ఇంటర్వ్యూ : నాగ చైతన్య – రిస్క్ చేస్తేనే.. గుర్తింపు దక్కుతుంది!

Naga-Chaitanya
లవర్ బాయ్‌గా, యాక్షన్ హీరోగా తానేంటో నిరూపించుకున్న నాగ చైతన్య.. తాజాగా కాన్ మ్యాన్‌గా మన ముందుకొచ్చారు. స్వామిరారా సినిమాతో తెలుగులో క్రైమ్ కామెడీ సినిమాలకు కొత్త దారిని చూపిన దర్శకుడు సుధీర్ వర్మ నాగ చైతన్యతో తెరకెక్కించిన సినిమాయే ‘దోచేయ్’. ఇందులో మోసం, దొంగతనాలు చేసే వ్యక్తిగా కనిపించి నాగ చైతన్య అందరినీ అలరించారు. గత శుక్రవారం (ఏప్రిల్ 24న) విడుదలైన ఈ సినిమా ప్రేక్షకుల వద్ద నుండి మంచి రెస్పాన్స్ రాబట్టుకుంటోంది. ఈ సందర్భంగా నాగచైతన్యతో జరిపిన ఇంటర్వ్యూ విశేషాలు..

ప్రశ్న) హలో అండీ. ‘దోచేయ్’ సినిమాకు ఎలాంటి రెస్పాన్స్ వస్తోంది?

స) బాగుందండీ. మొదట్లో కాస్త మిక్స్‌డ్ రెస్పాన్స్ వచ్చినా శని, ఆదివారాలు ముగిసేసరికి సినిమాకు పూర్తి పాజిటివ్ టాక్ వచ్చింది. ట్రైలర్ చూసి ఇదేదో సీరియస్ సినిమా అనుకొని ఫ్యామిలీ ఆడియన్స్ మొదట్లో కొంత దూరమయ్యారు. ఇప్పుడిప్పుడే ఫ్యామిలీ ఆడియన్స్ కూడా థియేటర్లకు వస్తున్నారు. సమ్మర్‌ స్పెషల్ ఎంటర్‌టైనర్ అయిన ఈ సినిమా అందరికీ నచ్చుతుంది. బాక్సాఫీస్ పరంగా చూసుకుంటే ‘ఏ’ సెంటర్లలో సినిమా స్ట్రాంగ్‌గా ఉంది. ఇప్పుడిప్పుడే ఫ్యామిలీ ఆడియన్స్ కూడా యాడ్ అవుతుండడంతో అన్ని సెంటర్లలో మంచి కలెక్షన్లు వస్తున్నాయి.

ప్రశ్న) మొదట్లో మిక్స్‌డ్ రెస్పాన్స్ వచ్చినపుడు ఎలా ఫీలయ్యారు?

స) ఈ సినిమా విషయంలో ఫస్ట్ డే టాక్ మేము ముందే ఊహించాం. ఒక డిఫరెంట్ సినిమా తీసినపుడు కచ్చితంగా మొదట్లో కొంత మిక్స్‌డ్ రెస్పాన్స్ వస్తుంది. ఇక్కడా అదే జరిగింది. అయితే ఇలాంటి సినిమాల్లో ఉండే ఎంటర్‌టైన్‌మెంట్, కొత్తదనం జనాల్లోకి వెళ్ళిన తర్వాత సాధారణంగానే సినిమాలు హిట్ దిశగా దూసుకెళతాయ్. ఈ సినిమా విషయంలోనూ అదే జరుగుతోంది.

ప్రశ్న) ‘స్వామిరారా’ దర్శకుడితో మళ్ళీ ఓ క్రైమ్ కామెడీ సినిమాయే అటెంప్ట్ చేయడానికి కారణం?

స) ఒక్కో దర్శకుడికీ ఒక్కో స్పెషాలిటీ ఉంటుంది. వాళ్ళదనే జానర్‌లో వాళ్ళకు పూర్తి స్థాయి పట్టు ఉంటుంది. ‘స్వామిరారా’ నచ్చి సుధీర్ వర్మతో సినిమాకు ప్లాన్ చేశా. సుధీర్ బలం క్రైమ్ కామెడీ. అదే జానర్‌లో మరో కొత్త కథ ట్రై చేస్తే బాగుంటుందని చేశాం. నటుడిగా కొత్త కొత్త జానర్లలో సినిమాలు తీస్తే నన్ను నేను కొత్తగా ఎస్టాబ్లిష్ చేసుకోవచ్చు.

ప్రశ్న) మీ నటనకు ఎలాంటి స్పందన వస్తోంది?

స) చాలా మంచి స్పందన వస్తోంది. సినిమా సినిమాకు యాక్టింగ్ విషయంలో ఒక్కో మెట్టు ఎక్కుతున్నానని అందరూ అంటుంటే చాలా సంతోషంగా ఉంది. నా వరకు నాకు అదే బెస్ట్ కాంప్లిమెంట్.

ప్రశ్న) ఇప్పుడే ప్రయోగాలు చేయాలని ఎందుకనిపించింది?

స) ప్రయోగాత్మక సినిమాలు చేయాలని ఎప్పట్నుంచో ఉండేది. అయితే నాకంటూ ఒక చిన్న ఐడెంటిటీ వచ్చే వరకూ ప్రయోగాలకు దూరంగా ఉన్నా. ఇక ఇప్పుడు సరైన సమయమని భావించాను కాబట్టే వెంటనే ఈ సినిమా చేశా. రిస్క్ అంటూ చేస్తేనే మనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు దక్కుతుంది. ఈ సినిమాతో ‘చైతూ లవర్ బాయ్ తరహా పాత్రలు మాత్రమే చేయగలడు’ అనే ముద్ర చెరిగిపోయింది.

ప్రశ్న) సినిమాలో చేజ్ సీక్వెన్స్‌కు మంచి స్పందన వస్తోంది కదా? వాటి గురించి చెప్పండి?

స) స్టంట్ మాస్టర్ కెచ్చా ఆధ్వర్యంలో తెరకెక్కిన ఛేజ్ సీక్వెన్స్‌లకు మంచి రెస్పాన్స్ వస్తోంది. ఇటువంటి సన్నివేశాలు తెలుగు సినిమాల్లో ఇప్పటివరకూ రాకపోవడంతో అందరూ కొత్తగా ఫీలవుతున్నారు.

ప్రశ్న) హీరోయిన్ కృతి సనన్ గురించి చెప్పండి?

స) కృతి సనన్ తన పాత్రను అద్భుతంగా పోషించింది. ఈ సినిమాకు ఆమె యాడెడ్ అడ్వాంటేజ్. చాలా డెడికేటేడ్‌గా ఈ సినిమా కోసం పనిచేసింది. అందుకే ఆమె పాత్రకు అంత మంచి గుర్తింపు దక్కింది.

ప్రశ్న) నాగార్జున గారు సినిమా చూశాక ఏమన్నారు?

స) నాన్నగారికి ఈ సినిమా బాగా నచ్చింది. ఆయనకు కొత్తదనమున్న సినిమాలంటే చాలా ఇష్టం. చివరి ముప్ఫై నిమిషాలు ఆయనకు విపరీతంగా నచ్చింది. యాక్టింగ్ విషయంలో నన్ను ప్రత్యేకంగా అభినందించారు.

ప్రశ్న) మీ తరువాతి సినిమా ఏంటి?

స) ‘కార్తికేయ’ దర్శకుడు చందూ మొండేటితో ఓ సినిమా చేసే ఆలోచనలో ఉన్నా. ప్రస్తుతం స్క్రిప్ట్ డిస్కషన్స్ జరుగుతున్నాయి. అన్నీ ఫైనల్ కాగానే పూర్తి వివరాలు తెలియజేస్తా.

CLICK HERE FOR ENGLISH INTERVIEW

Exit mobile version