ) (నవ్వుతూ). ఈ విజయం నాకు చాలా ప్రత్యేకమయినది నాకు చాలా ఆనందాన్ని ఇచ్చింది. పరిశ్రమలో పెద్దలందరి నుండి కాల్స్ వచ్చాయి కాని ప్రత్యేకమయిన కాల్ మాత్రం రజినీకాంత్ దగ్గర నుండి వచ్చిందే.

ప్ర) ఈగ 2 వస్తుందా?
జ) ఇప్పుడు నేను ఏమి చెప్పలేను. ప్రస్తుతం ప్రభాస్ తో చిత్రం ఉంది మంచి కథ కోసం ప్రయత్నిస్తున్నాం. మంచి కథ దొరకడమే ఇక్కడ ముఖ్యం ఈగ 2 చిత్రం మొదలు పెడితే ఆ చిత్రం మీద భారీ అంచనాలు ఉంటాయి. ఇప్పటికే ఈగ కి ఉన్న బ్రాండ్ నేమ్ ఆ చిత్రం మీద ప్రభావం చూపుతుంది. ఏం జరుగుతుందో వేచి చూద్దాం.

ప్ర) ప్రభాస్ చిత్రం కాకతీయుల మీద ఉంటుందా?
జ ) ప్రభాస్ చిత్రానికి నేను ఇంకా ఎటువంటి కథను అనుకోలేదు. ప్రస్తుతం రెండు కథల మీద పని చేస్తున్నా ఏదో ఒకటి నిర్ణయించుకున్నాక చెప్తాను. నాకు అయితే ప్రభాస్ తో రాజుల మీద ఒక చిత్రం చెయ్యాలని ఉంది, మన పూర్వ రాజుల మీద చాలా కథలు ఉన్నాయి. వాటినే నేను కొత్త రకంగా చూపిస్తాను.

ప్ర ) ఈగ చిత్రం చేస్తున్నప్పుడు ఈ కాన్సెప్ట్ ని జనం ఆదరిస్తారా లేదా అని సందేహం ఎప్పుడయినా వచ్చిందా?
జ ) ఆ సందేహాలన్నీ స్క్రిప్ట్ దశలోనే వచ్చాయి వాటిని అక్కడే నివృతి చేసుకొని చిత్రీకరణ మొదలుపెట్టాము. చాలా సన్నివేశాలకు పలు విధానాలను ప్రయత్నించాము.ఉదాహరణకి చివర్లో ఈగ సుదీప్ ని చంపే సన్నివేశం కోసం మేము పలు రకాల సన్నివేశాలను ఆలోచించాము. స్క్రిప్ట్ మొత్తం పూర్తయ్యాక అందులో మార్పులు చెయ్యకుండా మనం అనుకున్నది సరయిన పద్దతిలో ప్రేక్షకులకు నచ్చేలా తీస్తే చాలు మన పని అయిపోయినట్టే.

ప్ర ) “లాజిక్” అనే పదానికి ఆస్కారం ఇవ్వకూడదు అనే ఉద్దేశంతోనే ఈ చిత్రాన్ని ఒక తండ్రి తన కూతురికి చెబుతున్న కథలా మొదలుపెట్టారా?
జ) (నవ్వుతూ)అలా కూడా అనుకోవచ్చు. కథల్లోనే కదా అద్భుతాలు సాధ్యం అయ్యేవి చిత్రం చూస్తున్నంత కాలం ప్రేక్షకుడిని అలరించడం మా ఉద్దేశం. అది కథలా మొదలు పెడితే ఏదయినా సాధ్యమే కదా.

ప్ర) ఈగ చిత్రం చేస్తున్నప్పుడు మీరు ఎదుర్కొన్న పెద్ద సమస్య ఏది?
జ) యానిమేషన్ పనులు చాలా కష్టమనిపించాయి. వీటి గురించి చాలా నేర్చుకున్నాము. ఈగ హావభావాలను నమ్మేలా చూపించడం కాస్త చాలెంజింగ్ విషయం ఈ భాద్యత ను కీరవాణి గారు తీసుకున్నారు ఆయన అందించిన నేపధ్య సంగీతం ఈ చిత్రంలో చాలా సన్నివేశాలకి ప్రాణం పోసింది.ఆయన అందించిన సంగీతం “ఈగ” ను ప్రేక్షకుల దగ్గరకి తీసుకెళ్ళింది. సుదీప్ మరియు సమంత నటన కూడా ఈ చిత్రానికి బాగా హెల్ప్ అయ్యింది.

ప్ర) సుదీప్ మరియు సమంతల గురించి చెప్పారు కదా వారి నుండి అటువంటి నటనను ఎలా రాబట్టారు?
జ) సుదీప్ మరియు సమంత కెమెరా ముందు లేని “ఈగ” ను ఉందని ఊహించుకొని నటించాలి ఈగ తరువాత పోస్ట్ ప్రొడక్షన్ సమయంలో వచ్చి చేరింది. కాబట్టి మీకు ఇప్పటికే వారు ఎంత కష్టపడి నటించారో అర్ధం అయ్యి ఉండాలి. కేవలం ఊహించుకొని నటించాలి. చాలా కష్టపడి నటించారు.

ప్ర) బాక్స్ ఆఫీస్ వద్ద ఈగ ఏం చేస్తుంది అని అనుకున్నారు? ఇలా రిసీవ్ చేసుకుంటారు అని ఊహించారా?

జ) లేదు. ఈ చిత్రం మంచి వసూళ్లు సాదిస్తుంది అని అనుకున్నా, “మర్యాద రామన్న” చిత్రం కన్నా కాస్త ఎక్కువగా ఉంటుంది అనుకున్నా చిత్రీకరణ సమయంలో మా నిర్మాత సాయి కొర్రపాటికి కూడా ఇదే చెప్పేవాడిని. కాని ఈ చిత్రానికి ప్రేక్షకుల స్పందన చూసి మేము ఆశ్చర్య పోయాం. మీడియా కూడా ఈ చిత్రానికి ఊహించని విధంగా పబ్లిసిటి ఇచ్చింది ఇంతటి ఘన విజయానికి అది కూడా సహాయం చేసింది.

ప్ర) ఈ చిత్రం వేసవిలో వచ్చి ఉంటే వసూళ్లు ఇంకా బాగుండేది అని చాలా మంది అంటున్నారు. మీకు కూడా అలా అనిపించిందా ?

జ) సరయిన సమయంలో విడుదల చేస్తే 10శాతం తేడా ఉండవచ్చేమో అంతే కాని హిట్ చిత్రాన్ని ఫ్లాప్ చిత్రం చెయ్యదు కదా. కానీ ఈ చిత్రం వేసవిలో వచ్చి ఉంటే ఇంకా బాగుండేది.

ప్ర) తరువాతి చిత్రం ఎప్పుడు మొదలు పెడతారు?

జ) ఇంకొక నెల లేదా రెండు నెలలు తరువాత రాబోయే చిత్రాల మీద పని మొదలు పెడతాను. కుంటుంబంతో కలిసి కొద్ది రోజులు గడుపుతాను.

ప్ర) ఈ మధ్య ఏదయినా చిత్రాన్ని చూశారా?

జ) “ది డార్క్ నైట్ రైజస్” చిత్రం చూసాను. చిత్రం చాలా బాగుంది కానీ క్లైమాక్స్ విషయంలో నోలాన్ నన్ను నిరాశపరిచాడు. నేను నోలాన్ నుండి మరింత ఊహించాను. ఈ చిత్ర క్లైమాక్స్ సన్నివేశం లాంటివి మనం చాలా ఇంగ్లీష్ చిత్రాలలో చూశాము. ఏదయినా కొత్తగా చూపిస్తారేమో అని అనుకున్నాను.అయినా కూడా ఇది చాలా మంచి చిత్రం.

ప్ర) ఇప్పుడు మీరు మంచి ఫిలిం మేకర్ గా పేరు తెచ్చుకున్నారు మళ్ళీ మాస్ చిత్రాలు తీసే అవకాశం ఏమయినా ఉందా?

జ) మంచి కథతో ఉండే చిత్రాలను తీస్తాను అవి ఎలాంటి చిత్రాలు అని చెప్పలేను ఒక్కటి మాత్రం చెప్పగలను నా రాబోయే చిత్రాలలో అసభ్యకరమయిన సన్నివేశాలు ఉండబోవు.

ప్ర) మీ కుటుంబంలోని అందరు ఈగ చిత్ర నిర్మాణంలో పాల్గొన్నారు వారు ఏమనుకుంటున్నారు?

జ) వారు ఆనందంతో కూడిన అలసత్వంలో ఉన్నారు. అందువలనే ఈ వెకేషన్ ప్లాన్ చేశాము. నా కుటుంబమే నాకు పెద్ద సపోర్ట్ వాళ్ళు ఆనందంగా ఉంటేనే నేను తరువాత పని మొదలు పెట్టగలను.

ప్ర) హిందిలో ఈగ గురించి?

జ) ఈ చిత్రాన్ని అక్కడ 2డిలో విడుదల చెయ్యలా 3డిలో విడుదల చెయ్యలా అనే విషయం ఇంకా దృవీకరించలేదు 3డిలో అయితే ఈ ఏడాది చివర్లో ఈ చిత్రం విడుదల అవుతుంది. 2డిలో అయితే మరో నెలలో విడుదల చేస్తాము.

ప్ర) ప్రభాస్ చిత్రం కాకుండా భవిష్యత్తులో ఎటువంటి చిత్రాలను చేస్తున్నారు?

జ) (నవ్వుతూ) ఇప్పటి వరకు ఏది దృవీకరించలేదు. శోభు యార్లగడ్డ , కే .ఎల్ నారాయణ మరియు దానయ్యలతో చిత్రాలకు ఒప్పుకున్నాను. ప్రస్తుతం ప్రభాస్ చిత్రం మాత్రమే చేస్తున్నాను. మరో రెండు చిత్రాలు ఎటువంటి చిత్రాలు చెయ్యాలని నిర్ణయించుకోలేదు. .

దీనితో రాజమౌళి గారితో మాట్లాడం పూర్తయ్యింది అయన తన పనిలో నిమగ్నమయ్యారు. అదండీ! రాజమౌళి అంటే నిజాయితీ మరియు నిరాడంబరతల కలబోత. ఆయన్ని చూశాక అయన చేసే చిత్రాలు విజయం ఎలా సాదిస్తుంది అన్న విషయం అర్ధం అయిపోతుంది. అయన భవిష్యత్తులో చేయబోయే చిత్రాలు కూడా విజయం సాదించాలని ఆశిద్దాం.


అనువాదం రవి

Click Here For Interview in English

Exit mobile version