గతంలో ఎన్నో సూపర్ హిట్ సినిమాలకు పంపిణిదారుడిగా పనిచేసిన అనుభవమున్న డి.వి. సీతారామరాజు, తన కుమారుడు సాయి కార్తీక్‌ని హీరోగా పరిచయం చేస్తూ రూపొందించిన సినిమాయే ‘టిప్పు’. కనికా కపూర్, ఫమేలా హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా ద్వారా జగదీష్ దర్శకుడిగా పరిచయం కానున్నారు. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ సినిమా జూన్ 19న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా హీరో కార్తీక్‌తో జరిపిన ఇంటర్వ్యూ విశేషాలు..
ప్రశ్న) చిన్నప్పటి నుంచే హీరో అవ్వాలనే ఆలోచన లేక మధ్యలో ఏమన్నా స్ఫూర్తి తీసుకొని హీరో అవ్వలనుకున్నారా?
స) చిన్నప్పట్నుంచీ సినిమా కుటుంబంలో పెరగడంతో సినిమాలపై ఆసక్తి ఉండేది. సినిమా షూటింగ్‌లకు వెళ్ళినప్పుడు అక్కడి వాతావరణం బాగా నచ్చేది. అలా నాకు ఏడేళ్ళు ఉన్నప్పట్నుంచే హీరో అయిపోవాలనుకున్నా. ‘మనం హీరోగా చేయొచ్చు’ అనే వయసొచ్చాక, సత్యానంద్ గారి దగ్గర యాక్టింగ్ కోర్సు చేశాను. అదే విధంగా ఫైట్లు, డ్యాన్సులు అన్నీ నేర్చుకున్నాకే టిప్పు సినిమా మొదలుపెట్టాను.
ప్రశ్న) టిప్పు సినిమా గురించి చెప్పండి?
స) టిప్పు మైసూర్ నేపథ్యంలో సాగే యాక్షన్ ఎంటర్‌టైనర్. ఈ సినిమాలో ప్రేక్షకులు కోరుకునే అన్ని అంశాలూ మెండుగా ఉన్నాయి. కామెడీ, యాక్షన్, లవ్ ఇలా అన్నీ కలిసిన కంప్లీట్ కమర్షియల్ ఎంటర్‌టైనర్ ఈ సినిమా.
ప్రశ్న) ఈ సినిమాలో మీ రోల్ గురించి చెప్పండి?
స) ఈ సినిమాలో నేనో ఎన్నారైగా కనిపిస్తా. జాలీగా గడిచిపోయే అతడి జీవితంలోని ఓ చిన్న ఫ్లాష్‌బ్యాక్ చుట్టూ ఈ కథ తిరుగుతుంది. ఈ పాత్రలో చాలా వేరియేషన్లున్నాయి.
ప్రశ్న) మొదటి సినిమా అనుభవం ఎలా ఉంది?
స) చిన్నప్పట్నుంచీ సినిమా వాతావరణంలోనే పెరగడంతో మొదటి సినిమా అనే ఆలోచన రాలేదు. అయితే మొదట్లో కెమెరా ముందుకు వచ్చినపుడు కొంత భయమేసింది. ఆ తర్వాత కొద్దిరోజులకు ఇబ్బంది అనిపించలేదు. ఒకవైపు ప్రొడక్షన్, మరోవైపు యాక్టింగ్ ఇలా మొదటి సినిమాతోనే చాలా నేర్చుకునే అవకాశం దక్కింది.
ప్రశ్న) దర్శకుడు జగదీష్ గురించి చెప్పండి?
స) కొత్త దర్శకుడైనా ఆయనకు సినిమాపై మంచి అవగాహన ఉంది. ఓ సినిమా బాగా రావడానికి ఏయే విషయాలు ప్రభావితం చేస్తాయనేది సరిగ్గా తెలిసి ఉన్న దర్శకుడు. కొంత షూట్ పూర్తయ్యాక.. నేను గానీ, దర్శకుడు గానీ కొత్తవాళ్ళమనే ఆలోచనే లేకుండా పని చేశాం.
ప్రశ్న) ఈ సినిమాకు మేజర్ హైలైట్స్ ఏంటి?
స) సెకండాఫ్‌లోని ఎంటర్‌టైన్‌మెంట్ ఈ సినిమాకు మేజర్ హైలైట్‌గా నిలుస్తుంది. ఎమ్.ఎస్.నారాయణ గారు కనిపించేది కొద్దిసేపే అయినా, ఆయన తన మార్క్ కామెడీతో ఆకట్టుకుంటారు. మణిశర్మ అందించిన మ్యూజిక్, సినిమాటోగ్రఫీ ఈ సినిమాకు మేజర్ అట్రాక్షన్‌గా నిలుస్తాయి.
ప్రశ్న) మీ తరువాతి సినిమా ఏంటి? ఎలాంటి సినిమాలు చేయాలనుకుంటున్నారు?
స) ప్రస్తుతం టీవీ సీరియల్ దర్శకురాలు చునియా దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నా. దానికింకా టైటిల్ ఖరారు కాలేదు. మరో సినిమా డిస్కషన్‌లో ఉంది. ప్రత్యేకంగా ఇలాంటి సినిమాలే చేయాలని ఎప్పుడూ అనుకోలేదు. లవ్, యాక్షన్ ఇలా అన్ని రకాల సినిమాలు చేయాలనుంది.