ఐపీఎల్ 2025లో భాగంగా బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరిగిన RCB vs GT మ్యాచ్ హోరాహోరీగా సాగింది. టాస్ గెలిచిన గుజరాత్ టైటాన్స్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. దీంతో బ్యాటింగ్‌కు వచ్చిన బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 169 పరుగులు చేసింది. ఓపెనర్లు ఎవరూ పరుగులు చేయకపోవడంతో మిడిలార్డర్ బ్యాట్స్‌మెన్లు లివింగ్‌స్టోన్ (54), జితేష్ శర్మ(33), టిమ్ డేవిడ్(32) పరుగులు చేయడంతో 169 పరుగులు చేశారు.
ఇక 170 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్‌కు వచ్చిన గుజరాత్ టైటాన్స్ ముందు నుండీ దూకుడుగా ఆడుతూ వచ్చింది. ఓపెనర్ సాయి సుదర్శన్ (49), జాస్ బట్లర్(73 నాటౌట్), రూథర్‌ఫోర్డ్(30 నాటౌట్) పరుగులతో రాణించారు. దీంతో కేవలం 17.5 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 13 బంతులు మిగిలి ఉండగానే విజయాన్ని అందుకుంది. గుజరాత్ టైటాన్స్ గెలుపుతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.