నందమూరి బాలకృష్ణ 50 ఏళ్ల సినీ ప్రస్థానానికి సంబంధించి తెలుగు సినీ పరిశ్రమ ఘనమైన వేడుకలను నిర్వహించేందుకు సిద్ధమయింది. ఇప్పటికే ఈ వేడుకకి సంబంధించిన ఏర్పాట్లు జోరుగా సాగుతున్నాయి. సినీ పరిశ్రమలోని ప్రముఖులతో పాటు రాజకీయ ప్రముఖులు కూడా ఈ గ్రాండ్ ఈవెంట్‌కి హాజరు కానున్నారు. ఇక ఈ ఈవెంట్‌కి సంబంధించిన ఆహ్వాన పత్రిక తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఈ ఆహ్వాన పత్రికలో నందమూరి బాలకృష్ణ సినీ జీవితంలోని పలు ఆసక్తికర విషయాలను ఇందులో రివీల్ చేశారు. 1974-2024 వరకు ఈ 50 ఏళ్లలో బాలయ్య తన సినిమాలతో ప్రేక్షకులను అలరించారు. ఆయన తన కెరీర్‌లో 109 సినిమాలు చేశారని.. అందులో అన్ని హీరో/లీడ్ రోల్స్ మాత్రమే చేశారని.. 129 మంది హీరోయిన్లతో బాలకృష్ణ నటించారని ఇందులో పేర్కొన్నారు. ఆయన సినిమాలు రూ.10 లక్షల నుంచి రూ.250 కోట్ల వరకు వసూల్లు రాబట్టాయని.. 10 ఫీట్ల నుంచి 108 ఫీట్ల కటౌట్స్ ఉన్న హీరో బాలకృష్ణ అని ఇందులో వెల్లడించారు. ఆయన సినిమాలు 100 రోజుల నుంచి 1000 రోజులు ఆడి రికార్డులు క్రియేట్ చేశాయని.. రాజకీయాల్లో ఎన్టీఆర్ తరువాత హ్యాట్రిక్ ఎమ్మెల్యే అయిన సినిమా రంగం వ్యక్తి బాలకృష్ణ ఒక్కరే అని ఈ ఆహ్వాన పత్రికలో పేర్కొన్నారు.
సినిమా, సామాజిక సేవ, టీవీ రంగం, రాజకీయాల్లో తనదైన ముద్ర వేసుకున్న నందమూరి బాలకృష్ణ 50 ఏళ్ల సినీ ప్రస్థానం వేడుకను సెప్టెంబర్ 1న హైదరాబాద్‌లోని నోవోటెల్ హైటెక్స్‌లో సాయంత్రం 6 గంటల నుంచి వైభవంగా నిర్వహిస్తున్నారు ఈ ఆహ్వాన పత్రికలో ముద్రించారు. ఇక తమ అభిమాన నటుడి 50 ఏళ్ల సినీ ప్రస్థానం వేడుకలకు నందమూరి అభిమానులు భారీ సంఖ్యలో హాజరయ్యేందుకు సిద్ధమవుతున్నారు.