ఇంటర్వ్యూ : నవీన్ విజయ్‌కృష్ణ – ఆ మాట చెప్పగానే మహేష్ షాక్ అయ్యారు!!

ఇంటర్వ్యూ : నవీన్ విజయ్‌కృష్ణ – ఆ మాట చెప్పగానే మహేష్ షాక్ అయ్యారు!!

Published on Oct 18, 2016 5:15 PM IST

naveen
సీనియర్ నటుడు నరేష్ తనయుడు నవీన్ విజయ్ కృష్ణ హీరోగా పరిచయం అవుతూ ‘నందిని నర్సింగ్ హోమ్’ అనే సినిమాతో వచ్చేస్తున్నారు. అన్ని కార్యక్రమాలనూ పూర్తి చేసుకున్న ఈ సినిమా అక్టోబర్ 21న విడుదలవుతోంది. నవీన్‌కు బంధువైన సూపర్ స్టార్ మహేష్ ఈ సినిమా ఆడియోను ఆవిష్కరించడంతో అప్పట్నుంచే మంచి అంచనాలు బయలుదేరాయి. ఆ అంచనాల మధ్యనే సినిమా విడుదలకు సిద్ధమవుతోన్న సందర్భంగా నవీన్‌తో జరిపిన ఇంటర్వ్యూ విశేషాలు..

ప్రశ్న) ‘నందిని నర్సింగ్ హోమ్’ అంటూ మీ మొదటి సినిమాతో వచ్చేస్తున్నారు. ఎలా అనిపిస్తోంది?

స) నందిని నర్సింగ్ హోమ్ తెలుగు సినిమా అభిమానులు మెచ్చే ఆసక్తికర కథనం, అంశాలతో నడుస్తుంది. మేమంతా సినిమాపై చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నాం. రేపు ప్రేక్షకుల దగ్గర్నుంచీ మంచి రెస్పాన్సే వస్తుందని ఆశిస్తున్నా.

ప్రశ్న) ఫిల్మ్ ఎడిటర్‌గా మీకంటూ ఓ గుర్తింపు తెచ్చుకొని మళ్ళీ హీరోగా మారాలని ఎందుకనుకున్నారు?

స) నిజానికి నాకు చిన్నప్పట్నుంచీ హీరో అవ్వాలనే ఉండేది. నాన్నకు చెప్తే, ‘చదువుకుంటున్నావ్ కదా, ఇప్పుడొద్దు!’ అన్నారు. ఆయనకు ఇష్టం లేదేమో అని ఎడిటింగ్ వైపు వెళ్ళా. తెలీకుండానే ఎడిటింగ్‍పై ఇష్టం పెరిగింది. కృష్ణవంశీ గారిచ్చిన సపోర్ట్‌తో డేంజర్, రాఖీ, తదితర సినిమాలకు పనిచేశా. మహేష్ సినిమాలకు సాంగ్స్, ట్రైలర్స్ కట్ చేసేవాణ్ణి. అయితే ఎడిటింగ్‌లో ఒత్తిడి పెరిగిపోయి, రాత్రీ, పగలూ కష్టపడి ఆరోగ్యం దెబ్బతింది. అప్పుడే బ్రేక్ తీసుకొని హీరో అవ్వాలని ఫిక్స్ అయ్యా.

ప్రశ్న) హీరోగా మారతానన్నప్పుడు ఇంట్లో వారంతా ఏమన్నారు?

స) నాన్న చాలా సంతోషించారు. అయితే ఎడిటింగ్ జాబ్‌లో ఫుడ్‌పై శ్రద్ధ పెట్టకపోవడంతో అప్పట్లో 130 కిల్లోలు ఉండేవాణ్ణి. బరువు తగ్గాకే హీరో అవుదామనుకుంటున్నానని నాన్నకు చెప్పా. ఒక మూడేళ్ళు డైట్, ఎక్సర్‌సైజ్ చేస్తూ అనుకున్నట్లుగానే బరువు తగ్గి 75కి వచ్చా. ఆయనా సంతోష పడ్డారు. ఆ తర్వాత జాగ్రత్తగా ఆలోచించి సినిమాలు మొదలుపెట్టా.

ప్రశ్న) మహేష్ ఎలాంటి ఇన్‌పుట్స్ ఇస్తూ ఉండేవారు. హీరో అవుతానని మీరన్నప్పుడు ఆయన ఎలా స్పందించారు?

స) మహేష్‌తో ఎడిటింగ్ పని చేసేప్పట్నుంచే బాగా పరిచయం ఉండేది. నేను ఎడిటర్ అవుతానని కూడా ఆయనెప్పుడూ అనుకోలేదు. ఒకసారి ఇలాగే హీరో అవుదామనుకుంటున్నా అని చెప్పి, బరువు తగ్గుతున్నా అన్నా. మొదట ఆయన షాక్ అయి, ‘ఒకరు నువ్వున్న పొజిషన్ నుంచి హీరోగా మారేంతగా బరువు తగ్గడం నేనైతే చూడలేదు. కష్టపడు, తగ్గితే హీరో అవుదువు’ అన్నారు. ఆ తర్వాత రెండేళ్ళు ఆయనకెప్పుడూ కనిపించలేదు. బరువు తగ్గాక, ఒకసారి కలిసి ‘నువ్వేనా? ఇంత బరువు తగ్గావా?’ అని షాక్ అయ్యారు. ‘ఇంత డెడికేషన్ ఉంటే సక్సెస్ వస్తుంది. మంచి స్క్రిప్ట్‌లు ఎంచుకో, బాగా కష్టపడు’ అని ఆ తర్వాత మోటివేట్ చేశారు.

ప్రశ్న) నందిని నర్సింగ్ హోమ్ ఎలా ఉండబోతోంది?

స) ట్రైలర్‌లోనే చెప్పేసినట్లు ఈ సినిమాలో నేను చందు అనే ఓ దొంగ డాక్టర్‌గా కనిపిస్తా. అతడలా మారడానికి కారణం ఏంటి? అన్నదాని చుట్టూ కథ నడుస్తుంది. కామెడీ, బేసిక్ ఎమోషన్ ఈ సినిమాకు మేజర్ హైలైట్స్ అని చెప్పగలను.

ప్రశ్న) మీ మొదటి సినిమా ‘అయినా ఇష్టం నువ్వు’ విడుదల కాకముందే, నందిని నర్సింగ్ హోమ్ విడుదలవ్వడం గురించి చెప్పండి?

స) ‘అయినా ఇష్టం నువ్వు’ కొంత రీషూట్ చేయాల్సి ఉంది. అది చాలా క్యూట్ లవ్‍స్టోరీ. ఈ మధ్యలో నందిని నర్సింగ్ హోమ్ పూర్తయ్యేలా కనిపించడంతో ఈ సినిమాను పూర్తి చేసి విడుదల చేస్తున్నాం. ఇక అయినా ఇష్టం నువ్వును కూడా త్వరలోనే పూర్తి చేసి ఫిబ్రవరిలో విడుదల చేస్తాం. ఈ రెండు సినిమాల్లో ఏది డెబ్యూట్ అయినా బాగానే ఉంటుందనుకున్నా. నందిని నర్సింగ్ హోమ్ అయితే ఏ హీరోకైనా పర్ఫెక్ట్ లాంచింగ్‌గా చెప్పుకోవచ్చు.

ప్రశ్న) హీరోగా ఎలాంటి గుర్తింపు తెచ్చుకోవాలనుకుంటున్నారు? ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి?

స) సింపుల్‌గా రియలిస్టిక్ క్యారెక్టర్స్‌ని చేస్తూ వెళ్ళాలని అనుకుంటున్నా. అనవసరమైన హీరోయిజం నేను చేస్తే చూడరు. తెలుగు సినిమా ఫార్మాట్‌లోనే సింపుల్ సినిమాలు చేయాలనుకుంటున్నా. ప్రస్తుతానికి అయినా ఇష్టం నువ్వు పూర్తి చేయాలి. మరో రెండు సినిమాలు డిస్కషన్‌లో ఉన్నాయి. త్వరలోనే ఆ సినిమాలను అఫీషియల్‌గా అనౌన్స్ చేస్తా.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు