ఇంటర్వ్యూ : అదిత్ అరుణ్ – తుంగభద్ర.. నా కెరీర్‌లో ప్రత్యేక సినిమా.!

Adith
ఈగ, అందాల రాక్షసి, లెజెండ్, ఊహలు గుసగుసలాడే, దిక్కులు చూడకు రామయ్య.. ఈ సినిమాల పేర్లు వినగానే మొదట గుర్తొచ్చేది.. వారాహి చలన చిత్రం నిర్మాణ సంస్థ. మంచి అభిరుచితో, కొత్తదనమున్న కథలతో, చిన్న సినిమా – పెద్ద సినిమా అన్న తేడా లేకుండా మంచి సినిమాలనే తీస్తూ వస్తోంది ఆ సంస్థ. ఇప్పుడదే కోవలో శ్రీనివాస్ గోగినేని దర్సకత్వంలో ‘తుంగభధ్ర’ పేరుతో స్థానిక రాజకీయాల నేపథ్యంలో ఒక కొత్త ప్రయత్నంతో మన ముందుకు రానుంది. ఈ సినిమా ఈనెల 20న ప్రేక్షకుల ముందుకు రానున్న సందర్భంగా చిత్ర హీరో అదిత్ అరుణ్‌తో జరిపిన ఇంటర్వ్యూ విశేషాలు..

ప్రశ్న) ‘కథ’ సినిమా తర్వాత తెలుగులో ఎందుకు కనిపించకుండా పోయారు ?

స) చెన్నైలో ఫోటోగ్రఫీ, జర్నలిజం చదివే సమయంలో యాక్టింగ్ అంటే ఇష్టంతో కొన్ని థియేటర్ షోలలో పాల్గొన్నా. ఆ క్రమంలోనే ప్రకాష్ రాజ్ గారు నిర్మించిన హ్యాపీడేస్ తమిళ రీమేక్‌లో హీరోగా నటించే అవకాశం వచ్చింది. ఆ సినిమా చేస్తున్న సమయంలోనే గుణ్ణం గంగరాజు గారు నిర్మించిన ‘కథ’ సినిమాలో హీరోగానూ నటించే అవకాశం వచ్చింది. అలా రెండు సినిమాలూ ఒకేసారి చేసేశాను. ఆ తర్వాత వరుసగా తమిళ చిత్రాల్లో అవకాశాలు రావడంతో అక్కడే ఉండిపోయా. ఆ తర్వాత తెలుగులో వీకెండ్ లవ్ పేరుతో ఓ చిత్రంలో నటించా. ఇప్పుడు వారాహి సంస్థ ద్వారా సినిమా అనగానే నా కెరీర్‌కి మంచి ప్లస్ అవుతుందని భావించి తుంగభద్ర సినిమాలో నటించాను. ఈ సినిమా నా కెరీర్‌కి మంచి ఫౌండేషన్ అవుతుందని భావిస్తున్నాను.

ప్రశ్న) తుంగభద్ర సినిమా గురించి చెప్పండి ?

స) రెండు నదులు కలిసి ఉన్నచోట, రెండు ఊర్ల ప్రజల్లో ఎందుకు విద్వేషాలు చెలరేగాయనే నేపథ్యంలో సాగే ప్రేమకథే ఈ సినిమా. ఒక డీప్ ఇన్నర్ మీనంగ్‌తో దర్శకుడు శ్రీనివాస్ ఈ సినిమాను తెరకెక్కించారు. గ్రామీణ రాజకీయాల నేపథ్యంలో సాగే ఈ కథలో అక్కడి పరిస్థితులు, రాజకీయ కుట్రలను చాలా బాగా తెరకెక్కించాం. మామూలుగా సినిమాల్లో ముఖ్యమంత్రి, పెద్ద రాజకీయ పార్టీల చుట్టూ తిరిగే కథల్లా కాకుండా మనకు బాగా పరిచయమున్న, మన చుట్టూ ఉండే చిన్న రాజకీయ నాయకుల చుట్టూ తిరిగే కథ ఇది. ఎక్కువగా రియల్ లొకేషన్లలోనే సినిమా తీశాం.

ప్రశ్న) ఈ సినిమాలో మీ పాత్ర గురించి చెప్పండి ?

స) ఈ సినిమాలో, నాదొక పల్లెటూరి అబ్బాయి క్యారెక్టర్. పనీ పాట లేకుండా చిల్లరగా తిరిగే శ్రీను అనే పాత్రలో కనిపిస్తాను. అయితే చిల్లరగా తిరిగినా పాత్ర స్వభావం మాత్రం అందరినీ ఆకట్టుకుంటుంది. ఈ పాత్ర కోసం నా స్టైల్ మొత్తం మార్చేశాను. ఇప్పటివరకూ కేవలం లవర్ బాయ్ టైప్ పాత్రలకే పరిమితమైన నేను, ఈ సినిమాలో గడ్డం పెంచి కాస్త రఫ్ లుక్ ట్రై చేశాను. కొంచెం బరువు కూడా పెరిగాను.

ప్రశ్న) ఈ క్యారెక్టర్ కోసం ఏమైనా హోం వర్క్ చేశారా ?

స) ఈ పాత్ర కోసం చాలానే హోం వర్క్ చేశాను. సినిమా గుంటూరు నేపథ్యంగా సాగుతుంది కాబట్టి కొన్నాళ్ళ పాటు అక్కడి యాసను విని, నేర్చుకున్నా. ఇక పాత్ర ఎలా ప్రవర్తించాలి అన్న దానిపై దర్శకుడు పెద్ద స్కెచ్ గీశారు. దాన్ని ఫాలో అవుతూ పాత్ర కరెక్ట్‌గా వచ్చేలా కృషి చేశాను. నిజానికి సినిమా షూటింగ్ మొదలైన పదిహేను రోజుల వరకూ నేను కెమెరా ముందుకు వెళ్ళలేదు. ఈ లోపు ఆ పాత్రలా ప్రవర్తిస్తూ సెట్లో తిరిగేవాడిని. ఇవన్నీ కూడా దర్శకుడు అనుకున్నది అనుకున్నట్లుగా తెరకెక్కించడంలో తోడ్పడ్డాయి.

ప్రశ్న) తుంగభద్రలో సత్యరాజ్ కీలక పాత్ర పోషించినట్టున్నారు ?

స) ఈ సినిమాలో ఆయన ఒక రాజకీయ నాయకుడిగా కనిపిస్తారు. పాత్ర స్వభావం మంచిదైనా కొన్ని రాజకీయ నిర్ణయాల్లో స్వభావానికి విరుద్ధంగా పనిచేయాల్సిన పాత్రను ఆయన చక్కగా పోషించారు. దర్శకుడు మొదటినుంచి కూడా సత్యరాజ్‌ గారినే దృష్టిలో పెట్టుకొని ఆ పాత్రను డిజైన్ చేశారు. మొదట ఆయన ఒప్పుకుంటారో లేదో అనుకున్నాం, కానీ ఒప్పుకున్నారు. అంతకంటే గొప్ప విషయం ఏమిటంటే ఈ సినిమాలోని పాత్ర కోసం ఆయన మహేష్ బాబు సినిమాని సైతం వదులుకోవాల్సి వచ్చింది. అయన పాత్ర సినిమాకి హైలైట్ అవుతుంది.

ప్రశ్న) ముందు మీరు అనుకున్న దానికంటే బడ్జెట్ పెరిగిపోవడానికి కారణం ?

స) నిజమే. సినిమాకి అనుకున్న దానికంటే ఎక్కువే ఖర్చు అయింది. సత్యరాజ్ లాంటి పెద్ద ఆర్టిస్ట్ ఉండడం, న్యాచురల్ లోకేషన్లలో తీసినపుడు ఉండే కొన్ని ప్రాక్టికల్ కారణాలు అన్నీ కలిపితే కొంత బడ్జెట్ పెరిగిందనే చెప్పాలి. సినిమాలో మరికొన్ని కీలక పాత్రల్లో పేరున్న ఆర్టిస్టులను పెట్టడం కూడా బడ్జెట్ పెరుగుదలకు కారణంగా చెప్పొచ్చు. అయితే..ఆ ఖర్చంతా సినిమా ఔట్‌ పుట్‌లో కనిపిస్తుంది. ప్రొడక్షన్ వ్యాల్యూస్ రిచ్‌గా ఉంటాయి.

ప్రశ్న) మీ పరంగా ఈ సినిమాకి హైలైట్స్ ఏంటి ?

స) మేజర్ హైలైట్ సత్యరాజ్ గారి పాత్రేనని చెప్పాలి. గ్రామీణ రాజకీయాల నేపథ్యంలో ఒక కథ రావడం అందరినీ ఆకట్టుకుంటుంది. బలమైన కథాంశం, మంచి ప్రొడక్షన్ వ్యాల్యూస్ సినిమాకి మరో హైలైట్ అవుతాయి. సినిమాలోని పాటలన్నీ ఇప్పటికే హిట్ అయ్యాయి. ఇక నేపథ్య సంగీతం కూడా హైలైట్‌గా నిలుస్తుందనడంలో సందేహం లేదు. సినిమాలో నటించిన వారంతా తమ నటనతో ఆకట్టుకుంటారు.

ప్రశ్న) మీ తదుపరి సినిమాలేంటీ ?

స) ప్రస్తుతం తమిళ, తెలుగు భాషల్లో ఏకకాలంలో నిర్మితమవుతున్న ఓ సినిమాలో హీరోగా చేస్తున్నాను. తెలుగులో ‘నీవైపే’ పేరుతో ఈ సినిమా రూపొందుతోంది. మరికొన్ని అవకాశాలు కూడా వస్తున్నాయి. అయితే సెలెక్టివ్‌గా కథలు ఎంపిక చేసుకుంటున్నా.

ఇక్కడితో హీరో అదిత్ అరుణ్‌తో మా ఇంటర్వ్యూ ముగిసింది. తుంగభద్ర ద్వారా అరుణ్ మంచి హిట్ కొట్టాలని, మరిన్ని మంచి సినిమాలు చేయాలని కోరుకుందాం.

Exit mobile version