విడుదల తేదీ : జూన్ 21, 2019
123తెలుగు.కామ్ రేటింగ్ : 2.5/5
నటీనటులు : ఆర్య,క్యాథెరిన్,దీపరాజ్
దర్శకత్వం : జి.రాఘవన్
నిర్మాత : సూపర్ గుడ్ ఫిలిమ్స్
సంగీతం : యువన్ శంకర్రాజా
సినిమాటోగ్రఫర్ : సతీష్ కుమార్
ఎడిటర్ : దేవ్
తమిళ హీరో ఆర్య,క్యాథెరిన్ థెరిస్సా ప్రధాన పాత్రలలో తెరకెక్కిన మూవీ “గజేంద్రుడు”. ఇది 2017లో విడుదలైన “కదంబన్” తమిళ మూవీకి తెలుగు అనువాదం. దర్శకుడు రాఘవన్ జి దర్శకత్వం వహించగా సూపర్ గుడ్ ఫిలిమ్స్ బ్యానర్ పై నిర్మించారు. ఎటువంటి ప్రచార ఆర్బాటం లేకుండా నేడు విడుదలైన ఈ మూవీ ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం.
కథ:
ఒక తెగ అడవిలో బయట ప్రపంచంతో సంబంధం లేకుండా ఆనందంగా జీవిస్తూ ఉంటారు. ప్రశాతంగా సాగిపోతున్న వారి జీవితాల్లోకి ఒక బిజినెస్ మెన్ మహేంద్ర (దీప రాజ్) రాకతో కల్లోలం మొదలవుతుంది. అరణ్యంలో గల విలువైన సంపదపై కన్నేసిన దీపరాజ్ అత్యాశతో ఆ తెగని ఎలాగైనా అక్కడ నుండి పారద్రోలి అక్కడున్న సహజ సంపదను తన సొంతం చేసుకోవాలని చూస్తాడు. దీనిని వ్యతిరేకించిన గజేంద్ర(ఆర్యా) తన తెగ ప్రజల సహాయంతో బలవంతుడైన మహేంద్రను ఎదిరించడానికి సిద్ధమౌతాడు. ఈపోరాటంలో గజేంద్ర మహేంద్రను ఎదిరించి,తన తెగ ప్రజలను, అడవిని కాపాడుకోగలిగాడా లేదా? అనేది తెరపై చూడాలి.
ప్లస్ పాయింట్స్:
అడవి తెగ ప్రజల జీవన విధానం,వారి అమాయకత్వం అరణ్య నేపథ్యంలో చాలా చక్కగా తెరపై ఆవిష్కరించారు. బలమైన శరీరంతో అడవి తెగకు చెందిన కుర్రాడిగా ఆర్య బాడీ లాంగ్వేజ్ పాత్రకు తగ్గట్టుగా ఉంది. కీలమైన భావోద్వేగ సన్నివేశాలలో ఆయన నటన ఆకట్టుకుంది. అడవి తెగకు చెందిన అమాయకపు అమ్మాయిగా క్యాథెరిన్ తన పాత్ర పరిధిలో మెప్పించింది. ఆర్య,క్యాథెరిన్ ల మధ్య కెమిస్ట్రీ బాగా కుదిరింది.
ఇక అడవి తెగకు చెందిన ప్రజలుగా మిగతా పాత్రధారులు పర్వాలేదనిపించారు. మూవీ క్లైమాక్స్ లో విలన్ మహేంద్రపై గజేంద్ర తెగ ప్రజలు సాంప్రదాయ పురాతన ఆయుధాలతో,ట్రిక్స్ తో యుద్ధం చేసే సన్నివేశం చాలా బాగా వచ్చింది.
మైనస్ పాయింట్స్:
ఈ మూవీలో గల ప్రధాన బలహీనత ఎంటువంటి మలుపులు లేని మెల్లగా సాగే కథనం. తెగ మనుగడ కోసం జరిగే అంత పెద్ద పోరాటానికి సంబందించిన కథ ఎక్కడా గట్టిగా ప్రేక్షకుడి మనసును తాకదు.
హీరో హీరోయిన్ మధ్య కెమిస్ట్రీ బాగా పండినప్పటికీ దానిని అంత బాగా ఆవిష్కరించలేకపోయారు. మరొక ప్రధాన బలహీనత సినిమాలో రెగ్యులర్ కమర్షియల్ అంశాలైన కామెడీ,సాంగ్స్ అనేవి లేకపోవడం.
సాంకేతిక విభాగం:
ఇలాంటి ఓ విభిన్నమైన కథను ఎంచుకొని,దానిని ఆర్యా లాంటి కమిటెడ్ ఆర్టిస్టుతో చేయించిన దర్శకుడు ఎన్. రాఘవన్ ని అభినందించాలి. అడవి తెగ ప్రజల జీవితాలు కొందరు వ్యాపారస్తుల వలన,వ్యవస్థలోని కొన్ని లోపాల కారణంగా ఎలా చిన్నాభిన్నం అవుతున్నాయో, చెప్పాలనుకున్న దర్శకుడు తన ఆలోచనలను ఆసక్తికరంగా మలచడంలో, తెరపై ఆవిష్కరించడంలో విజయం సాదించలేకపోయాడు. కానీ ఆయన నిబద్ధతతో కూడిన ప్రయత్నానికి మెచ్చుకోకుండా ఉండలేం.
ఎక్కడా అనవసరమైన సన్నివేశాలు లేకుండా ఎడిటర్ దేవ్ మంచి అవుట్ ఫుట్ ఇచ్చారు. అద్భుతమైన అడవి అందాలు తన కెమెరాలో బందించిన సినిమాటోగ్రాఫర్ ఎస్ ఆర్ సతీష్ కుమార్ కెమెరా పనితనం బాగుంది. విఎఫ్ ఎక్స్ మరియు గ్రాఫిక్ల్స్ పరవాలేదనిపించాయి.తెగ ప్రజల కాస్ట్యూమ్ ఆ పాత్రలకు వాళ్లు నప్పే విధంగా డిజైన్ చేసారు, ఇక యువన్ శంకర్రాజా అందించిన పాటలు నిరాశపరిచినా, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం ఆకట్టుకుంటుంది. మీడియం బడ్జెట్ మూవీగా తెరకెక్కిన ఈ చిత్రం నిర్మాణ విలువలు ఒకే అనిపిస్తాయి.
తీర్పు:
మొత్తంగా చెప్పాలంటే ‘గజేంద్ర’ మూవీ తమ అస్తిత్వం కాపాడుకోవడానికి వ్యాపార దిగ్గజాలపై చేసిన సామాన్యుల యుద్ధంగా చెప్పవచ్చు. హీరో హీరోయిన్ తో పాటు ప్రధాన పాత్రలలో చేసిన నటులందరూ తమ తమ పాత్రలకు న్యాయం చేశారు. దర్శకుడు రాఘవన్ ఎంచుకున్న కథకి ఆకట్టుకునే కథనం లేకపోవడంతో మూవీ ప్రేక్షకుడి మనసుకు తాకదు. ఎటువంటి మలుపులు లేకుండా, మెల్లగా సాగే మూవీ ప్రేక్షకుడికి కొన్ని చోట్ల అసహనానికి గురిచేస్తుంది.
123telugu.com Rating : 2.5/5
Reviewed by 123telugu Team