రానా సినిమా హిందీలో మాత్రం రిలీజ్ కాదు

రానా చేస్తున్న సినిమాల్లో ప్రత్యేకంగా కనిపిస్తున్న చిత్రం ‘హాతి మేరే సాతి’. ఏనుగుల నేపథ్యంలో సాగే రియలిస్టిక్ స్టోరీతో తెరకెక్కిన ఈ చిత్రాన్ని తమిళ దర్శకుడు ప్రభు సాలమన్ డైరెక్ట్ చేశారు. తెలుగులో ఈ చిత్రం ‘అరణ్య’ పేరుతో విడుదలకానుంది. తమిళంలో ‘కాదన్’గా రిలీజ్ కానుంది. ఇప్పటికే పలుసార్లు వాయిదాపడిన ఈ చిత్రం ఎట్టకేలకు అన్ని పనులు పూర్తిచేసుకుని ఈ నెల 26న విడుదలకావడానికి రెడీ అయింది.

తెలుగు, తమిళం, హిందీ ఇలా మూడు భాషల్లోనూ ఒకేసారి భారీ ఎత్తున విడుదలచేయాలని ప్లాన్ చేశారు నిర్మాతలు. కానీ అది జరగట్లేదు. 26వ తేదీన హిందీ వెర్షన్ రిలీజ్ అవ్వదట. ఈ విషయాన్ని ఈరోస్ సంస్థ తెలిపింది. మహారాష్ట్రలో పెరుగుతున్న కోవిడ్ కేసులను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నామని, త్వరలోనే కొత్త రిలీజ్ డేట్ చెబుతామని, 26న తెలుగు, తమిళంలో మాత్రం సినిమా విడుదలవుతుందని అన్నారు. లాక్ డౌన్ ఎత్తివేసిన తరవాత కూడ హిందీ సినిమా మార్కెట్ కుదురుకోలేదు. ఇప్పటివరకు వచ్చిన సినిమాలకు ప్రేక్షకుల ఆదరణ అంతంతమాత్రంగానే ఉంటూ వస్తోంది. పైగా ముంబైలో కేసుల సంఖ్య కూడ పెరుగుతోంది. అందుకే విడుదల చేసి నష్టపోవడం కంటే సినిమాను వాయిదా వేయడం మంచిందని ఈ నిర్ణయం తీసుకుని ఉంటారు నిర్మాతలు.

Exit mobile version