సమీక్ష : “హరోం హర” – రొటీన్ లైన్ ఇంప్రెస్ చేసే ట్రీట్మెంట్

సమీక్ష : “హరోం హర” – రొటీన్ లైన్ ఇంప్రెస్ చేసే ట్రీట్మెంట్

Published on Jun 15, 2024 3:07 AM IST
Harom Hara Movie Review in Telugu

విడుదల తేదీ : జూన్ 14, 2024

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.75/5

నటీనటులు: సుధీర్ బాబు, మాల్వికా శర్మ, సునీల్, జయప్రకాష్, లక్కి లక్ష్మణ్, అక్షర గౌడ, అర్జున్ గౌడ, రవి కాలే

దర్శకుడు: జ్ఞాన సాగర్ ద్వారక

నిర్మాతలు : సుమంత్ జి. నాయుడు

సంగీత దర్శకుడు: చైతన్ భరద్వాజ్

సినిమాటోగ్రఫీ: అరవింద్ విశ్వనాథన్

ఎడిటింగ్: రవితేజ గిరిజాల

సంబంధిత లింక్స్: ట్రైలర్

ఈ వారం థియేటర్స్ లోకి వచ్చిన పలు చిత్రాల్లో మన టాలీవుడ్ నుంచి వచ్చిన సాలిడ్ యాక్షన్ డ్రామా “హరోం హర” కూడా ఒకటి. నైట్రో స్టార్ నుంచి నవ దళపతి సుధీర్ బాబుగా మారి చేసిన ఈ చిత్రం ట్రైలర్ తోనే అందరిలో మంచి అంచనాలు రేకెత్తించింది. ఇక ఈ చిత్రం అంచనాలు అందుకుందో లేదో సమీక్ష లో చూద్దాం రండి.

కథ:

ఇక కథలోకి వస్తే ఈ సినిమా నేపథ్యం 1980 దశకం చిత్తూరు జిల్లా కుప్పంలో సెట్ చేయబడి ఉంటుంది. అలా కుప్పం ప్రాంతంలో అత్యంత క్రూరంగా ప్రజల్ని హింసిస్తూ, వారి భూములు లాక్కొని భయపెడుతూ తమ్మిరెడ్డి (లక్కి లక్ష్మణ్) తన తమ్ముడు, కొడుకు శరత్ రెడ్డి (అర్జున్ గౌడ) లతో తానే కింగ్ లా జీవిస్తాడు. మరి ఈ క్రమంలో ఆ ప్రాంతానికి చిన్నపాటి ఉద్యోగం కోసం ఓ కాలేజ్ లో లాబ్ అసిస్టెంట్ గా సుబ్రహ్మణ్యం(సుధీర్ బాబు) వస్తాడు. తన తండ్రి (జయ ప్రకాష్) చేసిన అప్పులు తీర్చడానికి తన టాలెంట్ తో తుపాకుల మాఫియాలోకి సుబ్రహ్మణ్యం అడుగుపెడతాడు. ఈ క్రమంలో తనకు ఎంతో ఇష్టమైన తండ్రికి తమ్మిరెడ్డి వల్ల ఆపద ఎలా వస్తుంది? తన ప్రజల కోసం సుబ్రహ్మణ్యం ఏం చేస్తాడు? గన్ మాఫియా వల్ల సుబ్రహ్మణ్యంకి మంచి జరుగుతుందా చెడు జరుగుతుందా అనేవి తెలియాలి అంటే ఈ సినిమా చూడాల్సిందే.

ప్లస్ పాయింట్స్:

ఖచ్చితంగా ఒక నటుడుగా సుధీర్ బాబుని ప్రతి సినిమాకు మెచ్చుకొని తీరాలి. తన కథా ఎంపిక నుంచి తన పాత్రలకి తాను ఇస్తున్న పెర్ఫామెన్స్ లు చాలా బాగున్నాయని చెప్పాలి. అలా ఈ సినిమాలో తన నుంచి 100 శాతానికి మించి సుధీర్ బాబు అందించాడు. తన లుక్స్ అయితేనేం, మాట, నడవడిక అన్నిట్లో కూడా తాను అదరగొట్టేసాడు. అలాగే తనపై పలు ఎమోషన్స్ కానీ యాక్షన్ సీక్వెన్స్ లు కానీ చాలా బాగున్నాయి.

ఇక ఈ సినిమాలో సుధీర్ తో ఆద్యంతం కనిపించిన నటుడు సునీల్ ఫలని స్వామిగా మంచి నటన కనబరిచారు. ఇంకా మాళవిక పాత్ర కూడా బాగుంది. ఇంకా విలన్ పాత్రల్లో కనిపించిన నటుడు కేజీయఫ్ ఫేమ్ లక్కి లక్ష్మణ్ సాలిడ్ విలనిజాన్ని చూపించారు అని చెప్పాలి. అలాగే కన్నడ నటుడు అర్జున్ గౌడ మంచి డెబ్యూ ఈ సినిమా తో టాలీవుడ్ లో అందించాడు.

ఇక ఈ సినిమాలో హైలైట్ అంశాల్లో హీరో ఎలివేషన్స్ కానీ, మెయిన్ గా సినిమా టోన్ యూనిక్ గా సాగుతున్నట్టుగా ఫస్టాఫ్ లో అనిపిస్తుంది అలాగే బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా సీన్స్ ని మంచి రిఫ్రెషింగ్ గా చూసేందుకు ఇంపుగా మార్చాయి. అలాగే మాస్ అండ్ మంచి వైలెన్స్ యాక్షన్ ని ఇష్టపడేవాళ్ళకి కూడా పుష్కలంగా సాలిడ్ ఎలిమెంట్స్ ఉన్నాయి. ఇక వీటితో పాటుగా సుధీర్, జయప్రకాష్ నడుమ ఎమోషన్స్ బాగున్నాయి. ఇతర నటీనటులు కాదంబరి కిరణ్, అక్షర గౌడ తదితరులు తమ పాత్రలకి పూర్తి న్యాయం చేకూర్చారు.

మైనస్ పాయింట్స్:

ఈ సినిమాలో మేజర్ డ్రా బ్యాక్ ఏదన్నా ఉంది అంటే అది సినిమా లైన్ అని చెప్పాలి. ఇటీవల కాలంలో హీరోని బాగా ఎలివేట్ చేసేందుకు వస్తున్న తరహా లైన్ లోనే హరోం హర కూడా కనిపిస్తుంది. యశ్ కి కేజీయఫ్, అల్లు అర్జున్ కి పుష్ప ఎలానో ఇది సుధీర్ బాబు వెర్షన్ అని చెప్పాలి. అయితే సినిమాలో ఎంచుకున్న ప్రాంత నేపథ్యం భాషా యాస కూడా అలానే ఉండడంతో పుష్ప షేడ్స్ మరింత ఎక్కువగా ఉన్నట్టు అనిపిస్తుంది. కథని చెప్తూ తీసుకెళ్లే విధానం యాస కూడా ఆ సినిమానే మరిపిస్తుంది.

ఇక వీటితో పాటుగా సెకండాఫ్ కొంచెం అక్కడక్కడ స్లో అయినట్లు అనిపిస్తుంది. అలాగే అన్ని యాక్షన్ సీక్వెన్స్ లతో పోలిస్తే క్లైమాక్స్ యాక్షన్ ఎపిసోడ్ మాత్రం చాలా అసహజం గా అనిపిస్తుంది. ఇది ఇంకాస్త బెటర్ గా చేయాల్సింది. అలాగే కొన్ని సీన్స్ లో లాజిక్స్ లేవు మరికొన్ని సీన్స్ అయితే ఇది వరకే చాలా సినిమాల్లో చూసినట్టే అనిపిస్తాయి. మెయిన్ గా ఒక్క హీరో పాత్రని మాత్రమే ఎలివేట్ చేస్తూ సాగే సినిమాలు చాలా గుర్తు రావచ్చు. ఇక వీటితో పాటుగా మాళవిక పాత్రకి సినిమాలో మరీ అంత స్కోప్ లేదు.

సాంకేతిక వర్గం:

సినిమా నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి. సినిమా సెటప్ కి తగ్గట్టుగా వింటేజ్ బ్యాక్ డ్రాప్ అంతా నీట్ గా ఉంది. ఇక సాంకేతిక వర్గంలో మొదటగా చైతన్ భరద్వాజ్ చాలా మంచి సంగీతం అందించారు. మెయిన్ గా ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే సినిమాని ఓ రేంజ్ లో ఎలివేట్ చేసింది. ఇంకా అరవింద్ విశ్వనాథ్ సినిమాటోగ్రఫీ కూడా చాలా బాగుంది. రవితేజ గిరిజాల ఎడిటింగ్ బానే ఉంది కాని కొన్ని సీన్స్ ని వేగవంతం చేయాల్సింది.

ఇక దర్శకుడు జ్ఞ్యానసాగర్ ద్వారక విషయానికి వస్తే.. తను దర్శకునిగా ఈ సినిమాతో మెప్పించాడు కానీ చాలా రొటీన్ కథని తీసుకున్నాడు. డైలాగ్స్ ని బాగా రాసుకున్నాడు అలాగే స్క్రీన్ ప్లే ని కూడా చక్కగా ప్లాన్ చేసుకున్నాడు కానీ ఒక్క కథ విషయంలో పాన్ ఇండియా హిట్స్ పుష్ప, కేజీయఫ్ లని చూసినవాళ్ళకి కొత్తగా అనిపించకపోవచ్చు. కానీ తన వెర్షన్ వరకు హరోం హర ని కూడా ఎక్కడా తగ్గించే విధంగా తెరకెక్కించలేదు. పర్ఫెక్ట్ గా ఎక్కడెక్కడ ఎంత కావాలో ఏ నటీనటులు నుంచి ఎంత రాబట్టాలో బాగానే చూసుకున్నాడు. ఒక్క సినిమా లైన్ విషయం తప్ప తన సైడ్ నుంచి లోపాలు అంత ఎక్కువ లేవు.

తీర్పు:

ఇక మొత్తంగా చూసినట్టు అయితే ఈ “హరోం హర” సుధీర్ బాబు నుంచి మరో సాలిడ్ అటెంప్ట్ అని చెప్పాలి. నటుడుగా కూడా ఈ సినిమా తనకి ప్లస్ గా మారింది అని చెప్పవచ్చు. మంచి క్లీన్ ఎలివేషన్స్, సాలిడ్ మ్యూజిక్ టేస్ట్ ఉన్నవాళ్ళని ఈ సినిమా ఎంగేజ్ చేస్తుంది. దర్శకుడు కూడా సినిమాని బాగానే మలిచాడు కానీ లైన్ ఒకింత రొటీన్ గా అనిపిస్తుంది. ఆల్రెడీ తెలిసిన లైన్ అయినా పర్వాలేదు అంటే ఈ సినిమా మాస్ ఆడియెన్స్ ని బాగానే మెప్పిస్తుంది.

123telugu.com Rating: 2.75/5

Reviewed by 123telugu Team

Click Here For English Review

సంబంధిత సమాచారం

తాజా వార్తలు