కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టే పనిలో భాగంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు లాక్ డౌన్ పాటిస్తున్నాయి. దీనితో దేశంలోని అన్ని పరిశ్రమలతో పాటు చిత్ర పరిశ్రమ సైతం కుదేలయింది. కొత్త సినిమాల విడుదల మరియు షూటింగ్స్ కి బ్రేక్ పడింది. దీనితో చిత్ర పరిశ్రమపై ఆధారపడిన అనేక మంది కార్మికులు ఉపాధి కోల్పోయారు. వీరిని ఆదుకొనేందుకు పరిశ్రమలోని ప్రముఖులు కరోనా క్రైసిస్ ఛారిటీ స్థాపించి విరాళాలు సేకరించారు.
అనేక మంది హీరోలు, దర్శక నిర్మాతలు, నటులు తమ వంతు సాయంగా కరోనా క్రైసిస్ ఛారిటీకి విరాళాలు అందించారు. కాగా నేడు కరోనా బాధితుల సహాయార్తం ఫిలింనగర్ కల్చరల్ సెంటర్ (ఎఫ్ఎన్‌సిసి) తరఫున ప్రెసిడెంట్ ఆదిశేషగిరి రావు, సెక్రటరీ కె.ఎస్.రామారావు మరియు ఎఫ్.ఎన్.సి.సి ఫౌండర్ మెంబర్ జూబ్లీహిల్స్ కార్పొరేటర్ కాజా సూర్యనారాయణ, ఎఫ్.డి.సి. ఛైర్మన్ రామ్మోహన్ రావు సంయుక్తంగా హెల్త్ మినిస్టర్ ఈటెల రాజేందర్ ఆధ్వర్యంలో మంత్రి కె.టి.ఆర్ ను కలిసి రూ.25లక్షల విరాళాన్ని తెలంగాణ ప్రభుత్వ సహాయ నిధికి అందించారు.