‘ఇట్స్ మై లవ్ స్టొరీ’తో కెరీర్ ప్రారంభించి ‘ఋషి’ సినిమాతో బాగా గుర్తింపు తెచ్చుకున్న యంగ్ హీరో అరవింద్ కృష్ణ. ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేని అరవింద్ కృష్ణ స్లోగా డిఫరెంట్ జోనర్స్ లో సినిమాలు చేసుకుంటూ తెలుగు ప్రేక్షకులను మెప్పించడానికి ట్రై చేస్తున్నాడు. అలా చేసిన మరో ప్రయత్నమే ‘అడవి కాచిన వెన్నెల’. ఈ సినిమా ఆగష్టు 1న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా అరవింద్ కృష్ణ తో కాసేపు ముచ్చటించి, ఈ సినిమా విశేషాలను, తన కెరీర్ ప్లాన్స్ గురించి తెలుసుకున్నాం. ఆ విశేషాలు మీ కోసం..
ప్రశ్న) ‘అడవి కాచిన వెన్నెల’ సినిమా ఎలా ఉంటుంది.? అలాగే టైటిల్ లో కాస్త నెగటివ్ ప్రభావం వచ్చినట్టు ఉంది.?
స) ‘అడవి కాచిన వెన్నెల’ సినిమా ద్వారా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి కొత్త జోనర్ ని పరిచయం చేస్తున్నాం. టైటిల్ లో నెగటివ్ ఫీల్ ఉన్న మాట వాస్తవమే.. కానీ పూర్వం ఈ మాటని ఎక్కువగా వాడేవారు.. మేము ఈ సినిమాలో చూపించిన పాయింట్ కోసం మన పూర్వీకులు కూడా అన్వేషణ జరిపే వారు. కానీ వారు చేయలేకపోయిన దానిని వారికి కొనసాగింపుగా ఈ మూవీలో హీరో ఆ పని చేయడం వలన ఈ సినిమా ‘అడవి కాచిన వెన్నెల’ అని పెట్టాం.
ప్రశ్న) ఈ సినిమాలో మీ పాత్ర గురించి చెప్పండి.?
స) ఈ సినిమాలో మొదటిసారి నేను ఓకే రూరల్ ఏరియాకి చెందిన ఓ కుర్రాడి పాత్ర చేసాను. ఈ సినిమాలో నా పాత్రకి మెటల్ ని గుర్తించే సామర్ధ్యం ఉంటుంది. అది ఎలా అంటే నా బాడీ హై లెవల్ ఫ్రీక్వెన్సీ కలిగిన ఎలక్ట్రో మాగ్నెటిక్ వేవ్స్ ని గ్రహించుకోవడం మరియు విడుదల చేయగలిగే సామర్ధ్యం ఉంటుంది. దానివల్ల నేను భూమిలో ఉన్న మెటల్స్ ని కనుక్కోగలను. అలాంటి టాలెంట్ ఉన్న అతను ఒకదాని కోసం అన్వేషిస్తూఉంటాడు. తనని చూసిన అందరూ తను ఏదో నిధి కోసం అన్వేషిస్తున్నాడు అనుకుంటారు కానీ తన అన్వేషణ నిధి కోసమా లేక వేరే ఏమన్నా ఉందా అనేది మీరు తెరపై చూడాలి..
ప్రశ్న) ఈ కాన్సెప్ట్ అర్థం కావడం కాస్త కష్టం.. మరి ఈ కాన్సెప్ట్ ని ఆడియన్స్ కి అర్థమయ్యేలా చెప్పగలిగారా.?
స) మీరన్నట్టు కాస్త టిపికల్ కాన్సెప్ట్.. కానీ మేము ఆడియన్స్ కి అర్థమయ్యేలా చాలా క్లియర్ గా చెప్పాము. నాకు ఆ పవర్ ఎలా వచ్చింది అనేది ఒక సీన్ లో డాక్టర్ ద్వారా బాగా విడమర్చి ఆడియన్స్ కి అర్థమయ్యేలా చెప్పించాం. కావున ఆడియన్స్ కన్ఫ్యూజ్ అవ్వరు.
ప్రశ్న) ఈ సినిమా డైరెక్టర్ అక్కి విశ్వనాథరెడ్డి కథ చెప్పినపుడు మీరు ఎలా ఫీలయ్యారు.?
స) అక్కి విశ్వనాథరెడ్డి చాలా కూల్ అండ్ సాఫ్ట్ పర్సన్. అలాగే తనకి ఏమి కావాలి అన్న విషయంలో బాగా క్లారిటీ ఉన్న వ్యక్తి. మొదట ఈ సినిమా కథ చెప్పగానే నేను ఇలాంటి సినిమా చెయ్యలేను ఏమో అని నో అన్నాను. అప్పుడు అతను నాకు కాన్సెప్ట్ నుంచి మొత్తం క్లియర్ గా చెప్పి నన్ను ఒప్పించారు. అలాగే నేనే ఎందుకు ఈ సినిమాకి అంటే మీలాంటి హీరోలే ఈ సినిమాకి పర్ఫెక్ట్ గా సరిపోతారని నన్ను ఒప్పించాడు.
ప్రశ్న) డైరెక్టర్ కి ఎలాంటి అనుభవం లేదు.. ఆయన చెప్పిన కాన్సెప్ట్ ని పర్ఫెక్ట్ గా స్క్రీన్ పై చూపించగలిగాడా.?
స) నేను స్టార్ హీరో కాదు కాబట్టి ఎప్పుడైతే అనుభవం లేని వాళ్ళతో సినిమా కమిట్ అవుతామో అప్పుడు మేము రిస్క్ చేస్తున్నట్టే.. అక్కి కథ చెప్పినప్పుడు నేను ఒకలా ఉంటుంది అనుకొని ఊహించుకున్నా కానీ అది స్క్రీన్ మీదకి వచ్చే సరికి కాస్త డిఫరెంట్ గా ఉంది. కానీ అనుకున్న కాన్సెప్ట్ ని నుంచి మాత్రం పక్కకి పోకుండా తీసాడు. ఆ మార్పు కూడా ఎందుకు అంటే సినిమాటిక్ వాల్యూస్ వల్ల వచ్చింది.
ప్రశ్న) ఈ సినిమాకి ప్రధాన హైలైట్స్ ఏమవుతాయి.?
స) ఈ సినిమాకి మెయిన్ హైలైట్ కాన్సెప్ట్. ఆ తర్వాత నా పాత్రని రాసుకున్న విధానం, అలాగే దాదాపు 26 నిమిషాలు ఉండే సిజి వర్క్ హైలైట్స్ అవుతాయి. నాకు పర్సనల్ గా అయితే పాటలు బాగా హైలైట్ అవుతాయని అనుకుంటున్నాను.
ప్రశ్న) డైరెక్టర్ ఈ సినిమాని సైన్స్ ఫిక్షన్ – హిస్టారికల్ జోనర్స్ ని కలిపి తీసాం అన్నారు. ఇలా రెండు జోనర్స్ ని కలిపి తీయడం వల్ల ఆడియన్స్ కన్ఫ్యూజ్ అవుతారని మీరనుకోలేదా.?
స) ఇందులో రెండు మూడు జోనర్స్ ని కలిపి తీసాం. కానీ సినిమా పరంగా ఆడియన్స్ కి ఎలాంటి కన్ఫ్యూజన్ ఉండదు. ఎందుకంటే ఎప్పుడైతే స్క్రీన్ ప్లే గందరగోళంగా ఉంటుందో అప్పుడు అది ఒకే జోనర్ సినిమా అయినా ఆడియన్స్ కన్ఫ్యూజ్ అవుతారు. కానీ ఇందులో స్క్రీన్ ప్లే అందరికీ అర్థమయ్యేలా ఉంటుంది.
ప్రశ్న) ట్రైలర్స్ లో గన్స్ పట్టుకొని కనిపించే మీనాక్షి దీక్షిత్ రోల్ గురించి మరియు మిగిలిన పాత్రల గురించి చెప్పండి.?
స) మీనాక్షి దీక్షిత్ పాత్ర ఒలంపిక్స్ కి వెళ్లాలనుకునే ఓ షూటర్ పాత్రలో కనిపించింది. అందుకే తను గన్స్ పట్టుకొని కనిపిస్తుంది. తను సూపర్బ్ గా చేసింది. ఈ సినిమాతో తన టాలెంట్ అందరికీ తెలిసి మరిన్ని హీరోయిన్ చాన్సులు వస్తాయని ఆశిస్తున్నాను. రిషి, పూజ రామచంద్రన్, సురేష్, వినోద్ కుమార్ ల పాత్రలు కూడా అందరినీ ఆకట్టుకుంటాయి.
ప్రశ్న) మీ కెరీర్లో హీరోగా ఇండస్ట్రీతో రిలేషన్ ఎలా ఉంది.? అలాగే ఎందుకు ఎక్కువగా మీడియాతో మాట్లాడడం, కంటిన్యూగా సినిమాలు చేయడం లేదు.?
స) నాకు ఇండస్ట్రీలో పరిచయాలు తక్కువ. నేను పని చేసిన వాళ్ళతో కాంటాక్ట్ లో ఉంటాను. నిజాయితీగా చెప్పాలి అంటే ముందు నేను సినిమాలని సీరియస్ గా తీసుకోలేదు. అందుకే మీడియాతో పెద్దగా టచ్ లో లేను. ప్రస్తుతం నాకు వస్తున్న ఆఫర్స్ ని బట్టి కెరీర్ ని సీరియస్ గా తీసుకున్నాను. ప్రస్తుతం సినిమా గురించి, దాని బిజినెస్ గురించి పూర్తిగా తెలుసుకుంటున్నాను. ఇప్పుడు ఫుల్ టైం జాబుగా సినిమాలను ఎంచుకున్నాను. అందుకే ఈ సంవత్సరం ఎండ్ లోపు 5 సినిమాలను రిలీజ్ చెయ్యడానికి ప్లాన్ చేస్తున్నాను.
ప్రశ్న) మీరొక ప్రాక్టికల్ పర్సన్ అంటున్నారు.. మరి ఇండస్ట్రీలో సక్సెస్ అవ్వాలంటే టాలెంట్ ముఖ్యమా లేక బ్యాక్ గ్రౌండ్ ముఖ్యమా.?
స) నా ఉద్దేశం ప్రకారం రెండూ ఉండాలి, అలా ఉంటే త్వరగా సక్సెస్ అవుతాం. ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎదగడానికి ఒక్క టాలెంట్ ఉంటేనే సరిపోతుంది అని నేను అనుకోను, బ్యాక్ గ్రౌండ్ కూడా ఉండాలి. అలా రెండూ ఉంటే వాళ్ళు ఆడియన్స్ కి బాగా రీచ్ అవుతారు, కెరీర్ కూడా బాగుంటుంది.
ప్రశ్న) ట్రైలర్ రిలీజ్ చేసిన సారధి మూవీ ఏమయ్యింది? మీ తదుపరి సినిమాల గురించి చెప్పండి.?
స) ‘సారధి మూవీ షూటింగ్ పూర్తి చేసాం కానీ ఓవరాల్ గా చూసుకున్నప్పుడు కొన్ని సీన్స్ కరెక్ట్ గా రాలేదు. అందుకే ప్రస్తుతం వాటిని రీ షూట్ చేస్తున్నాం. ‘అడవి కాచిన వెన్నెల’ తర్వాత ‘మన కుర్రాళ్ళే’ సినిమా ఉంటుంది. ఆగష్టు 2న ఆడియో రిలీజ్ చేసి, ఆగష్టు చివర్లో సినిమా రిలీజ్ చెయ్యాలనుకుంటున్నాం. అది కాకుండా తెలుగు – తమిళ భాషల్లో ఓ సినిమా రిలీజ్ కి సిద్దమవుతోంది. ఇది కాకుండా తెలుగులో చేస్తున్న ఓ సినిమాకి ‘యవ్వనం ఒక ఫాంటసీ’ అనే టైటిల్ అనుకుంటున్నాం.
ప్రశ్న) ‘అడవి కాచిన వెన్నెల’ సినిమా కోసం ఆడియన్స్ ఎందుకు రావాలంటారు.?
స) అడవి కాచిన వెన్నెల సినిమా చూడటానికి ఎందుకు రావాలి అంటే ఈ సినిమాలోని పాయింట్ అందరు తెలుగు వాళ్ళకి కనెక్ట్ అయ్యేలా ఉంటుంది. అలాగే తెలుగు సినిమాకి ఇదొక కొత్త జోనర్ మరియు తెలుగు ఆడియన్స్ ఇప్పటి వరకూ స్క్రీన్ మీద చూడనిది ఈ సినిమాలో చూస్తారు. అంతవరకూ నేను గ్యారంటీ ఇవ్వగలను. ఈ సినిమా ద్వారా టాలీవుడ్ కి ఓ సూపర్ హీరో దొరుకుతాడు.
ప్రశ్న) సూపర్ హీరో అంటున్నారు.. దాని గురించి కాస్త క్లియర్ గా చెబుతారా.?
స) చెప్పాలంటే ఈ సినిమాకి సీక్వెల్ ఉంటుంది. సినిమా చివర్లో మీకు ఆ విషయం తెలుస్తుంది. ఎందుకంటే మేము ఎంచుకున్న కాన్సెప్ట్ సెకండ్ పార్ట్ లేకపోతే అసంపూర్ణంగా ఉంటుంది. అలాగే అడవి కాచిన వెన్నెల ద్వారా ఒక సూపర్ హీరో రైజ్ అవుతాడు. మెటల్ ని డిటెక్ట్ చేయగలిగే ఓ వ్యక్తి ఎలా సూపర్ హీరో అయ్యాడు అనేది నెక్స్ట్ పార్ట్ లో ఉంటుంది. ఈ సినిమా రిజల్ట్ ని బట్టి దాన్ని ప్లాన్ చేస్తాం..
అంతటితో అరవింద్ కృష్ణకి ఆల్ ది బెస్ట్ చెప్పి మా ఇంటర్వ్యూని ముగించాం..