విడుదల తేదీ : మార్చి 07, 2025
123తెలుగు.కామ్ రేటింగ్ : 2.5/5
నటీనటులు : జి వి ప్రకాష్ కుమార్, దివ్యభారతి, చేతన్, అళగం పెరుమాళ్, ఎలాంగో కుమారవేల్, సాబుమోన్ అబ్దుసమద్, ఆంటోని, అరుణాచలేశ్వరన్, రాజేష్ బాలచంద్రన్.
దర్శకుడు : కమల్ ప్రకాష్
నిర్మాతలు : జి వి ప్రకాష్ కుమార్ & ఉమేష్ కె ఆర్ బన్సల్
సంగీతం : జి వి ప్రకాష్ కుమార్
ఛాయాగ్రహణం : గోకుల్ బెనోయ్
కూర్పు : శాన్ లోకేష్
సంబంధిత లింక్స్ : ట్రైలర్
ఈ వారం థియేటర్స్ లో రిలీజ్ కి వచ్చిన లేటెస్ట్ చిత్రాల్లో కోలీవుడ్ ప్రముఖ సంగీత దర్శకుడు అలాగే హీరో కూడా అయినటువంటి జివి ప్రకాష్ కుమార్ నటించిన చిత్రం “కింగ్స్టన్” కూడా ఒకటి. తమిళ్ తో పాటు తెలుగులో కూడా రిలీజ్ కి వచ్చిన ఈ చిత్రం ఎలా ఉందో సమీక్షలో చూద్దాం.
కథ:
ఇంకా కథలోకి వస్తే.. 1982 సమయంలో తమిళనాట తూవథుర్ అనే తీరపు గ్రామం అక్కడి గ్రామస్తులు ఎన్నటికీ చేపలు వేట చేయలేరు అనే విధంగా శపించబడుతుంది. అది ప్రస్తుత సమయానికి కూడా కొనసాగగా కింగ్ గా పిలవబడే కింగ్స్టన్ (జి వి ప్రకాష్ కుమార్) తూతుకూడికి చెందిన ఓ స్మగ్లింగ్ గ్యాంగ్ ని లీడ్ చేసే థామస్ (సాబూమోన్ అబ్దుస్మాద్) తో పని చేయడానికి రెడీ అవుతాడు. కానీ థామస్ చేస్తుంది మరో స్మగ్లింగ్ అని తెలుసుకొని ఆ పని వదిలేద్దాం అనుకుంటాడు. అలా మళ్ళీ తన శపించబడిన సముద్రపు వేటకే వెళ్లాలని డిసైడ్ అవుతాడు. మరి ఆ శాపాన్ని తాను ఛేదించగలిగాడా? అసలు ఆ శాపం వెనుక ఉన్న మిస్టరీ ఏంటి? చివరికి ఏమయ్యింది అనేవి తెలియాలి అంటే ఈ చిత్రాన్ని చూసి తెలుసుకోవాలి.
ప్లస్ పాయింట్స్:
ఈ చిత్రంలో పాయింట్ ఒకింత ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుంది. కొంచెం ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ కోరుకునేవారిని ఈ సినిమాలో లైన్ మెప్పించవచ్చు. ఇలా సినిమాలో కొన్ని మూమెంట్స్ వరకు బాగున్నాయి. అలాగే సినిమాలో సెకండాఫ్ లో కొన్ని సీన్స్ బాగున్నాయి. మెయిన్ గా సముద్రంలో పలు యాక్షన్ సన్నివేశాలు బాగున్నాయి. వీటితో పాటుగా కొన్ని థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ కూడా సినిమాలో అక్కడక్కడా ఇంప్రెస్ చేస్తాయి. అలాగే యంగ్ హీరో జీవి ప్రకాష్ కుమార్ మంచి పెర్ఫామెన్స్ ని అందించాడు. ఈ సినిమాలో తన రోల్ కి బాగా సెట్ అయ్యాడు. అలాగే పలు కీలక సన్నివేశాలలో తన నటన బాగుంది.
మైనస్ పాయింట్స్:
ఈ సినిమాలో డీసెంట్ లైన్ ఉన్నప్పటికీ కథనం నడిపిన విధానం డిజప్పాయింట్ చేసి తీరుతుంది. చాలా స్లోగా బోర్ కొట్టించే సన్నివేశాలు, నిజానికి అనవసర సన్నివేశాలు అన్నిటినీ ఇరికించి ఈ సినిమాని తెరకెక్కించినట్టుగా అనిపించక మానదు. అలాగే ఫ్లాష్ బ్యాక్ సన్నివేశాలు పదే పదే తరచూ వస్తుండడం కూడా ఆడియెన్స్ కి చిరాకు తెప్పించేలా ఉంటాయి.
దీనితో సినిమా మెయిన్ పాయింట్ కనెక్ట్ అయ్యి ఉండడం అనేది క్రమేపి తగ్గిపోతుంది. ఇక వీటితో పాటుగా ఈ సినిమాకి కేజీయఫ్ సినిమా తరహా ట్రీట్మెంట్ కూడా కనిపిస్తుంది. ఆ ఫ్లాష్ కార్డ్స్ ఇంకొన్ని బిల్డప్ ఎలివేషన్ సన్నివేశాలు ఆ సినిమా నుంచే ప్రేరణ చెంది చేశారా అన్నట్టు ఉంటాయి. ఇక సినిమాలో ఫస్టాఫ్ అయితే ఆడియెన్స్ సహనాన్ని టెస్ట్ చేయడానికే అన్నట్టు ఉంటుంది.
ఆ ఇంటర్వెల్ వచ్చే వరకు అలా బోర్ గానే సాగుతుంది. ఇంకా సినిమాలో నటీనటుల సమస్యలు కూడా ఉన్నాయి. కొన్ని పాత్రలకి ఆ నటులు సెట్ కాలేదు. అలాగే దివ్య భారతి రోల్ కూడా సినిమాలో అనవసరం అనిపిస్తుంది. ఇంకా సినిమాలో గ్రాఫిక్స్ కూడా చాలా తక్కువ క్వాలిటీలో కనిపిస్తాయి.
సాంకేతిక వర్గం:
ఈ చిత్రంలో నిర్మాణ విలువలు బిలో యావరేజ్ గా ఉన్నాయి. నిర్మాణ విలువలు మాత్రమే కాదు టెక్నికల్ పరంగా కూడా సినిమాలో యావరేజ్ గానే అనిపిస్తుంది. ఆ విఎఫ్ఎక్స్ వర్క్ అయితే చాలా వీక్ అని చెప్పవచ్చు. జీవి ప్రకాష్ మ్యూజిక్ కూడా సోసో గానే ఉంది. సినిమాటోగ్రఫీ ఓకే. అలాగే ఎడిటింగ్ ఇంకా బెటర్ గా చేయాల్సింది. మూమెంట్స్ చాలా డల్ గా ఉన్నాయి. తెలుగు డబ్బింగ్ పర్వాలేదు.
ఇక దర్శకుడు కమల్ ప్రకాష్ విషయానికి వస్తే.. తన మొదటి సినిమాకి కొంచెం డిఫరెంట్ గా ట్రై చేయాలి అనుకున్నారు కానీ అది బెడిసి కొట్టింది. స్క్రీన్ ప్లే పరంగా తాను ఇంకా హార్డ్ వర్క్ చేయాల్సి ఉంది. కేవలం కొన్ని ఎలిమెంట్స్ వరకు మాత్రమే తాను బాగా హ్యాండిల్ చెయ్యగలిగారు. ఇక మిగతా విషయాల్లో మాత్రం డిజప్పాయింట్ చేశారు.
తీర్పు:
ఇక మొత్తంగా చూసినట్టు అయితే ఈ సముద్రపు అడ్వెంచర్ డ్రామా “కింగ్స్టన్” లో చాలా తక్కువ ఎలిమెంట్స్ మాత్రమే ఓకే అనిపించే రేంజ్ లో ఉంటాయి. జీవి ప్రకాష్ తన వల్ల అయ్యింది అంతా చేసాడు కానీ సినిమా కథనంలో లోపాలు ఉన్నాయి. బోరింగ్ ట్రీట్మెంట్, అనవసర సన్నివేశాలు ఈ సినిమాని డల్ గా మార్చేశాయి. సో వీటితో ఈ సినిమా బదులు వేరే సినిమాని ఈ వారాంతానికి ట్రై చేస్తే మంచిది.
123telugu.com Rating: 2.5/5
Reviewed by 123telugu Team