నాకు కమర్షియల్ బ్రేక్ ఇచ్చిన ‘పటాస్’ – సాయి కార్తీక్

నాకు కమర్షియల్ బ్రేక్ ఇచ్చిన ‘పటాస్’ – సాయి కార్తీక్

Published on Jan 27, 2015 8:41 PM IST

Sai-Karthik--(6)
సాయి కార్తీక్.. ఇండస్ట్రీ ప్రముఖులకు, ‘పటాస్’ సినిమా చూసిన ప్రేక్షకులకు పెద్దగా పరిచయం అవసరం లేని పేరు. ‘పైసా’, ‘రౌడీ’, ‘ప్రతినిధి’ సినిమాలతో తన ప్రతిభను నిరూపించుకున్న ఈ యువ సంగీత దర్శకుడు ‘పటాస్’ సినిమాతో తొలి కమర్షియల్ సక్సెస్ అందుకున్నాడు. ఈ సినిమా విజయంలో సాయి కార్తీక్ అందించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కీలక పాత్ర పోషించిందని పలువురు ప్రశంసించారు. ‘పటాస్’ గట్టిగా పేలడంతో థియేటర్లు రీ సౌండ్ తో దద్దరిల్లుతున్నాయి. ఈ సందర్భంగా తన సంతోషాన్ని పంచుకోవడానికి మీడియా మిత్రులతో సమావేశం అయ్యారు సాయి కార్తీక్.

2015లో నేను సంగీతం అందించిన ‘పటాస్’ పెద్ద కమర్షియల్ సక్సెస్ సాధించడం చాలా సంతోషంగా ఉంది. నాకు బ్రేక్ ఇచ్చిన సినిమా ఇది. కృష్ణవంశి ‘పైసా’, రామ్ గోపాల్ వర్మ ‘రౌడీ’, నారా రోహిత్ ‘ప్రతినిధి’ సినిమాల సంగీతానికి మంచి పేరు వచ్చింది. అయితే, అవి కమర్షియల్ గా సక్సెస్ సాధించకపోవడంతో వెలితిగా ఉండేది. ‘పటాస్’తో అది తీరిపోయింది. మణిశర్మ గారితో సహా పలువురు ఇండస్ట్రీ ప్రముఖులు ఫోన్ చేసి అభినందించారు. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ లో సినిమా చేయడం నా అదృష్టంగా భావిస్తున్నాను. నన్ను నమ్మి వరుసగా అవకాశాలు ఇస్తూ కళ్యాణ్ రామ్ గారు ప్రోత్సహిస్తున్నారు. ఈ సినిమాలో బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కి, ‘అరె ఓ సాంబ..’ పాటకు మంచి రెస్పాన్స్ వచ్చింది. బాలకృష్ణ గారి పాటను రీమిక్స్ చేయాలనే ఆలోచన దర్శకుడు అనిల్ రావిపూడిదే. చిన్నతనం నుండి సంగీత కుటుంబంలో పెరగడం వలన సంగీతంపై మమకారం పెరిగింది. ఎవరి వద్ద శిక్షణ తీసుకోకపోయినా, ప్రముఖ సంగీత దర్శకుల వద్ద పని చేశాను. అని సాయి కార్తీక్ చెప్పారు.

దర్శకుడి అభిరుచి మేరకు సంగీతం ఉంటుంది అని చెప్పిన సాయి కార్తీక్, త్వరలో విడుదల కానున్న ‘భం బోలేనాథ్’, ‘అసుర’ సినిమాల కోసం ఎదురుచూస్తున్నారు. ‘పటాస్’ విజయంతో మరిన్ని అవకాశాలు వస్తాయనే ఆశా భావాన్ని వ్యక్తం చేశారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు