ఇంటర్వ్యూ : ప్రిన్స్ – కామెడీయే ‘వేర్ ఈజ్ విద్యాబాలన్’ సినిమాకు హైలైట్!

ఇంటర్వ్యూ : ప్రిన్స్ – కామెడీయే ‘వేర్ ఈజ్ విద్యాబాలన్’ సినిమాకు హైలైట్!

Published on Jun 20, 2015 3:39 PM IST

prince
‘బస్‌స్టాప్’, ‘రొమాన్స్’ సినిమాలతో ప్రేక్షకులను మెప్పించిన యువహీరో ప్రిన్స్ తాజా సినిమా ‘వేర్ ఈజ్ విద్యాబాలన్’. క్రైమ్ కామెడీ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాకు శ్రీనివాస్ దర్శకుడు. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ సినిమా జూన్ 26న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా హీరో ప్రిన్స్‌తో జరిపిన ఇంటర్వ్యూ విశేషాలు..

ప్రశ్న) ‘వేర్ ఈజ్ విద్యాబాలన్’ సినిమా గురించి చెప్పండి?

స) ‘వేర్ ఈజ్ విద్యాబాలన్’ ఓ డిఫరెంట్ కాన్సెప్ట్‌తో తెరకెక్కిన క్రైమ్ కామెడీ సినిమా. ఈ సినిమాలో విద్యాబాలన్ కోసం హీరోతో సహా చాలామంది వెతుకుతూ ఉంటారు. ఆ విద్యాబాలన్ ఎవరు? విద్యాబాలన్ మనిషేనా లేక ఏదైనా కోడ్ పేరా? అన్నది సినిమా చూసి తెలుసుకోవాలి.

ప్రశ్న) ఈ సినిమాలో మీ రోల్ ఏంటి?

స) ఈ సినిమాలో నేనో పిజ్జా డెలివరీ బాయ్‌గా కనిపిస్తా. ఇప్పటివరకూ నేను చేసిన సినిమాల్లో కామెడీ పార్ట్ ఉన్నా, నేనే స్వయంగా కామెడీ చేసిన సినిమాలు లేవు. ఈ సినిమాలో మొదటిసారి కామెడీ ట్రై చేశా. తప్పకుండా అందరికీ నచ్చుతుందన్న నమ్మకం ఉంది.

ప్రశ్న) వేర్ ఈజ్ విద్యా బాలన్ అనే టైటిల్ వెనకున్న కథేంటి?

స) ముందే చెప్పినట్టు ఈ సినిమాలో అందరూ విద్యా బాలన్ కోసం వెతుకుతూ ఉంటారు. మరి ఆ విద్యా బాలన్ ఎవరు? అనే అంశం చుట్టూ తిరిగే కథ కావడంతో వేర్ ఈజ్ విద్యా బాలన్ అనే టైటిల్ పెట్టాం. సినిమా మొదలైనప్పట్నుంచో ఇదే టైటిల్‌కు ఫిక్సయ్యాం.

ప్రశ్న) దర్శకుడు శ్రీనివాస్ గురించి చెప్పండి?

స) శ్రీనివాస్ గారికి తాను చెప్పాలనుకున్న విషయం పట్ల మంచి క్లారిటీ ఉంది. ప్రత్యేకంగా కామెడీ ట్రాక్‌లను ప్లాన్ చేయకుండా కథలో వచ్చే సన్నివేశాల ద్వారానే నవ్వించే ప్రయత్నం చేస్తారు. ఈ సినిమాలో నా యాక్టింగ్ గతంలో చేసిన సినిమాల్లోకెల్లా ది బెస్ట్. అది దర్శకుడి సహకారం వల్లే సాధ్యమైంది.

ప్రశ్న) ఈ సినిమాలో సంపూర్ణేష్ బాబు క్యారెక్టర్ ఏంటి?

స) సంపూర్ణేష్ బాబు ఈ సినిమాలో ఓ డాన్‌గా కనిపిస్తారు. ఆయన క్యారెక్టర్, మ్యానరిజమ్ అందరినీ నవ్వించేలా ఉంటుంది.

ప్రశ్న) ఈ సినిమా హీరోయిన్ గురించి చెప్పండి?

స) ఈ సినిమాలో పంజాబ్ అమ్మాయి జ్యోతి షెట్టి హీరోయిన్‌గా నటించింది. చాలా సరదాగా సాగిపోయే పాత్రలో ఆమె కనిపిస్తుంది. జ్యోతి, కమెడియన్ మధుల కాంబినేషన్లో వచ్చే నా సన్నివేశాలు కడుపుబ్బా నవ్విస్తాయి.

ప్రశ్న) మీ తదుపరి సినిమాలేంటి?

స) ప్రస్తుతం ‘పెళ్ళికి ముందు ప్రేమకథ’, ‘డాలర్స్ కాలనీ’ సినిమాల్లో నటిస్తున్నా. రామ్ హీరోగా రూపొందుతోన్న ‘హరికథ’లో ఓ కీలక పాత్ర పోషిస్తున్నా.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు