మురళి శర్మ.. మహేష్ ‘అతిథి’ సినిమాలో విలన్‌గా నటించి తెలుగు పరిశ్రమకు పరిచయమైన నటుడు. ఆ తర్వాత ‘కంత్రీ’, ‘ఊసరవెల్లి’, ‘ధోని’ లాంటి సినిమాల్లో పలు ఆసక్తికర పాత్రలు పోషించిన మురళి, ఈమధ్యే విడుదలై సంచలన విజయం సాధించిన ‘భలే భలే మగాడివోయ్’ సినిమాతో ఒక్కసారిగా క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా స్టార్‌డమ్ తెచ్చుకున్నారు. ఈ సినిమాలో ఆయన పాత్రకు అన్నివర్గాల ప్రేక్షకుల నుంచీ అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. తాజాగా సుశాంత్ సినిమాలో ఓ కీలక పాత్రలో నటిస్తోన్న మురళి శర్మ, ఆ సినిమా షూటింగ్‌లో భాగంగా హైద్రాబాద్ వచ్చారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో పంచుకున్న విశేషాలు..
ప్రశ్న) ‘భలే భలే మగాడివోయ్’ సక్సెస్ తర్వాత కెరీర్ ఎలా ఉంది?
స) అద్భుతంగా ఉందండీ. నేనిప్పటివరకూ ఎన్నో సినిమాల్లో నటించినా కూడా ‘భలే భలే మగాడివోయ్’ సినిమాకు వచ్చినంత పేరు ఏ సినిమాకూ రాలేదు. చెప్పాలంటే ఈ సినిమా తర్వాతే సాధారణ ప్రేక్షకులు కూడా నన్ను గుర్తుపట్టి ఆటోగ్రాఫ్‌లు అడగుతున్నారు. ఒక నటుడికి తన పనిని గుర్తించి, గౌరవించడమనే విషయం కంటే పెద్ద గిఫ్ట్ ఇంకోటి ఉండదు.
ప్రశ్న) ‘భలే భలే మగాడివోయ్’ ఈ స్థాయి విజయం సాధిస్తుందని ముందే ఊహించారా?
స) స్క్రిప్ట్ విన్నపుడే ఈ సినిమాలో ఏదో మ్యాజిక్ ఉందని అర్థమైంది. అయితే అది ఈ స్థాయి విజయం సాధిస్తుందని నేను గానీ, మారుతి గారు గానీ ఎవ్వరం ఊహించలేదు. ఇప్పటికీ మారుతి గారిని ఒకటి అడుగుతూ ఉంటా.. “ఈ క్యారెక్టర్‌కి నేనే సరిపోతానని ఎలా అనిపించింది?” అని. ఈ విషయంలో పూర్తి క్రెడిట్ మారుతి గారికే దక్కుతుంది. ‘భలే భలే మగాడివోయ్’.. నటుడిగా నాకో కొత్త ఐడెంటిటీ!
ప్రశ్న) బాలీవుడ్ సినిమాలతో మొదలైన కెరీర్ ఇప్పటివరకూ ఇలా సక్సెస్‌ఫుల్‌గా సాగుతూంది. ఈ ప్రయాణాన్ని చూస్తే ఏమనిపిస్తుంది?
స) చాలా కొత్తగా ఉంది. సినిమాల్లోకి రావడానికి ముందు నేను జర్నలిజం వృత్తిలో తప్ప ఏ ఇతర పనిలోనూ నెల రోజులకు మించి లేనేమో! ఆ స్థాయిలో నటనపై ఉన్న పిచ్చి నన్ను ఇటువైపు మళ్ళించింది. 2000వ సంవత్సరంలో బాలీవుడ్‌లో అడుగుపెట్టడంతో ప్రారంభమైన యాక్టింగ్ కెరీర్, ఇప్పటికిలా సక్సెస్‌ఫుల్‌గా కొనసాగుతోంది. ఈ రోజు ఇలా మీ ముందు కూర్చొని ఈ ఇంటర్వ్యూ ఇస్తున్నానంటే.. యాక్టింగ్, సినిమా వల్లే!
ప్రశ్న) స్వతహాగా తెలుగు వారైన మీరు మొదట బాలీవుడ్‌లో స్థిరపడ్డారు. ఇప్పుడు టాలీవుడ్‌లో ఈ స్థాయి పేరు తెచ్చుకోగలనని ఎప్పుడైనా ఊహించారా?
స) మా అమ్మగారిది గుంటూరు జిల్లా కావడం, ముంబైలో పుట్టి పెరిగినా, ఇంట్లో అమ్మతో తెలుగులోనే మాట్లాడడం లాంటి విషయాలతో తెలుగంటే చిన్నప్పట్నుంచీ ఇష్టమే! అయితే తెలుగులో ఈ స్థాయి గుర్తింపు వస్తుందని మాత్రం ఎప్పుడూ ఊహించలేదు. ఈ సందర్భంగా దర్శకుడు సురేందర్ రెడ్డికి థ్యాంక్స్ చెప్పుకోవాలి. తెలుగులో మొదటి సినిమాకే మహేష్ లాంటి స్టార్‌తో కలిసి పనిచేసే అవకాశం రావడం, ఆ తర్వాత ఈ జర్నీలో ఇలా మంచి మంచి సినిమాలు రావడం అన్నీ కలిసొచ్చాయ్!
ప్రశ్న) తెలుగు, తమిళం, హిందీ, మరాఠీ.. ఇన్ని భాషల్లో నటిస్తున్నారు. ఒకేసారి ఇన్ని భాషలను ఎలా మేనేజ్ చేయగలుగుతున్నారు?
స) ఇలా సినిమాల మధ్యన సమన్వయం కుదుర్చుకోవడం, ఏ పాత్రకదే వేరు చేసి చూడగలగడం ఇవన్నీ ఈ మధ్య కాలంలో నన్ను నేను ఎస్టాబ్లిష్ చేసుకునే పరిస్థితుల్లో వచ్చిన మెచ్యూరిటీ అనుకుంటా. గత కొన్నాళ్ళుగా పుస్తకాలతోనే ఎక్కువ కాలం గడిపేస్తున్నా. ఆ పుస్తకాల ద్వారా వచ్చిన స్పిరిట్ ఏదో నన్ను ఏ ఒత్తిడీ లేకుండా ఇలా సాఫీగా కెరీర్‌ను ప్లాన్ చేసుకునేలా పనిచేస్తుందేమో అనిపిస్తోంది!
ప్రశ్న) నటనలో మీదైన గుర్తింపు తెచ్చుకున్నారు. రైటింగ్, డైరెక్షన్ వైపు వెళ్ళే ఆలోచన ఏమైనా ఉందా?
స) ప్రస్తుతానికి నా దృష్టంతా నటనపైనే! ఇక జర్నలిజం చేసి ఉండడంతో రాయడాన్ని ఎప్పుడూ వదల్లేదు. అలా ఫ్యూచర్‌లో రాయడం లాంటిదేదైనా చేస్తానేమో కానీ దర్శకత్వం చేయడమనే ఆలోచన కూడా చేయను.
ప్రశ్న) ప్రస్తుతం ఏయే సినిమాలు చేస్తున్నారు. ఎలాంటి పాత్రలను చేయడానికి ఎక్కువ ఇష్టపడతారు?
స) ప్రస్తుతం హిందీలో ఓ రెండు సినిమాలు చేస్తున్నా. తెలుగులో ఇప్పుడు సుశాంత్ సినిమా జరుగుతోంది. వరుసగా అవకాశాలు వస్తూనే ఉన్నాయి. నేను ఏదైనా సినిమా చేయాలంటే నా పాత్ర ఎంత చిన్నదైనా, ఆ పాత్ర ద్వారా కథలో చిన్న గమనం ఉండాలి. నా పాత్రకు కథలో ప్రాధాన్యం ఉండి, అది కథా గమనానికి ఉపయోగపడుతుందంటే వెంటనే చేసేస్తా!