ఇంటర్వ్యూ : శశికిరణ్ తిక్క – “మేజర్” తెచ్చిన గౌరవంతో మరిన్ని మంచి సినిమాలు చేసే ప్రయత్నం చేస్తాను.

Published on Jun 8, 2022 5:13 pm IST

లేటెస్ట్ గా పాన్ ఇండియా సినిమా దగ్గరకి వచ్చి హిట్ అయ్యిన మరో తెలుగు సినిమా “మేజర్”. యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో అడివి శేష్ నటించిన ఈ చిత్రాన్ని టాలీవుడ్ యంగ్ ఫిల్మ్ మేకర్ శశికిరణ్ తిక్క అత్యద్భుతంగా తీసాడు. గతంలో ఈ కాంబోలో వచ్చిన “గూఢచారి” సినిమాని టెక్నీకల్ గా ఎంత హై ఎండ్ వాల్యూస్ తో తెరకెక్కించారో తెలిసిందే. ఇప్పుడు ఈ సినిమాని కూడా ఎక్కడా తగ్గకుండా సాలిడ్ గా రూపొందించారు. అయితే ఇది అమర వీరుడు మేజర్ సందీప్ ఉన్ని కృష్ణన్ జీవిత చరిత్ర ఆధారంగా తీయడం అనేది కాస్త సెన్సిబుల్ అంశం కాగా దానిని చక్కగా హ్యాండిల్ చేసినందుకు ఈ యంగ్ దర్శకుడికి మంచి ప్రశంసలు దక్కాయి. మరి ఈ హిట్ సందర్భంగా తాను మీడియాతో మరిన్ని ఆసక్తికర అంశాలు పంచుకున్నారు. మరి అవేంటో చూద్దాం రండి.

 

చెప్పండి మేజర్ కి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే ఏమనిపిస్తుంది?

మేజర్ సినిమాకు వస్తున్న స్పందన ఎంతో సంతృప్తిని ఇస్తోంది. గౌరవాన్ని తెచ్చి పెట్టి గర్వంగా ఫీలయ్యే సినిమా చేశాం. తెలుగులో అద్భుతమైన ఆదరణ దక్కుతోంది. బాలీవుడ్ లోనూ మంచి వసూళ్లు వస్తున్నాయి. విక్రమ్, పృథ్వీరాజ్ చిత్రాలతో చూస్తే మాది చిన్న చిత్రం. అయినా వాటితో పాటే ఆదరణ పొందుతోంది.

 

ఈ సినిమా జర్నీ లో మీకు బాగా సంతృప్తిగా అనిపించిన అంశాలు ఏంటి?

మంచి సినిమా చేస్తామని మేజర్ సందీప్ తల్లిదండ్రులకు మేమిచ్చిన మాటను నిలబెట్టుకున్నామనే సంతోషం మిగిలింది. బాలీవుడ్ నుంచి తెలుగు సినిమా ఇండస్ట్రీ నుంచి చాలా అప్రిసియేషన్స్ వస్తున్నాయి. అల్లు అర్జున్, రానా వంటి హీరోలు ఫోన్స్ చేసి సినిమా చాలా బాగా చేశారు అని మెచ్చుకుంటున్నారు. ఇవన్నీ నేను మర్చిపోలేని జ్ఞాపకాలు. మేజర్ సినిమా ప్రివ్యూ చూశాక సందీప్ వాళ్ల మదర్ నన్ను హత్తుకుని భావోద్వేగానికి గురయ్యారు. మేము ఎంత నిజాయితీగా పనిచేశామో ఆమె స్పందన ద్వారా తెలిసింది.

 

సినిమా కాస్త లేట్ గానే రిలీజ్ అయ్యినట్టు ఉంది?

మేజర్ సినిమా వాస్తవానికి 2020 లోనే విడుదల అవ్వాలి. 40 పర్సెంట్ షూటింగ్ కేవలం 3 నెలల్లో పూర్తి చేశాం. అదే వేగంతో చేసుకుంటూ వెళ్తే సినిమా వేగంగా ఫినిష్ అయ్యేది. ఇంతలో లాక్ డౌన్ వచ్చి పడటం వల్ల సినిమా ఆపేయాల్సి వచ్చింది. తిరిగి షూటింగ్ మొదలుపెట్టే టైమ్ కు ప్రకాష్ రాజ్, రేవతి వంటి పెద్ద ఆర్టిస్టుల డేట్స్ దొరకలేదు. డబ్బింగ్ సహా మొత్తం పనులన్నీ అలా స్ట్రగుల్ పడి కంప్లీట్ చేశాం.

 

హీరో అడివి శేష్ తో మీ ప్రయాణం కోసం చెప్పండి?

అడివి శేష్ తో నాకు మంచి స్నేహం ఉంది. గూఢచారి సినిమా చేసినా, మేజర్ కి పనిచేసినా ఇద్దరం కలిసే వర్క్ చేశాం. నాకు పేరు కంటే సంతృప్తి, గొప్ప సినిమా చేశామనే సంతోషం ముఖ్యం. ఆ రెండూ నాకు దక్కాయి. నాకే పేరు రావాలని నేనెప్పుడూ కోరుకోలేదు. నా సినిమాకు మంచి పేరొస్తే నాకొచ్చినట్లే కదా. గూఢచారి, మేజర్ సినిమాలో ఏ అంశానికి పేరొచ్చినా అందులో దర్శకుడిగా నాకూ భాగముంటుంది. ఏదైనా సినిమా అనేది ఒక కలెక్టివ్ ఎఫర్ట్. ఆ టీమ్ వర్క్ కు నేను గౌరవం ఇస్తాను. గూఢచారి 2 సినిమాకు నేను దర్శకత్వం వహించడం లేదు. కానీ ఆ సినిమా స్క్రిప్టు కానీ మరో క్రియేటివ్ విషయంలో గానీ నేను వాళ్లతో ఉంటాను. గూఢచారి శేష్ తో పాటు నా బ్రైన్ చైల్డ్. కుదిరితే గూఢచారి ఫ్రాంఛైజీలో మరో సినిమాకు దర్శకత్వం వహిస్తా.

 

ఈ సినిమా తర్వాత మీకు మరింత అప్లాజ్ వస్తుంది దీన్నెలా తీసుకుంటారు?

మేజర్ సినిమాకు వచ్చిన పేరు, ఈ సినిమా నాకు తీసుకొచ్చిన గుర్తింపుతో ఇక నేను చేయబోయే సినిమాలు కూడా ఇంతే జాగ్రత్తగా చేయాలనుకుంటున్నాను. ఈ పేరును కాపాడుకుంటూనే సినిమాలు రూపొందిస్తా. ఏ సినిమా చేసినా ఏదో ఒక మంచి కథను చెప్పాలని ఉంది. సితార ఎంటర్ టైన్ మెంట్స్ లో ఓ సినిమాకు ఒప్పందం కుదిరింది. ఈ సినిమా ఏ హీరోతో చేస్తాననేది ఇప్పుడే చెప్పలేను. ఎందుకంటే నేను ముందు కథను సిద్ధం చేసుకుంటా. కనీసం ఆరేడు నెలలు కథ మీద వెచ్చించాల్సి వస్తుంది. కథ పూర్తయ్యాక హీరోను సెలెక్ట్ చేసుకుంటా.

 

మీకు డ్రీం ప్రాజెక్ట్ ఏమన్నా చెయ్యాలని ఉందా? ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఏంటి?

బ్రిటీష్ కాలపు నేపథ్యంతో ఓ సినిమా రూపొందించాలని ఉంది. మరికొన్ని కథలు ఐడియాల రూపంలో, చిన్న డ్రాఫ్ట్ లుగా ఉన్నాయి. నేను సినిమాల ఎంపికలో తొందరపడటం లేదు. కనీసం ఏడాదికి ఒకటైనా చేసుకుంటూ వెళ్లాలని అనుకుంటున్నాను.

సంబంధిత సమాచారం :

సంబంధిత సమాచారం :