ఇంటర్వ్యూ : దాసరి నారాయణరావు – నా సినిమాతో విష్ణు స్టార్ హీరో అవుతాడు..

Dasari-Narayan-rao

దర్శకరత్న దాసరి నారాయణరావు గారు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి పెద్దగా వ్యవహరిస్తూ, 150 చిత్రాలు తీసినా అలుపెరగకుండా సినిమాలు చేస్తున్నారు. రేపటితో దాసరి 68 సంవత్సరాలు పూర్తి చేసుకొని 69 లోకి అడుగుపెడుతున్నారు. ఈ సందర్బంగా ఆయన పత్రికా విలేకరులతో కాసేపు ముచ్చటించారు. ఎంతో నిక్కచ్చిగా మాట్లాడే ఆయన తను చేయబోయే సినిమాల గురించి, ప్రస్తుతం ఇండస్ట్రీలో జరుగుతున్న పరిణామాలను గురించి మాతో మనసు విప్పి మాట్లాడారు. ఆ విశేషాలు మీకోసం ..

ప్రశ్న) ఈ పుట్టిన రోజు సందర్భంగా మీరు చేస్తున్న కార్యక్రమాలు ఏమిటి?

స) గత ఏడాదిన్నరగా సినిమాలకు దూరంగా ఉన్న నేను నా పుట్టిన రోజు నాడు కొత్త సినిమాని ప్రారంభించనున్నాను. ఈ సినిమాకి ‘వడ్డీ కాసులవాడు’ అనే టైటిల్ ని ఖరారు చేసాను. సిఎం ఆఫీస్ లో ఉండే ఓ ప్యూన్ కథే ఈ సినిమా. ఆ ప్యూన్ పాత్రని నేనే చేస్తున్నాను. రియాలిటీకి దగ్గరగా ఉండే ఈ సినిమాలో ఎంటర్టైనింగ్ తో పాటు ఓ చిన్న మెసేజ్ కూడా ఉంటుంది. అది కాకుండా ప్రతి సంవత్సరం పేద విద్యార్థులకి ఇచ్చే స్కాలర్ షిప్పుల పంపిణీ మొదలైనవన్నీ కామన్ గా ఉంటాయి.

ప్రశ్న) ఇది కాకుండా ఇంకేమన్నా సినిమాలు చేయనున్నారా?

స) ఇది కాకుండా నా ప్రొడక్షన్ లో మూడు సినిమాలను నిర్మించనున్నాను. అందులో ఒక దానికి రేలంగి నరసింహారావు దర్శకత్వం వహిస్తాడు. మరో సినిమా ద్వారా నా అసిస్టెంట్ డైరెక్టర్ రవి దర్శకుడిగా పరిచయమవుతాడు. మూడవ సినిమాకి సురేష్ కృష్ణ దర్శకత్వం వహిస్తాడు. ఇవి కాకుండా డా. మోహన్ బాబు – వడ్డే రమేష్ నిర్మించే సినిమాకి దర్శకత్వం వహిస్తాను. ఈ సినిమాలో మంచు విష్ణు హీరోగా నటించనున్నాడు. ఈ సినిమా తర్వాత నూతన తారలతో ఓ లవ్ స్టొరీ చెయ్యాలనుకుంటున్నాను.

ప్రశ్న) కొత్త వాళ్ళతో, చిన్న హీరోలతోనే సినిమాలు ప్లాన్ చేస్తున్నారు. స్టార్ హీరోలతో సినిమాలు చెయ్యరా?

స) (నవ్వుతూ) అలా ఏమీ లేదు. ఈ మధ్య కాలంలో స్టార్ హీరోలు లేని సినిమాలు చాలా తక్కువైపోయాయి. వైవిధ్యం ఉండాలనే ఉద్దేశంతో కొత్తవారితో సినిమాలు చేస్తాను. ఏమో ఈ రోజు నేను పరిచయం చేసిన వాళ్ళే ఫ్యూచర్ లో పెద్ద స్టార్స్ కావచ్చు. అంతెందుకు నేను విష్ణుతో చేయబోయే సినిమాతో విష్ణు స్టార్ హీరో అయిపోతాడు అందులో ఎలాంటి సందేహం లేదు.

ప్రశ్న) కొత్త నటీనటులకి అవకాశం ఇచ్చినట్టే ఇండస్ట్రీకి వచ్చి ఆఫర్ల కోసం ఎదురు చూస్తున్న కొత్త డైరెక్టర్స్ కి కూడా చాన్స్ ఇస్తారా?

స) ఈ విషయం గురించి నేనే చెప్పాలనుకుంటున్నా.. కొత్త డైరెక్టర్స్ కి అయినా లేదా మొదటి సినిమా తీసి ఫెయిల్ అయిన వారైనా మంచి స్క్రిప్ట్ తో వస్తే నా బ్యానర్ లో సినిమా తీసే అవకాశాన్ని ఇస్తాను. కానీ నాకు కథ చెప్పడానికి వచ్చే ముందు ఆ కథని ఎపి స్టొరీ అసోషియేషన్ లో రిజిస్టర్ చేసుకుకొని రావాలి. ఎందుకంటే రేపు ఇది నా స్టొరీ అని వేరే వాళ్ళు రావచ్చు. ప్రతి ఆదివారం నాకు కథ చెప్పాలనుకున్న వాళ్ళు మా ఇంటికి వచ్చి నాకు కథ వినిపించవచ్చు.

ప్రశ్న) ఇండియన్ సినిమా ఈ రోజుతో 100 సంవత్సరాలు పూర్తి చేసుకోనుంది. దీని పై మీ కామెంట్?

స) ఇండియన్ సినిమా నేటితో 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. 100 సంవత్సరాల ఇండియన్ సినిమాలో 82 సంవత్సరాల తెలుగు సినిమా భాగస్వామ్యం ఉండడం చాలా సంతోషం. ఈ సందర్భంగా మీకో విషయం చెప్పాలి. ఈ మే తో నేను కూడా తెలుగు ఇండస్ట్రీకి వచ్చి 50 సంవత్సరాలు పూర్తి కానుంది. అందులో 40 సంవత్సరాలు సక్సెస్ఫుల్ డైరెక్టర్ గా ఉండడం చాలా ఆనందంగా ఉంది.

ప్రశ్న) ఇండస్ట్రీలో సక్సెస్ అయిన మీరు రాజకీయాల్లో ఎందుకంత సక్సెస్ కాలేకపోయారు. మళ్ళీ రాజకీయాల్లోకి వెళ్ళే ఆలోచన ఏమన్నా ఉందా?

స) ప్రతి రంగంలోనూ నేను విజయం సాధించాను ఒక్క రాజకీయాల్లో తప్ప అదీకాకుండా ఒకప్పుడు నేను రాజకీయాల్లోకి రావడానికి వేరే కారణం ఉంది. ఆ విషయం జరిగిపోయిన తర్వాత నేను మళ్ళీ ఇండస్ట్రీకి వచ్చేసాను. సినిమా రంగంలో ఉండే సౌకర్యం రాజకీయాల్లో లేదండి. మళ్ళీ రాజకేయ్యాలోకి వెళ్ళే ప్రసక్తే లేదు. (నవ్వుతూ) చెప్పాలంటే నాకు రాజకీయాలు సూట్ కావు.

ప్రశ్న) ఈ మధ్య పెద్ద సినిమాల్ని ఎక్కువ థియేటర్స్ లో రిలీజ్ చేస్తున్నారు. ఇది ఇండస్ట్రీకి శుభ సూచకం అంటారా?

స) ఈ మధ్య పెద్ద సినిమాలు తీసే నిర్మాతలు తమ సినిమాలు రిలీజ్ కి ముందు వారం, తర్వాతి వారం ఎలాంటి సినిమాలు రాకుండా చూసుకొని ఎక్కువ థియేటర్స్ లో రిలీజ్ చేస్తున్నారు. వీకెండ్ శుక్ర, శని, ఆది వారాల్లో కలెక్షన్స్ బాగా వచ్చేస్తున్దడంతో సినిమా ఎలా ఉన్నా హిట్ అని ఎవరికి వారు డిక్లేర్ చేసేసుకుంటున్నారు. ఇలా చెయ్యడం ఇప్పుడు బాగానే ఉండొచ్చు కానీ ఈ ట్రెండ్ తాత్కాలికం మాత్రమే ఎక్కువకాలం కొనసాగదు. వీరు ఇలా ప్లాన్ చేసుకోవడం వల్ల చిన్న సినిమా వాళ్ళు వారి సినిమాని రిలీజ్ చేసుకోవడానికి థియేటర్స్ లేక ఎదురు చూస్తున్నారు. ఒక్కోసారి పెద్ద సినిమాలకి ఒక డేట్ ఇచ్చేస్తారు తీరా చెప్పిన టైంకి రాకుండా వాయిదా వేసుకుంటూ పోతారు. ఇలా చెయ్యడం వల్ల చిన్న సినిమాలకు చాలా ఇబ్బంది కలుగుతోంది. చెప్పాలంటే 100 కి పైగా చిన్న సినిమాలు అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని తిఎర్స్ లేక రిలీజ్ కి నోచుకోవడం లేదు.

ప్రశ్న) ఇటీవలే మన ప్రభుత్వ టికెట్స్ రెట్లు పెంచింది దీని పై మీ కామెంట్?

స) టికెట్ల రెట్లు పెంచండం కొంత వరకూ మంచిదే కానీ అంత శ్రేయష్కరం కాదని నా అభిప్రాయం. చిన్న సినిమాలకి టికెట్ల రెట్లు పెద్దగా పెంచాల్సిన అవసరం లేదు ఎందుకంటే వాటిని తక్కువ మంది చూస్తారు టికెట్ పెంచితే వారు కూడా చూడరు. అదే పెద్ద సినిమా అనుకోండి వాళ్ళకెంత కావాలో అంత పెంచి అమ్ముకోమను మాకెలాంటి అభ్యంతరం లేదు ఎందుకంటే ఆ సినిమాని చూడటానికి జనాలు వస్తారు. అందుకే నేను సిఎంకి ప్రత్యేకంగా లేఖ రాసాను ఆ లేఖలో టికెట్ల రెట్ల గురించి కాకుండా టాక్స్ గురించి ప్రస్తావించాను. ఆంధ్రపదేశ్ లోని థియేటర్ల లిస్టు తయారు చేయండి. 150 స్క్రీన్స్ లో రిలీజ్ చేస్తే టాక్స్ వెయ్యకండి, ఎవరైతే 150 స్క్రీన్స్ కంటే ఎక్కువ రిలీజ్ చేస్తున్నారో వారి దగ్గర ఇక్కడ కలిగిన నష్టాన్ని రాబట్టుకోండి. అలాగే డబ్బింగ్ సినిమాలకు 100% టాక్స్ వెయ్యండి. అలా చేస్తే ప్రభుత్వానికి ఎలాంటి నష్టమూ రాదు, చిన్న సినిమాలకు మేలు జరుగుతుంది. సగటు సినిమాని, సగటు ప్రేక్షకున్ని బ్రతికించిన వాళ్ళం అవుతాము.

ప్రశ్న) ఇండస్ట్రీలో చాలా మంది సెన్సార్ బోర్డ్ నుంచి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సెన్సార్ వారి ప్రవర్తన పై మీ ఉద్దేశం ఏమిటి?

స) ఒకప్పుడు సెన్సార్ బోర్డ్ అనేది ఏది చూడొచ్చు ఏది చూడకూడదు అని మనకు మనం పెట్టుకున్న స్వయం నియంతృత్వ కమిటీ. అసలు ఈ విషయంలో ప్రభుత్వానికి అసలు సంబంధం లేదు. కానీ మన నాయకులు సెన్సార్ బోర్డ్ లో రాజకీయ నిరుద్యోగులను తీసుకొచ్చి వేస్తున్నారు. వాళ్ళకి తలా తోకా తెలియదు, భాష రాదు కానీ వాళ్ళు మన సినిమాలకు సెన్సార్ చేస్తారు. తెరపై చూపించేది ఏదైనా డైరెక్టర్ స్వభావంపై ఆధారపడి ఉంటుంది. ఉదాహరణకి మీకో సంఘటన చెబుతా.. గతంలో కె.ఎస్.ఆర్ దాసు గారు తన సినిమాల్లో యాక్సిడెంట్ సీన్స్ ఉన్నా, చంపుకోవడాలు ఉన్నా రక్స్తాన్ని మాత్రం చూపించే వారు కాదు ఆదేమంటే చిన్నపిల్లలు కూడా సినిమా చూస్తారు వారి మైండ్లో అది అలాగే ఉండిపోతుందని వద్దు అనేవారు. అదే టైంలో ఉన్న డైరెక్టర్ బి.ఎన్ రెడ్డి గారు మాత్రం అలాంటి వాటిని చాలా క్లియర్ గా చూపేవారు. కాబట్టి సెన్సార్ వారు ఇది చూడొచ్చా లేదా అని నిర్ణయించాలి. ఈ మధ్య వీటన్నితీ మరిచిపోయి ఎవరికీ ఇష్టం వచ్చినట్టు సెన్సార్ అనే దాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారు.

ప్రశ్న) ఈ మధ్య కాలంలో ఆడవాళ్ళపై అత్యాచారాలు ఎక్కువయ్యాయి. ఈ విషయంలో సినిమాల ప్రభావం ఉంటుందంటారు?

స) గతంలో కూడా ఆడవాళ్ళ పై అత్యాచారాలు జరిగేవి కానీ ఈ మధ్య చాలా ఎక్కువై పోయాయి. సమాజం పై మన సినిమాల ప్రభావం కూడా కొంత వరకూ ఉంది. అందుకే ఇప్పుడున్న దర్శకులకు, కొత్త దర్శకులకు ఒక విషయం చెప్పదలుచుకున్నాను. సినిమాలో శృంగారాన్ని చూపించొచ్చు కానీ వల్గారిటీ ఉండకూడదు, లవ్ చూపించాలి కానీ కామాన్ని చూపించకూడదు. ఇలాంటివి యువతపై మరింత ప్రభావాన్ని చూపుతాయి కాబట్టి వాటిని తగ్గించండి.

ప్రశ్న) ఎలక్షన్స్ సమయంలో మీ నుండి ఓ సెటైరికల్ మూవీ వస్తుంది. ఈ ఎలక్షన్స్ సమయంలో కూడా అలాంటి సినిమా ఉంటుంది?

స) ఎలక్షన్స్ ఇంకా సమయం ఉంది కదండి. (నవ్వుతూ) అలా ఎలా చెయ్యకుండా ఉంటాను. ఎలక్షన్స్ కి ముందు కచ్చితంగా ఓ సెటైరికల్ మూవీ ఉంటుంది.

అంతటితో దర్శకరత్న దాసరి గారికి అడ్వాన్స్ పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపి మా ఇంటర్వ్యూని ముగించాము. మేము చేసిన ఈ ఇంటర్వ్యూని మీరు కూడా బాగా ఎంజాయ్ చేసారని ఆశిస్తున్నాం..

CLICK HERE FOR ENGLISH INTERVIEW

Exit mobile version