ఆ వెబ్‌సైట్ బ్యాన్ కావడంతో ఊపిరి పీల్చుకుంటున్న సినీ పరిశ్రమలు

Published on Oct 20, 2020 10:04 pm IST

సినిమా పైరసీ గురించి తెలిసిన ఎవరికైనా తమిళ్ రాకర్స్ అనే వెబ్‌సైట్ గురించి తప్పకుండా తెలిసే ఉంటుంది. ఇదొక పైరసీ సైట్. తెలుగు, తమిళం, మలయాళం, హిందీ, ఇంగ్లీష్ ఇలా భాషతో తేడా లేకుండా సినిమాలను పైరసీ చేస్తుంటుంది ఈ వెబ్‌సైట్. అది ఎంత పెద్ద సినిమా అయినా, పైరసీ నివారణకు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా విడుదలైన గంటల వ్యవధిలో ఆ సినిమాను పైరసీ చేసి నెటిజన్ల ముందుపెట్టడం ఈ సైట్ ప్రత్యేకత. కొన్నిసార్లు నిర్మాతలతో ఛాలెంజ్ చేసి మరీ వారి సినిమాలను పైరసీ చేసిన చరిత్ర ఈ తమిళ్ రాకర్స్ సొంతం.

ఈ వెబ్‌సైట్ చేసే పైరసీ మూలంగా ఎందరో నిర్మాతలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అనేకసార్లు పిర్యాధులు చేసి మూయించినా తమిళ్ రాకర్స్ డొమైన్ మార్చుకుని మళ్లీ మళ్లీ రీస్టార్ట్ అయ్యేది. ఈ పైరసీ సైట్ మూలంగా ఎక్కువగా నష్టపోయింది మాత్రం తమిళ పరిశ్రమే. ఈమధ్య థియేటర్లో సినిమాలు లేకపోవడంతో తమిళ్ రాకర్స్ కన్ను ఓటీటీల మీద పడింది. ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ ఈమధ్య విడుదల చేసిన ‘పెంగ్విన్, కాలై, పుథం పుదు, నిశ్శబ్దం’ లాంటి చిత్రాలను పైరసీ చేసింది.

దీంతో అమెజాన్ ఇంటర్నేషనల్ సంస్థ డిజిటల్ మిలీనియం కాపీరైట్ చట్టం ప్రకారం తమిళ్ రాకర్స్ మీద పిర్యాధులు చేసింది. దీంతో ఇంటర్నెట్ కార్పొరేషన్ ఫర్ అసైన్డ్ నేమ్స్ అండ్ నంబర్స్ రిజిస్ట్రీ ద్వారా ఆ సైట్‌ను షట్ డౌన్ చేసేశారు. దీంతో ఇండస్ట్రీ నిర్మాతలు ఊపిరిపీల్చుకుంటున్నారు.

సంబంధిత సమాచారం :

More