అక్కినేని నటవారసులలో ఒకరైన అఖిల్ నటిస్తున్న నాల్గవ చిత్రం ప్రస్తుతం చిత్రీకరణ జరుపుకుంటుంది. తెలుగులో బొమ్మరిల్లు, పరుగు వంటి హిట్ చిత్రాలకు దర్శకత్వం వహించిన బొమ్మరిల్లు భాస్కర్ తెరకెక్కిస్తుండగా గీత ఆర్ట్స్ పతాకంపై అల్లు అరవింద్ సమర్పణలో నిర్మితమౌతుంది. ఐతే అఖిల్ సరసన నటించే హీరోయిన్ కోసం ఈ చిత్రం ప్రకటించిన నాటి నుండి చర్చ జరుగుతూనే ఉంది. మొదట్లో కియారా అద్వానీ, రష్మీక మందాన వంటి హీరోయిన్ల పేర్లు ప్రముఖంగా వినిపించాయి. ఐతే వారెవరూ కాదని తరువాత తెలిసింది.
కాగా నేడు చిత్ర యూనిట్ అఖిల్ తో జోడి కడుతున్న హీరోయిన్ పేరు ప్రకటిస్తూ పోస్టర్ విడుదల చేయడం జరిగింది. పూజా హెగ్డే ఈ చిత్రంలో నటిస్తున్నట్లు వారు అధికారికంగా తెలియజేశారు. కొద్దిరోజులుగా పూజా పేరు ప్రముఖంగా వినిపించిన నేపథ్యంలో నేడు అధికారిక ప్రకటనతో ఊహాగానాలు నిజమైనట్లైంది. అఖిల్ గత మూడు చిత్రాలు ఆశించిన విజయం పొందని తరుణంలో అఖిల్ కి పూజా తో నైనా ఆ లక్ దక్కుతుందేమో చూడాలి. పూజా ప్రస్తుతం బన్నీ సరసన అల వైకుంఠపురంలో చిత్రంతో పాటు, ప్రభాస్ తదుపరి చిత్రంలో కూడా నటిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.