చిట్‌చాట్ : నట్టి కుమార్ – ఆ కారణంతోనే సినిమాలు మానేశా!

natti-kumar

తెలుగు సినీ పరిశ్రమలో 60కి పైగా సినిమాలకు నిర్మాతగా పనిచేసి, మరెన్నో సినిమాలను డిస్ట్రిబ్యూట్ చేస్తూ వచ్చిన నిర్మాత నట్టికుమార్. గత కొన్నేళ్ళుగా సినిమాలు తీయడం మానేసిన నట్టి కుమార్, తాజాగా ఓ కొత్త బ్యానర్‌ ద్వారా మళ్ళీ సినిమాలను మొదలుపెట్టనున్నారు. రేపు (సెప్టెంబర్ 8న) తన పుట్టినరోజు జరుపుకుంటున్న నట్టి కుమార్, ఈ సందర్భంగా కొత్త సినిమాల గురించి చిట్‌చాట్ ద్వారా పంచుకున్నారు. ఆ విశేషాలు..

ప్రశ్న) ముందుగా పుట్టినరోజు శుభాకాంక్షలు. ఈ మధ్య సినిమాలు మానేశారు. మళ్ళీ ఏమైనా ప్లాన్ చేస్తున్నారా?

స) థ్యాంక్స్ అండీ. నా విశాఖ టాకీస్ బ్యానర్‌పై ఇకపై నేను సినిమాలు చేయదల్చుకోవట్లేదు. ఇంతకుముందే చెప్పినట్లు నేను నిర్మాణం నుంచి తప్పుకుంటున్నా. అయితే మా అబ్బాయి, అమ్మాయి మాత్రం ఎన్‌.కె. మీడియాపై సినిమాలు నిర్మిస్తారు. ఇకపై అన్నీ వాళ్ళే చూసుకుంటారు.

ప్రశ్న) ఎన్నో సంవత్సరాలుగా సినీ పరిశ్రమలో ఉన్నారు. ఇప్పుడు సడెన్‌గా నిర్మాతగా సినిమాలు తీయనంటున్నారు. కారణం?

స) మూడేళ్ళ క్రితం వచ్చిన ‘యుద్ధం’, నిర్మాతగా నా చివరి సినిమా. ఒకప్పటితో పోలిస్తే ఇప్పుడు నిర్మాణపరంగా చాలా మార్పులొచ్చాయి. బడ్జెట్ పరిధులు దాటి పెరిగిపోయింది. అందుకే సినిమాలు ఆపేశా. మా అబ్బాయి, అమ్మాయి ప్రొడక్షన్ గురించి తెలుసుకున్నారు. ఇకపై వాళ్ళే నిర్మాతలుగా సినిమాలు నిర్మించనున్నారు. ఎన్.కె.ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై వరుస సినిమాలు ఉంటాయి.

ప్రశ్న) ఈ బ్యానర్‌పై ఎలాంటి సినిమాలు నిర్మిస్తారు?

స) కొత్త దర్శకులెవరైనా మంచి కథలతో, పర్ఫెక్ట్ ప్లాన్‌తో వస్తే ఈ బ్యానర్‌లో సినిమాలు చేస్తాం. ఎన్ని సినిమాలు తీయాలనే విషయంలోనూ లిమిట్ ఏమీ పెట్టుకోలేదు. గతంలో నా బ్యానర్‌లో సంవత్సరానికి ఎనిమిది సినిమాలు కూడా వచ్చాయి. అదే కోవలో కొత్తదనమున్న సినిమాలు నిర్మించడానికి ఈ బ్యానర్ ఎప్పుడూ ముందుంటుంది.

ప్రశ్న) ఈ పుట్టినరోజుకు మీ ప్లాన్స్ ఏంటి?

స) కొత్త బ్యానర్‌తో మా పిల్లలు చేసే సినిమాలు పర్యవేక్షించడం, కొత్త దర్శకులను పరిచయం చేయడం.. ఇలా చాలా ఆలోచనలే ఉన్నాయి. అదే విధంగా మా అబ్బాయి క్రాంతిని 2016లో హీరోగా పరిచయం చేయనున్నాం. అందుకు సంబంధించిన ప్లాన్ చేస్తున్నా. ఇప్పటికే మా అబ్బాయి డైరెక్షన్ కోర్స్ చేశాడు. ప్రస్తుతం యాక్టింగ్ కోర్స్ చేస్తున్నాడు. క్రాంతి లాంచింగ్ సినిమాను భారీగానే ప్లాన్ చేస్తున్నాం.

ప్రశ్న) కెరీర్ పరంగా ఎంతవరకు సంతృప్తి చెందారు?

స) పదమూడేళ్ళ వయస్సులో ఇండస్ట్రీకి వచ్చా. ఆఫీస్ బాయ్‌గా మొదలైన నేను, ఆ తర్వాత నిర్మాతగా 63 సినిమాలు చేశాను. మరెన్నో సినిమాలకు డిస్ట్రిబ్యూటర్, ఎగ్జిబిటర్‌గా పనిచేశా. ఇండస్ట్రీ నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చింది. ఈ ప్రయాణంలో నాకు అండగా నిలిచిన ప్రతి ఒక్కరికీ థ్యాంక్స్ చెప్పుకుంటున్నా. దర్శకరత్న దాసరి నారాయణరావు గారిని నా జీవితాంతం గుర్తు పెట్టుకుంటా. ఇక తమ్మారెడ్డి భరద్వాజ గారిని కూడా ఎప్పటికీ మరిచిపోలేను.

ప్రశ్న) పరిశ్రమలో ఇన్నేళ్ళ అనుభవం ఉంది. కొత్తగా ఇండస్ట్రీకి వస్తోన్న వారికి ఎలాంటి సలహాలిస్తారు?

స) సినీ పరిశ్రమ మనల్ని ఎంత ఎత్తుకైనా చేర్చగలదు. శ్రమ, కష్టాన్ని నమ్ముకొని, జాగ్రత్తగా బడ్జెట్ పరిమితులు తెలుసుకొని మంచి సినిమాలను తీయమని మా పిల్లలకు చెప్పా. ఎవరికైనా ఇదే వర్తిస్తుంది. కొత్తతరాన్ని ప్రోత్సాహిస్తే, కొత్త కథలు పుట్టుకొస్తాయ్. ఆ కోవలో కృషి చేస్తే మంచి విజయాలు సాధించవచ్చు.

Exit mobile version